దుబాయ్: భారత అగ్రశ్రేణి క్రికెటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యుత్తమ పురస్కారానికి ఎంపికైంది. 2021 ఏడాదికి గాను మహిళల విభాగంలో ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును స్మృతి గెలుచుకుంది. మూడు ఫార్మాట్‌లలోనూ ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఎడంచేతి వాటం ఓపెనర్ అయిన స్మృతి గత ఏడాది 22 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 38.86 సగటుతో 855 పరుగులు సాధించింది.
ఇందులో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన భారత తొలి డే అండ్ నైట్ టెస్టులో 127 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం ఈ ఏడాది స్మృతి అత్యుత్తమ ప్రదర్శన. విజేతగా నిలిచిన ఆమె ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పేరిట నెలకొల్పిన ‘రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ’ని అందుకోనుంది. స్మృతి ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికవడం ఇది రెండోసారి. 2018లో ఈ అవార్డుతో పాటు ఆమె ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా కూడా నిలిచింది. మహిళల విభాగంలో ట్యామీ బీమాంట్ (టి20), లిజెల్ లీ (వన్డే) అత్యుత్తమ ప్లేయర్లుగా నిలిచారు.
భారత జట్టును గెలిపిస్తా.. వరల్డ్‌కప్ గెలవడమే ఏకైక లక్ష్యం
ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్‌గా ఎంపిక కావడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ప్రతికూల పరిస్థితుల నడుమ గత ఏడాది నేను ప్రదర్శించిన ఆటకు ఐసీసీ నుంచి గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. మున్ముందు మరింత బాగా ఆడి భారత జట్టును గెలిపించడంలో ఇది నాకు ప్రేరణ అందిస్తుంది.
ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, సన్నిహితులందరికీ నా కృతజ్ఞతలు. వచ్చే నెలలో జరిగే ప్రపంచకప్‌ను గెలుచుకోవాలనేదే మా ఏకైక లక్ష్యం. అందుకోసం మా జట్టంతా కలిసికట్టుగా శ్రమిస్తోంది. –స్మృతి మంధాన
చదవండి: Dinesh Karthik: టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్‌పై ప్రశంసలు కురిపించిన డీకే
Comments
Please login to add a commentAdd a comment