టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. యాభై ఓవర్ల క్రికెట్‌లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ రన్‌మెషీన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ మేరకు పురస్కారంతో గౌరవించింది.
కాగా 2023లో కోహ్లి వింటేజ్ విరాట్ కోహ్లిని గుర్తుచేస్తూ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023లో బ్యాట్ ఝులిపించి ఆకాశమే హద్దుగా చెలరేగాడు
భారత్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్లో ఈ వన్‌డౌన్ బ్యాటర్ 11 ఇన్నింగ్స్‌లో కలిపి 765 పరుగులు సాధించాడు. తద్వారా టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు.
అంతేకాదు.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట చెక్కు చెదరకుండా ఉన్న వన్డే సెంచరీల రికార్డును కూడా కింగ్ కోహ్లి 2023లోనే బద్దలు కొట్టాడు. ప్రపంచకప్-2023 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి తన 50వ వన్డే శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా సచిన్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసి.. వన్డే రారాజుగా అవతరించాడు.
సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
కాగా విరాట్ కోహ్లి ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 2012, 2017, 2018లో కింగ్ ఈ పురస్కారాలు అందుకున్నాడు. తాజాగా మరోసారి అవార్డును తన కైవసం చేసుకున్న కోహ్లి.. ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు.
క్రికెట్ ప్రపంచంలో అత్యధికసార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్, మాజీ క్రికెటర్ ఏబీడీ గతంలో మూడుసార్లు ఈ అవార్డు గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment