ICC Cricketer of the Year
-
విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. యాభై ఓవర్ల క్రికెట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది. కాగా 2023లో కోహ్లి వింటేజ్ విరాట్ కోహ్లిని గుర్తుచేస్తూ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023లో బ్యాట్ ఝులిపించి ఆకాశమే హద్దుగా చెలరేగాడు భారత్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్లో ఈ వన్‌డౌన్ బ్యాటర్ 11 ఇన్నింగ్స్‌లో కలిపి 765 పరుగులు సాధించాడు. తద్వారా టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట చెక్కు చెదరకుండా ఉన్న వన్డే సెంచరీల రికార్డును కూడా కింగ్ కోహ్లి 2023లోనే బద్దలు కొట్టాడు. ప్రపంచకప్-2023 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి తన 50వ వన్డే శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా సచిన్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసి.. వన్డే రారాజుగా అవతరించాడు. సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఒకే ఒక్కడు కాగా విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 2012, 2017, 2018లో కింగ్ ఈ పురస్కారాలు అందుకున్నాడు. తాజాగా మరోసారి అవార్డును తన కైవసం చేసుకున్న కోహ్లి.. ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. క్రికెట్ ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్, మాజీ క్రికెటర్ ఏబీడీ గతంలో మూడుసార్లు ఈ అవార్డు గెలిచాడు. -
బాబర్ ఆజమ్‌కు డబుల్ ధమాకా.. వన్డే క్రికెటర్ అవార్డుతో పాటు ఐసీసీ అత్యున్నత ట్రోఫీ
Sir Garfield Sobers Trophy 2022: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ఈ ఏడాది ఐసీసీ అవార్డుల పంట పండింది. ఇప్పటికే ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డు దక్కించుకున్న బాబర్.. తాజాగా ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఇందుకు గానూ ఐసీసీ బాబర్‌ను సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ-2022తో సత్కరించింది. ఈ అవార్డు రేసులో బాబర్‌తో పాటు ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలు పోటీ పడినప్పటికీ, ఐసీసీ వరల్డ్ గవర్నింగ్ బాడీ బాబర్ వైపే మొగ్గుచూపింది. బాబర్ 2022లో అన్ని ఫార్మాట్లలో కలిపి 44 మ్యాచ్‌ల్లో 54.12 సగటున 2598 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఐసీసీ బాబర్‌ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. Double delight for Babar Azam 🤩After being named the ICC Men's ODI Cricketer of the Year, the Pakistan star bags the Sir Garfield Sobers Trophy for the ICC Men's Cricketer of the Year 👏#ICCAwards— ICC (@ICC) January 26, 2023 2021లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న బాబర్.. వరుసగా రెండో ఏడాది కూడా అవార్డు దక్కించుకున్నాడు. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి తర్వాత వరుసగా రెండో ఏడాది ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న ఆటగాడిగా బాబర్ రికార్డులకెక్కాడు. 2022లో బాబర్ 9 వన్డేల్లో 84.87 సగటున మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 679 పరుగులు చేశాడు. ప్రస్తుతం బాబర్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. 2021 జూలైలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్న బాబర్.. దాదాపు ఏడాదిన్నరగా ఐసీసీ టాప్ వన్డే బ్యాటర్‌గా చలామణి అవుతున్నాడు. మరోవైపు, ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ అఫ్ ద ఇయర్ 2022 అవార్డును ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నతాలీ సీవర్ గెలుచుకుంది. సీవర్ గతేడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 33 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు, 1346 పరుగులు చేసింది. ఈ అవార్డుకు ముందు సీవర్ 2022 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకుంది. England's talismanic all-rounder caps off a phenomenal 2022 with the Rachael Heyhoe Flint Trophy for ICC Women’s Cricketer of the Year 👌#ICCAwards— ICC (@ICC) January 26, 2023 ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ అఫ్ ద ఇయర్ 2022 అవార్డు గెలుచుకున్నందుకు గానూ ఐసీసీ సీవర్‌ను రేచల్ హేహోయ్ ఫ్లింట్ ట్రోఫీతో (Rachael Heyhoe Flint Trophy) సత్కరించింది. కాగా, మెన్స్, వుమెన్స్ విభాగంలో వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు (2022) గెలిచిన ప్లేయర్లు (బాబర్, సీవర్) ఐసీసీ క్రికెటర్ అఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకోవడం విశేషం. -
ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- 2022 ఎవరంటే?
ICC Men’s Test Cricketer of the Year 2022: ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌ను వరించింది. గతేడాది అద్భుత ప్రదర్శనకు గానూ అతడికి ఈ గౌరవం లభించింది. జో రూట్ తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన ఈ ఆల్‌రౌండర్.. ఇటు ఆటగాడిగా.. అటు కెప్టెన్‌గా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా సూపర్ హిట్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి బజ్‌బాల్ విధానంతో సంప్రదాయ క్రికెట్లోనూ విధ్వంసకర ఆట తీరుతో జట్టును విజయపథంలో నడుపుతున్నాడు స్టోక్స్. వ్యక్తిగతంగానూ ఉత్తమంగా రాణిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. గతేడాది టెస్టుల్లో మొత్తంగా 870 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. అదే విధంగా 26 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైట్ఆర్మ్ మీడియం పేసర్. ఇంగ్లండ్‌కు సారథ్యం వహించిన 10 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు సాధించాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న స్టోక్స్‌ను టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికచేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి గురువారం వెల్లడించింది. కాగా ఐసీసీ టెస్టు జట్టుకు బెన్‌స్టోక్స్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. చదవండి: ICC ODI Cricketer: ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే? Rajat Patidar: అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు! కానీ.. -
అభిమానులనుద్దేశించి సూర్యకుమార్ ఎమోషనల్ పోస్టు
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ బుధవారం ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది అత్యద్భుత ప్రదర్శన కనబరిచినందుకుగానూ సూర్యకు ఈ అవార్డు లభించింది. 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. 31 మ్యాచ్‌లు ఆడి 187.43 స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే తనకు అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యకుమార్ తన ఆనందాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ''ఇది నమ్మశక్యంగా లేదు. నేను ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికవుతానని ఊహించలేదు. కానీ నా ప్రదర్శనతోనే అవార్డు రావడం సంతోషం కలిగించింది. ఇన్నాళ్లు మీరిచ్చిన ప్రోత్సాహం, మద్దతుకు మీకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నా జర్నీలో భాగమైన ప్రతీ ఒక్కరికి ఈ అవార్డు అంకితం. నా కోచ్, ఫ్యామిలీ, స్నేహితులు, జట్టు సభ్యులు.. ప్రియమైన అభిమానులు మీరంతా నన్ను నడిపిస్తున్న డ్రైవింగ్ ఫోర్స్. గతేడాది మీ నుంచి ఆశీర్వాదాలు అందుకోవడంతో పాటు కొన్ని మరిచిపోలేని అనుభూతులు సంపాదించాను. అందులో టి20 క్రికెట్లో దేశం తరపున తొలి శతకం బాదడం మంచి ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఏడాది చివర్లో కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నా. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే.. కష్టపడేతత్వం, నిజాయితీ. 2022 ఏడాది ఇచ్చిన ఆనందాన్ని నెమరువేసుకుంటూ మరో ఏడాదిలోకి అడుగుపెట్టా. ఈ ఏడాది కూడా నా ఆటతీరుతో మరింత సాధించాలనుకుంటున్నా. అందుకు మీ మద్దతు అవసరం. సరే మరి ఇక మైదానంలో కలుద్దాం'' అంటూ పేర్కొన్నాడు. 𝙏𝙝𝙖𝙣𝙠𝙛𝙪𝙡. 𝙂𝙧𝙖𝙩𝙚𝙛𝙪𝙡. 𝘽𝙡𝙚𝙨𝙨𝙚𝙙. ♥️ pic.twitter.com/eV4n2r5pyG — Surya Kumar Yadav (@surya_14kumar) January 25, 2023 చదవండి: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టీమిండియా స్టార్ -
ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టీమిండియా స్టార్
ICC Men's T20I Cricketer of the Year 2022: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022గా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ మిస్టర్ ప్లేయర్‌ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం వెల్లడించింది. కాగా 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. 31 మ్యాచ్‌లు ఆడి 187.43 స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది పలు కీలక మ్యాచ్‌లలో టీమిండియాను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన ఈ ముంబై బ్యాటర్ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా ఎదిగాడు. ఈ క్రమంలో అనేక రికార్డులు సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. మొత్తంగా 68 సిక్సర్లు బాది.. పొట్టిఫార్మాట్లో ఏడాది కాలంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా సూర్య నిలిచాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీలో సూర్య అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో ఆరు ఇన్నింగ్స్‌లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. 189కి పైగా స్ట్రైక్‌రేటుతో దుమ్మురేపాడు. ఆ సెంచరీ ప్రత్యేకం ఇక ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండో సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో 890 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో నాటింగ్‌హాం మ్యాచ్‌లో భాగంగా సూర్య తన కెరీర్లో తొలి అంతర్జాతీయ శతకం బాదిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 117 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు సూర్య. చదవండి: ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్‌గా సిరాజ్ -
ఏకైక భారత ప్లేయర్‌గా స్మృతి మంధాన! బాబర్, స్టోక్స్‌తో పాటు..
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక అవార్డుల్లో భాగంగా మహిళల విభాగంలో ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం రేసులో భారత స్టార్ స్మృతి మంధాన నిలిచింది. శుక్రవారం ఐసీసీ ఈ విభాగంలో నలుగురు క్రికెటర్లను నామినేట్ చేసింది. భారత్ నుంచి స్టార్ ఓపెనర్ స్మృతి రెండుసార్లు (2018, 2021), జులన్ గోస్వామి (2007) ఒకసారి ఈ పురస్కారం గెల్చుకున్నారు. గురువారం ప్రకటించిన టి20 ‘మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు కూడా స్మృతి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఏకైక భారత క్రికెటర్ ఇక పురుషుల విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, ఇంగ్లండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా సహా న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్ టిమ్ సౌథీ ఈ ప్రతిష్టాత్మక పురస్కార రేసులో నిలిచారు. భారత పురుషుల క్రికెట్ జట్టు నుంచి ఒక్కరు కూడా ఈ లిస్టులో లేరు. దీంతో భారత్ నుంచి రేసులో నిలిచిన ఏకైక ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఇది కూడా చదవండి: Ranji Trophy: తదుపరి మ్యాచ్ ఆంధ్రతో సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అస్సాం జట్టుతో ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ముగిసిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి రోజు విజయానికి మరో 22 పరుగులు చేయాల్సిన హైదరాబాద్ శుక్రవారం ఐదు బంతుల్లో కేవలం మూడు పరుగులు జోడించి మిగిలిన ఒక వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 228/9తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 61.5 ఓవర్లలో 231 పరుగులవద్ద ఆలౌటైంది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (158 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. శుక్రవారం ఉదయం రియాన్ పరాగ్ ఓవర్ వేయగా... తన్మయ్ నాలుగు బంతులు ఆడి మూడు పరుగులు చేసి సహచరుడు కార్తికేయ (3 బంతుల్లో 1)కు ఐదో బంతికి స్ట్రయికింగ్ ఇచ్చాడు. రియాన్ వేసిన ఐదో బంతికి కార్తికేయ వికెట్లముందు దొరికిపోయాడు. దాంతో హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు తెరపడగా... అస్సాం అద్భుత విజయాన్ని అందుకుంది. తమిళనాడుతో తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన హైదరాబాద్... రెండో మ్యాచ్‌లో ముంబై చేతిలో ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఓడిపోయింది. జనవరి 3 నుంచి విశాఖపట్నంలో జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో హైదరాబాద్ తలపడుతుంది. సంక్షిప్త స్కోర్లు అస్సాం తొలి ఇన్నింగ్స్: 205; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 208; అస్సాం రెండో ఇన్నింగ్స్: 252; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (61.5 ఓవర్లలో) (తన్మయ్ అగర్వాల్ 126 నాటౌట్, భావేశ్ సేథ్ 41, రాహుల్ బుద్ధి 28, రియాన్ పరాగ్ 4/93, స్వరూపం 2/49, గోకుల్ శర్మ 2/23). చదవండి: క్రికెటర్ల ప్రాణం మీదకు తెచ్చిన రోడ్డు ప్రమాదాలు Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు! -
భారత జట్టును గెలిపిస్తా.. వరల్డ్‌కప్ గెలవడమే ఏకైక లక్ష్యం
దుబాయ్: భారత అగ్రశ్రేణి క్రికెటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యుత్తమ పురస్కారానికి ఎంపికైంది. 2021 ఏడాదికి గాను మహిళల విభాగంలో ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును స్మృతి గెలుచుకుంది. మూడు ఫార్మాట్లలోనూ ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఎడంచేతి వాటం ఓపెనర్ అయిన స్మృతి గత ఏడాది 22 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 38.86 సగటుతో 855 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన భారత తొలి డే అండ్ నైట్ టెస్టులో 127 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం ఈ ఏడాది స్మృతి అత్యుత్తమ ప్రదర్శన. విజేతగా నిలిచిన ఆమె ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పేరిట నెలకొల్పిన ‘రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ’ని అందుకోనుంది. స్మృతి ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికవడం ఇది రెండోసారి. 2018లో ఈ అవార్డుతో పాటు ఆమె ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా కూడా నిలిచింది. మహిళల విభాగంలో ట్యామీ బీమాంట్ (టి20), లిజెల్ లీ (వన్డే) అత్యుత్తమ ప్లేయర్లుగా నిలిచారు. భారత జట్టును గెలిపిస్తా.. వరల్డ్‌కప్ గెలవడమే ఏకైక లక్ష్యం ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్‌గా ఎంపిక కావడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ప్రతికూల పరిస్థితుల నడుమ గత ఏడాది నేను ప్రదర్శించిన ఆటకు ఐసీసీ నుంచి గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. మున్ముందు మరింత బాగా ఆడి భారత జట్టును గెలిపించడంలో ఇది నాకు ప్రేరణ అందిస్తుంది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, సన్నిహితులందరికీ నా కృతజ్ఞతలు. వచ్చే నెలలో జరిగే ప్రపంచకప్‌ను గెలుచుకోవాలనేదే మా ఏకైక లక్ష్యం. అందుకోసం మా జట్టంతా కలిసికట్టుగా శ్రమిస్తోంది. –స్మృతి మంధాన చదవండి: Dinesh Karthik: టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్‌పై ప్రశంసలు కురిపించిన డీకే -
టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021 ఎవరంటే..!
Mohammad Rizwan Named T20 Cricketer Of The Year: 2021వ సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టీ20 క్రికెటర్ అవార్డుకు పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఆదివారం ప్రకటించింది. గతేడాది పొట్టి ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రిజ్వాన్.. 29 మ్యాచ్‌ల్లో 73.66 సగటున 1326 పరుగులు బాదాడు. అతని స్ట్రయిక్ రేట్ 134.89గా ఉంది. బ్యాటింగ్‌లో మెరుపులతో పాటు వికెట్‌కీపింగ్‌లోనూ సత్తా చాటిన రిజ్వాన్.. గతేడాది పాక్ సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. Sheer Consistency, indomitable spirit and some breathtaking knocks 🔥 2021 was memorable for Mohammad Rizwan 👊 More 👉 https://t.co/9guq9xKOod pic.twitter.com/6VZo7aaRIA — ICC (@ICC) January 23, 2022 టీ20 ప్రపంచకప్ 2021లో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచిన అతను.. తన జట్టు సెమీస్ చేరేందుకు తోడ్పడ్డాడు. కెరీర్లో ఇప్పటివరకు 19 టెస్ట్‌లు, 41 వన్డేలు, 55 టీ20లు ఆడిన రిజ్వాన్.. 3500కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, గతేడాది అసోసియేట్ దేశాల అత్యుత్తమ టీ20 క్రికెటర్ అవార్డును ఒమన్‌కు చెందిన జీషన్ మక్సూద్ గెలుచుకున్నాడు. ఒమన్ జట్టును సమర్ధవంతంగా నడిపించడంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించినందుకు గాను మక్సూద్ను ఈ అవార్డు వరించింది. చదవండి: ICC Award: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ఘనత.. టేక్ ఏ బౌ అన్న ఐసీసీ -
ఒకేఒక్కడు కోహ్లి.. ఐసీసీ అవార్డులు క్లీన్‌స్వీప్
ఏమని చెప్పినా.. ఎంతని పొగిడినా అతని గురించి తక్కువే.. క్రికెట్ కోసమే అతడు పుట్టాడేమో అనే అనుమానం కలిగించే ఆట అతడి సొంతం.. అతడి ఆట చూసి అసూయపడని క్రికెటర్ ఉండకపోవచ్చు. ఇక ఈ ఆటగాడి యుగంలో మేము ఆడనందుకు సంతోషిస్తున్నామని అనుకోని మాజీ దిగ్గజ బౌలర్లు ఉండకపోవచ్చు. అతడికి సాధ్యం కానిది ఏమీ లేదు అంటే అతిశయోక్తి కాదు. మరికొంత కాలం అతడి ఆట ఇలాగే కొనసాగితే సాధించేందుకు రికార్డులు, భవిష్యత్‌లో సాధించే ఆటగాళ్లు బహుశా ఉండకపోవచ్చు. క్రికెట్ చరిత్రలోనే ఒకే ఏడాది మూడు ఐసీసీ ప్రధాన అవార్డులు గెలుచుకున్న ఏకైక ఆటగాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లి. ఆటగాడిగా, సారథిగా రికార్డులు మీద రికార్డులు, అవార్డుల మీద అవార్డులు అంతకుమించి అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. దుబాయ్: అవార్డుల జాబితాలో ఎక్కడ చూసినా విరాట్ కోహ్లి పేరే. ప్రింటింగ్ తప్పుపడిందనుకుంటే పొరపాటే. ఆటపై అతడికి ఉన్న కమిట్మెంట్కు అవార్డులు క్యూ కట్టాయి. 2018 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఏడాది మూడు ఐసీసీ ప్రధాన అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులే కాక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికై సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు అందుకున్నాడు. అంతేకాకుండా ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు సారథిగా కూడా కోహ్లినే ఎంపికయ్యాడు. గతేడాది 13 టెస్టుల్లో 55కు పైగా సగటుతో 1,322 పరుగుల చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ ఎదురులేని కోహ్లి 14 వన్డేల్లో 133.55 సగటుతో 