
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ బుధవారం ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది అత్యద్భుత ప్రదర్శన కనబరిచినందుకుగానూ సూర్యకు ఈ అవార్డు లభించింది. 2022లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. 31 మ్యాచ్‌లు ఆడి 187.43 స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే తనకు అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యకుమార్ తన ఆనందాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
''ఇది నమ్మశక్యంగా లేదు. నేను ఐసీసీ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికవుతానని ఊహించలేదు. కానీ నా ప్రదర్శనతోనే అవార్డు రావడం సంతోషం కలిగించింది. ఇన్నాళ్లు మీరిచ్చిన ప్రోత్సాహం, మద్దతుకు మీకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నా జర్నీలో భాగమైన ప్రతీ ఒక్కరికి ఈ అవార్డు అంకితం. నా కోచ్, ఫ్యామిలీ, స్నేహితులు, జట్టు సభ్యులు.. ప్రియమైన అభిమానులు మీరంతా నన్ను నడిపిస్తున్న డ్రైవింగ్ ఫోర్స్.
గతేడాది మీ నుంచి ఆశీర్వాదాలు అందుకోవడంతో పాటు కొన్ని మరిచిపోలేని అనుభూతులు సంపాదించాను. అందులో టి20 క్రికెట్‌లో దేశం తరపున తొలి శతకం బాదడం మంచి ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఏడాది చివర్లో కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నా. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే.. కష్టపడేతత్వం, నిజాయితీ. 2022 ఏడాది ఇచ్చిన ఆనందాన్ని నెమరువేసుకుంటూ మరో ఏడాదిలోకి అడుగుపెట్టా. ఈ ఏడాది కూడా నా ఆటతీరుతో మరింత సాధించాలనుకుంటున్నా. అందుకు మీ మద్దతు అవసరం. సరే మరి ఇక మైదానంలో కలుద్దాం'' అంటూ పేర్కొన్నాడు.
𝙏𝙝𝙖𝙣𝙠𝙛𝙪𝙡. 𝙂𝙧𝙖𝙩𝙚𝙛𝙪𝙡. 𝘽𝙡𝙚𝙨𝙨𝙚𝙙. ♥️ pic.twitter.com/eV4n2r5pyG
— Surya Kumar Yadav (@surya_14kumar) January 25, 2023
చదవండి: ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టీమిండియా స్టార్