chennai super kings team
-
మైదానంలో ధోని సేన
దుబాయ్: ఐపీఎల్ జట్లలో అందరికంటే చివరగా మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మైదానంలోకి అడుగు పెట్టింది. ఆరు రోజుల తప్పనిసరి ఐసోలేషన్, ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మందికి కరోనా సోకిన విఘ్నాల తర్వాత ఎట్టకేలకు ఆ జట్టు ఆటగాళ్లు నెట్స్‌లోకి వచ్చారు. ధోని సారథ్యంలోని సీఎస్కే శుక్రవారం తమ సాధన మొదలు పెట్టింది. అయితే కరోనా సోకిన దీపక్ చహర్, రుతు రాజ్ గైక్వాడ్ మాత్రం ఇంకా ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. రెండు వారాల ఐసోలేషన్ తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించాకే వీరికి అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరు మినహా మిగతా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారని టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. వీరందరికీ వరుసగా మూడో సారి నిర్వహించిన పరీక్షలు కూడా నెగెటివ్‌గా వచ్చాయని, అందుకే ఆట మొదలు పెట్టామని ఆయన చెప్పారు. కోచ్ ఫ్లెమింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్ మైక్ హస్సీ పర్యవేక్షణలో ప్రాక్టీస్ కొనసాగింది. చెన్నై జట్టు తాజా పరిస్థితిని చూస్తే ఈ నెల 19న ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
సందడి షురూ...
దుబాయ్: అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)– 2020కి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని మూడు వేదికల్లో లీగ్ జరగనుండగా... సుమారు నెల రోజుల ముందుగానే జట్లు అక్కడికి చేరుకుంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈ గడ్డపై అడుగు పెట్టాయి. మరో రెండు టీమ్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే అక్కడికి వెళ్లాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఆరు రోజుల వరకు అందరికీ క్వారంటీన్ తప్పనిసరి. ఈ సమయంలో ఒక్కొక్కరికి కనీసం మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహి స్తారు. ఆ తర్వాతేనుంచి ఆటగాళ్ల ప్రాక్టీస్, లీగ్ వార్తలు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి. మలింగ మరింత ఆలస్యంగా... శ్రీలంక స్పీడ్‌స్టర్, ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ లసిత్ మలింగ కూడా ఆలస్యంగానే యూఏఈ వెళ్లనున్నాడు. దీంతో తొలి దశ మ్యాచ్‌లకు అతను జట్టుకు అందుబాటులో ఉండడు. కుటుంబ కారణాల వల్లే లంక ఆటగాడు కాస్తా ఆలస్యంగా ఐపీఎల్ ఆడనున్నాడు. ఈ పేసర్ తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు త్వరలోనే సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉండటంతో మలింగ తండ్రి వెంటే ఉండాలనుకుంటున్నాడు. దీంతో సగం మ్యాచ్‌లు అయ్యాకే అక్కడికి వెళ్లే అవకాశముంది. గతేడాది మలింగ మలుపు తిప్పిన ఆఖరి ఓవర్‌తోనే ముంబై నాలుగోసారి చాంపియన్ అయ్యింది. 8 పరుగులు చేస్తే చెన్నై గెలిచే ఆ ఓవర్లో అద్భుతంగా కట్టడి చేయడం వల్లే రోహిత్ సేన నెగ్గింది. చెన్నై బౌలర్ హర్భజన్ సింగ్ కూడా వ్యక్తిగత కారణాలతో జట్టుతో పాటే యూఏఈ వెళ్లలేకపోయాడు. -
‘స్టే’కు హైకోర్టు నిరాకరణ
చెన్నై సూపర్ కింగ్స్ కేసు చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రద్దు చేస్తూ లోధా కమిటీ చేసిన సిఫారసులపై ‘స్టే’ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని టీమ్ యాజమాన్యం సీఎస్కే క్రికెట్ లిమిటెడ్ చేసిన విజ్ఞప్తిని మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. అయితే చెన్నై జట్టు పిటిషన్‌కు వివరణ ఇస్తూ రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని బీసీసీఐని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివగ్ననమ్లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లోధా కమిటీ సిఫారసులపై బీసీసీఐ తీసుకునే ఏ నిర్ణయమైనా కోర్టు తుది తీర్పుకు లోబడి ఉండాలని స్పష్టం చేస్తూ విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది. మరోవైపు కోల్‌కతాలో గురువారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. చెన్నై, రాజస్థాన్ స్థానంలో వచ్చే రెండు సీజన్లలో రెండు కొత్త జట్లను ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనికి బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. -
కోర్టుకెక్కిన సూపర్ కింగ్స్
చెన్నై: ఐపీఎల్‌నుంచి తమ జట్టును తప్పించాలంటూ లోధా కమిటీ చేసిన సిఫారసును సవాల్ చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కోర్టుకెక్కింది. మద్రాస్ హైకోర్టులో చెన్నై టీమ్ దీనిపై అఫిడవిట్ దాఖలు చేసింది. లోధా కమిటీ ఆదేశాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవిగా, సహజ న్యాయానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించింది. తమ వాదన వినిపించుకునే అవకాశం సరిగా ఇవ్వకుండా ఉందన్న సీఎస్కే యాజమాన్యం...తాము 4.1.1 క్లాజ్‌ను ఉల్లంఘించామో లేదో స్పష్టత లేకుండా కమిటీ శిక్షకు సిఫారసు చేసిందని ఆరోపించింది. కాబట్టి లోధా కమిటీ ఉత్తర్వులపై స్టే విధించాలని కోర్టును కోరింది. -
నా పరిస్థితి ఏమిటో?
ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుపై రెండేళ్ల నిషేధం పడటంతో తన భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నారు. ఆటగాళ్లు వేలంలోకి వెళ్లి వేరే జట్టుకు ఆడే అవకాశం ఉందని, తన విషయం చెన్నై యాజమాన్యంతో మాట్లాడాల్సి ఉందన్నారు. -
చెన్నై జట్టును ఎందుకు రద్దు చేయకూడదు?
బీసీసీఐకి సుప్రీం కోర్టు ప్రశ్న న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు గురువారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను ఎందుకు లీగ్ నుంచి తొలగించకూడదని బీసీసీఐ కౌన్సిల్‌ను ప్రశ్నించింది. అలాగే ముద్గల్ క మిటీ నివేదికలో పేర్కొన్న వ్యక్తులు బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చే యరాదని సూచించింది. ఈ విచారణను జస్టిస్ టీఎస్ ఠాకూర్, కలీఫుల్లాతో కూడిన బెంచ్ చేపట్టింది. ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కనిపిస్తున్న కారణంగా ఇండియా సిమెంట్స్‌కు చెందిన చెన్నై జట్టును రద్దు చేస్తే ఏం జరుగుతుంది?’ అని బెంచ్ ప్రశ్నించింది. ఇండియా సిమెంట్స్‌కు చెందిన షేర్‌హోల్డర్స్, డెరైక్టర్ల వివరాలను అందించాలని ఆదేశించింది. మరోవైపు గురునాథ్ మెయ్యప్పన్‌ను సీఎస్కే టీమ్ అధికారిగా ఇండియా సిమెంట్స్ అంగీకరించింది. తదుపరి విచారణ డిసెంబర్ 1కి వాయిదా పడింది. -
‘చెన్నై’ మ్యాచ్‌ల తరలింపు!
న్యూఢిల్లీ: చె న్నై సూపర్ కింగ్స్ జట్టు తమ సొంత మైదానంలో ఆడాల్సిన మ్యాచ్‌లను ఇతర చోట్లకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెపాక్ స్టేడియంలో తమిళనాడు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా గతంలో మూడు స్టాండ్స్‌ను నిర్మించడమే దీనికి కారణం. ఇప్పటిదాకా వాటికి కార్పొరేషన్ నుంచి ఎన్వోసీ సర్టిఫికెట్ అందలేదు. ఈనెల 18న బెంగళూరుతో, 22న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లీగ్‌లతో పాటు 27న క్వాలిఫయర్, 28న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. ‘చెపాక్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చెన్నై మ్యాచ్‌లను నిర్వహించాల్సిన వేదిక గురించి నేడు (శనివారం) ముంబైలో సమావేశం ఉంటుందని సీఎస్కే యాజమాన్యం నుంచి మాకు సమాచారం అందింది’ అని ఐపీఎల్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. చెపాక్‌లో ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం రెండింటిని రాంచీలో జరిపే అవకాశం ఉంది.