1202 పరుగులు చేయగా ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా గతేడాది మొత్తం 37 మ్యాచ్‌ల్లో(టీ20లతో సహా) 68.37 సగటుతో 2,735 పరుగులు సాధించగా, మొత్తం 11 సెంచరీలు, 9 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇక ఎందరో టీమిండియా మహామహా సారథులకు సాధ్యంకాని విజయాలు కోహ్లి కెప్టెన్సీలో దక్కాయి. అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లు టీమిండియా గెలిచింది కోహ్లి సారథ్యంలోనే. అంతేకాకుండా టీమిండియాకు టెస్టుల్లో చాంపియన్‌షిప్ దక్కడంలో కోహ్లి పాత్ర మరవలేనిది. స్పందించిన విరాట్ కోహ్లీ.... ‘కష్టానికి ఫలితం దక్కింది. ఎంతో ఆనందంగా వుంది. అవార్డులను క్లీన్‌స్వీప్ చేసినందుకు గర్వంగా ఉంది’ అంటూ విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు. ఇక మరోవైపు ఇది.. ఓ అసాధారణమైన ప్రతిభకు దక్కిన గౌరవమని కోహ్లీని ఉద్దేశిస్తూ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా కోహ్లీని ఐసీసీ అవార్డ్లు వరించాయి. 2017 సంవత్సరానికి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా, 2012లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ICC Men's Cricketer of the Year ✅ ICC Men's Test Cricketer of the Year ✅ ICC Men's ODI Cricketer of the Year ✅ Captain of ICC Test Team of the Year ✅ Captain of ICC Men's ODI Team of the Year ✅ Let's hear from the man himself, @imvKohli! #ICCAwards 🏆 pic.twitter.com/3M2pxyC44n — ICC (@ICC) 22 January 2019 -
అశ్విన్‌కు సోబర్స్ ట్రోఫీ...
ధర్మశాల టెస్టు ముగిసిన తర్వాత భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రెండు పురస్కారాలను అందజేసింది. 2016 సంవత్సరానికి అశ్విన్ ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’... ‘ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేతులమీదుగా అశ్విన్ ‘గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ అందుకున్నాడు. ‘ఐసీసీ ద్వారా రెండు ఉత్తమ పురస్కారాలకు ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. స్వదేశంలో ఈ రెండు అవార్డులను అందుకున్నందుకు నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. ఈ సందర్భంగా నా సహచరులకు, కుటుంబసభ్యులకు, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. -
చెన్నై సూపర్ కింగ్...
సాక్షి క్రీడావిభాగం రవిచంద్రన్ అశ్విన్ మంచినీళ్ల ప్రాయంలా వరుస పెట్టి వికెట్లు తీయడం కొత్త కాదు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సింహస్వప్నంలా మారి కొత్త కొత్త రికార్డులు సృష్టించడం కూడా అతనికి ఇప్పుడు వాకింగ్‌కు వెళ్లినంత సాధారణంగా మారిపోయింది. తాజాగా వచ్చిన ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కూడా అతని అబ్బురపరిచే గణాంకాలకు లభించిన మరో గౌరవం. కానీ అశ్విన్ అంటే సాధారణ బౌలర్ మాత్రమే కాదు. అతడు ఒక జీనియస్. అతని ఖాతాలో వచ్చి పడిన ప్రతీ వికెట్ వెనక ఒక కథ ఉంటుంది. సాధారణంగా టీమ్ సమావేశాల్లో, కోచ్ చెప్పే సూచనలతో అమలు చేసే వ్యూహాలకు అశ్విన్ తన సొంత ఇంజనీరింగ్ బుర్రను జోడిస్తాడు. ఒక మంచి బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయాలంటే ఎంతగా శ్రమించాలో అంతగా హోంవర్క్ చేసి మైదానంలోకి అడుగు పెడతాడు. తాను వేసే ప్రతీ బంతి తన ఆఖరి బంతి అన్నంత కసితో బౌలింగ్ చేస్తాడు. గత ఏడాది సంగక్కరను నాలుగు ఇన్నింగ్స్‌లలో నాలుగు సార్లు అవుట్ చేయడం అయినా... ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రూట్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చే బలహీనతను గుర్తించి దానికి తగినట్లుగా బంతిని సంధించడం అయినా... వారిని అవుట్ చేయడంలో అతను చెప్పిన విశ్లేషణ అబ్బురపరుస్తుంది. అవసరానికి, పరిస్థితులకు తగినట్లుగా అతను తనను తాను మలచుకున్న తీరు అశ్విన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ముందు బ్యాట్స్‌మన్‌గా మొదలు పెట్టి, ఆ తర్వాత కాస్త మీడియం పేస్ బంతులు వేయగలిగిన బౌలర్, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్లలో ఒకడిగా ఎదిగాడు. తన మార్క్‌నుంచి రనప్ మొదలు పెట్టడం నుంచి మ్యాచ్ ముగిసే వరకు తాను ప్రతీ బంతి ఎలా వేశాడో మైండ్‌లో ఫిక్స్ చేసుకోగలిగిన అశ్విన్, వేలాది గంటల నెట్ ప్రాక్టీస్‌కంటే విలువైన పాఠాలు మ్యాచ్‌నుంచే నేర్చుకుంటాడు. స్కూల్ స్థాయి క్రికెట్లోనే తనకు ఫలానా విధంగా ఫీల్డింగ్ కావాలంటూ కోచ్‌తో వాదన పెట్టుకున్న అశ్విన్‌కు తన తెలివితేటలపై అపార నమ్మకం ఉంది. జిమ్‌లో ఎన్ని గంటలు గడిపినా సహచరులతో పోలిస్తే మైదానంలో చురుగ్గా మారలేనని గుర్తించిన అతను, ఆటకు అవసరం కాబట్టి వికెట్ల మధ్య పరుగెత్తడంలో ప్రత్యేక కోచ్‌ను పెట్టుకొని మరీ సాధన చేశాడు. ఒక దశలో వరుసగా ఆరు టెస్టుల్లో అతడికి అవకాశం దక్కని సమయంలోనూ నేను అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతాను అంటూ తన యాక్షన్‌ను మార్చుకొని మరీ సంచలనాలకు శ్రీకారం చుట్టడం అశ్విన్‌కే సాధ్యమైంది. బౌలింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న సమయంలోనూ నాకెందుకీ బ్యాటింగ్ తలనొప్పి అన్నట్లుగా అతను దూరం జరిగిపోలేదు. బ్యాటింగ్‌ను కూడా అంతే ప్రేమించాడు. అదే స్థాయిలో కష్టపడి ఇప్పుడు బ్యాట్స్‌మన్‌గా కూడా అవతలి జట్టుకు చెమటలు పట్టిస్తున్నాడు. క్రికెట్‌కు సంబంధించిన ప్రతీ సూక్ష్మమైన అంశంపై అతనికి పట్టుంది. తాను మ్యాచ్ ఆడని సమయంలో టీవీలో చాలా ఎక్కువగా క్రికెట్ చూస్తాడు. అది జింబాబ్వే ఆడుతున్న సిరీస్ అయినా సరే. ఏదో సరదా కోసమో, పేపర్లో ఫొటో కోసమో కాకుండా ఆటపై ఇష్టంతో ఇటీవలే చెన్నైలో అతను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాడు. అక్కడ కూడా అంతర్జాతీయ మ్యాచ్ ఆడినంత సీరియస్‌గా తన దూస్రాలతో బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడమే లక్ష్యంగా శ్రమించాడు. నా ఆట తప్ప నేనేమీ పట్టించుకోను అంటూ చెప్పుకునే టైపు క్రికెటర్ కాదు అతను. అతను పత్రికలు చదువుతాడు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తాడు. అది పిచ్‌పై వచ్చిన విమర్శలపై అయినా, చకింగ్ గురించైనా, లేదంటే హర్భజన్‌తో పోలిక అయినా సరే. తాజాగా ముంబై టెస్టులో తన కెప్టెన్‌పై అండర్సన్ చేసిన వ్యాఖ్యలపై అతనితోనే నేరుగా తలపడటం అశ్విన్ ముక్కుసూటితనాన్ని చూపిస్తుంది. మీడియా సమావేశంలో కూడా డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా జవాబివ్వడంలో అశ్విన్ తర్వాతే ఎవరైనా. ట్విట్టర్‌ను ఏదో నామ్‌కే వాస్తేగా వాడకుండా దానిని సమర్థంగా వినియోగించే భారత క్రికెటర్ అశ్విన్ ఒక్కడే. ఎంతటి కీర్తి కనకాదులు వచ్చిన తర్వాత కూడా ఇతర తమిళనాడు క్రికెటర్ల తరహాలో హై క్లాస్ ఏరియాలోకి మారకుండా అతను తన పాత లొకాలిటీలో, అదే ఇంట్లో ఇప్పటికీ ఉంటున్నాడు. అసంఖ్యాకమైన చెన్నైయిన్లలాగే రజినీకాంత్, కమల్‌హాసన్‌లతో పాటు ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడే ఈ స్టార్ ఆటగాడు భారత క్రికెట్‌పై వేసిన ముద్ర ప్రత్యేకం. -
క్రికెటర్ ఆఫ్ ద ఇయర్.. అశ్విన్
-
క్రికెటర్ ఆఫ్ ద ఇయర్.. అశ్విన్
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గెలుచుకున్నాడు. సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కూడా అతడు గెలుచుకున్నాడు. ఇక ఐసీసీ ఈ సంవత్సరానికి టెస్ట్, వన్డే టీమ్‌లను ప్రకటించింది. వన్డే టీమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా ఆలిస్టర్ కుక్ ఎంపికయ్యారు. క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, గ్యారీ కిర్‌స్టెన్, కుమార సంగక్కర ఈ జట్లను ఎంపిక చేశారు. 2015 సెప్టెంబర్ 14 నుంచి 2016 సెప్టెంబర్ 20వ తేదీ వరకు వాళ్లు చూపిన ప్రతిభ ఆధారంగా ఈ జట్లను ఎంచుకున్నారు. టెస్టు జట్టులో నలుగురు ఇంగ్లండ్ క్రికెటర్లు, ముగ్గురు ఆస్ట్రేలియన్లు, ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. కుక్‌ను టెస్టు కెప్టెన్‌గా ఎంపిక చేయడం ఇది మూడోసారి. డేల్ స్టైన్ జట్టుకు ఎంపిక కావడం తొమ్మిదేళ్లలో ఎనిమిదోసారి. జో రూట్, డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్ వరుసగా మూడో ఏడాది కూడా ఎంపికయ్యారు. ఇక వన్డే జట్టులో మనవాళ్లు ముగ్గురు ఎంపికయ్యారు. కెప్టెన్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు కూడా చోటు దక్కింది. జట్ల వివరాలు ఇలా ఉన్నాయి... ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2016 (బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం): 1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 2. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా - వికెట్ కీపర్) 3. రోహిత్ శర్మ (ఇండియా) 4. విరాట్ కోహ్లీ (కెప్టెన్ -ఇండియా) 5. ఏబీ డివీలియర్స్ (దక్షిణాఫ్రికా) 6. జాస్ బట్లర్ (ఇంగ్లండ్) 7. మిషెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) 8. రవీంద్ర జడేజా (ఇండియా) 9. మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) 10. కగిసో రబడా (దక్షిణాఫ్రికా) 11. సునీల్ నరైన్ (వెస్టిండీస్) 12. ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా) ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2016 (బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం): 1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 2. అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్ - కెప్టెన్) 3. కేన్ విలియంసన్ (న్యూజిలాండ్) 4. జో రూట్ (ఇంగ్లండ్) 5. ఆడమ్ వోగ్స్ (ఆస్ట్రేలియా) 6. జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్ - వికెట్ కీపర్) 7. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) 8. రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా) 9. రంగనా హీరత్ (శ్రీలంక) 10. మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) 11. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) 12. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)