అభి"షేక్‌" శర్మ.. రసెల్‌, హెడ్‌ కూడా దిగదుడుపే..! | Abhishek Sharma Has Highest Strike Rate in T20s In 2024 | Sakshi
Sakshi News home page

అభి"షేక్‌" శర్మ.. రసెల్‌, హెడ్‌ కూడా దిగదుడుపే..!

Published Tue, Jul 9 2024 2:53 PM | Last Updated on Tue, Jul 9 2024 3:16 PM

Abhishek Sharma Has Highest Strike Rate in T20s In 2024

భారత యువ కెరటం​ అభిషేక్‌ శర్మ పొట్టి క్రికెట్‌లో సరికొత్త సంచలనంగా మారాడు. రెండ్రోజుల కిందట జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేసిన శర్మ.. ఈ ఏడాది ఆరంభం నుంచే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం మొదలుపెట్టాడు.

ఈ ఏడాది ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన శర్మ.. 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 584 పరుగులు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి క్రికెట్‌లో ఈ ఏడాది ఇంత స్ట్రయిక్‌రేట్‌ ఎవ్వరికీ లేదు. అభిషేక​ ముందు ఆండ్రీ రసెల్‌ (199.47), జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (194.13), ట్రవిస్‌ హెడ్‌ (176.24), ఫిలిప్‌ సాల్ట్‌ (172.67) కూడా దిగదుడుపే.

ఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్‌ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌ (47 బంతుల్లో 77 నాటౌట్‌; 11 ఫోర్లు, సిక్సర్‌), రింకూ సింగ్‌ (22 బంతుల్లో 48 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారీ స్కోర్‌ (2 వికెట్ల నష్టానికి 234 పరుగులు) చేసింది. 

అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్‌ కుమార్‌ (3.4-0-37-3), ఆవేశ్‌ ఖాన్‌ (3-0-15-3), రవి బిష్ణోయ్‌ (4-0-11-2), వాషింగ్టన్‌ సుందర్‌ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్‌..‌ తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్‌ జులై 10న జరుగనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement