ఏమని చెప్పినా.. ఎంతని పొగిడినా అతని గురించి తక్కువే.. క్రికెట్ కోసమే అతడు పుట్టాడేమో అనే అనుమానం కలిగించే ఆట అతడి సొంతం.. అతడి ఆట చూసి అసూయపడని క్రికెటర్ ఉండకపోవచ్చు. ఇక ఈ ఆటగాడి యుగంలో మేము ఆడనందుకు సంతోషిస్తున్నామని అనుకోని మాజీ దిగ్గజ బౌలర్లు ఉండకపోవచ్చు. అతడికి సాధ్యం కానిది ఏమీ లేదు అంటే అతిశయోక్తి కాదు. మరికొంత కాలం అతడి ఆట ఇలాగే కొనసాగితే సాధించేందుకు రికార్డులు, భవిష్యత్‌లో సాధించే ఆటగాళ్లు బహుశా ఉండకపోవచ్చు. క్రికెట్ చరిత్రలోనే ఒకే ఏడాది మూడు ఐసీసీ ప్రధాన అవార్డులు గెలుచుకున్న ఏకైక ఆటగాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లి. ఆటగాడిగా, సారథిగా రికార్డులు మీద రికార్డులు, అవార్డుల మీద అవార్డులు అంతకుమించి అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు.
దుబాయ్: అవార్డుల జాబితాలో ఎక్కడ చూసినా విరాట్ కోహ్లి పేరే. ప్రింటింగ్ తప్పుపడిందనుకుంటే పొరపాటే. ఆటపై అతడికి ఉన్న కమిట్‌మెంట్‌కు అవార్డులు క్యూ కట్టాయి. 2018 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఏడాది మూడు ఐసీసీ ప్రధాన అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులే కాక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికై సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు అందుకున్నాడు. అంతేకాకుండా ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు సారథిగా కూడా కోహ్లినే ఎంపికయ్యాడు.
గతేడాది 13 టెస్టుల్లో 55కు పైగా సగటుతో 1,322 పరుగుల చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ ఎదురులేని కోహ్లి 14 వన్డేల్లో 133.55 సగటుతో 1202 పరుగులు చేయగా ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా గతేడాది మొత్తం 37 మ్యాచ్‌ల్లో(టీ20లతో సహా) 68.37 సగటుతో 2,735 పరుగులు సాధించగా, మొత్తం 11 సెంచరీలు, 9 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇక ఎందరో టీమిండియా మహామహా సారథులకు సాధ్యంకాని విజయాలు కోహ్లి కెప్టెన్సీలో దక్కాయి. అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లు టీమిండియా గెలిచింది కోహ్లి సారథ్యంలోనే. అంతేకాకుండా టీమిండియాకు టెస్టుల్లో చాంపియన్‌షిప్ దక్కడంలో కోహ్లి పాత్ర మరవలేనిది.
స్పందించిన విరాట్ కోహ్లీ....
‘కష్టానికి ఫలితం దక్కింది. ఎంతో ఆనందంగా వుంది. అవార్డులను క్లీన్‌స్వీప్ చేసినందుకు గర్వంగా ఉంది’ అంటూ విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు. ఇక మరోవైపు ఇది.. ఓ అసాధారణమైన ప్రతిభకు దక్కిన గౌరవమని కోహ్లీని ఉద్దేశిస్తూ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా కోహ్లీని ఐసీసీ అవార్డ్‌లు వరించాయి. 2017 సంవత్సరానికి గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా, 2012లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
ICC Men's Cricketer of the Year ✅
— ICC (@ICC) 22 January 2019
ICC Men's Test Cricketer of the Year ✅
ICC Men's ODI Cricketer of the Year ✅
Captain of ICC Test Team of the Year ✅
Captain of ICC Men's ODI Team of the Year ✅
Let's hear from the man himself, @imvKohli! #ICCAwards 🏆 pic.twitter.com/3M2pxyC44n
Comments
Please login to add a commentAdd a comment