చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్‌.. అత్యంత వేగంగా..! | Glenn Maxwell Holds The Record For Being The Fastest Player To Score 10000 T20 Runs | Sakshi
Sakshi News home page

చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్‌.. అత్యంత వేగంగా..!

Published Sat, Nov 16 2024 6:40 PM | Last Updated on Sat, Nov 16 2024 7:00 PM

Glenn Maxwell Holds The Record For Being The Fastest Player To Score 10000 T20 Runs

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చరిత్రపుటల్లకెక్కాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్సీ.. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 10000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మ్యాక్సీకి ముందు ఈ రికార్డు కీరన్‌ పోలార్డ్‌ పేరిట ఉండేది. 

పోలీ 6640 బంతుల్లో 10000 పరుగుల మార్కును క్రాస్‌ చేయగా.. మ్యాక్సీ కేవలం 6505 బంతుల్లోనే ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో మ్యాక్సీ, పోలీ తర్వాత క్రిస్‌ గేల్‌ (6705), అలెక్స్‌ హేల్స్‌ (6774), జోస్‌ బట్లర్‌ (6928) ఉన్నారు.

పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్న మ్యాక్సీ..  పురుషుల క్రికెట్‌లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్‌గా.. అదే విధంగా మూడో ఆసీస్‌ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10031) కంటే ముందు డేవిడ్‌ వార్నర్‌(12411), ఆరోన్‌ ఫించ్‌(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌కు దక్కుతుంది. గేల్‌ ఈ ఫార్మాట్‌లో 10060 బంతులు ఎదుర్కొని 14562 పరుగులు చేశాడు.

కాగా, ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ మధ్య ఇవాళ (నవంబర్‌ 16) రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

సిడ్నీ వేదికగా జరిగిన ఇవాల్టి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్‌ (32) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హరీస్‌ రౌఫ్‌ (4/22), అబ్బాస్‌ అఫ్రిది (3/17), సూఫియాన్‌ ముఖీమ్‌ (2/21) ఆసీస్‌ పతనాన్ని శాశించారు.

అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. 19.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్‌ బౌలర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ ఐదు వికెట్లు తీసి పాక్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. ఆడమ్‌ జంపా రెండు, జేవియర్‌ బార్ట్‌లెట్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖాన్‌ (52) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement