chennakesava swamy
-
వైభవం..చెన్నకేశవ రథోత్సవం
బద్వేలు అర్బన్ : చెన్నంపల్లె సమీపంలోని శ్రీదేవి, భూదేవి సమేత ఆదిచెన్నకేశవస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నెరవేరిం. ఉదయం నుంచే భక్తులు రథాన్ని విద్యుత్ దీపాలు, పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. వేలాదిమంది భక్తులు స్వామివారి రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. రథోత్సవంలో ఆలయ కమిటీ వారు భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. రథోత్సవం ముగిసిన అనంతరం భక్తుల దర్శనం కోసం స్వామివారిని రథంపై నుంచి కిందకు దించి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సాహంగా బండలాగుడు పోటీలు ఆదిచెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. తొలుత పోటీలను మున్సిపల్ చైర్మన్ వీ.రాజగోపాల్‌రెడ్డి ప్రారంభించారు. సుమారు 6 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో మొదటి బహుమతిని రాజుపాలెం మండలం వెలవలి గ్రామానికి చెందిన కమ్ముసాహెబ్ రసూల్ ఎడ్లు కైవసం చేసుకోగా, వీరికి రూ.40,116ల నగదును బహుమతిగా అందజేశారు. ద్వితీయ బహుమతిని కమలాపురం గ్రామానికి చెందిన చల్లా శివారెడ్డి వృషభాలు కైవసం చేసుకోగా వీరికి రూ.20,116ల బహుమతిని అందజేశారు. తృతీయ బహుమతిని గోపవరం మండలానికి చెందిన నెమలయ్య వృషభాలు కైవసం చేసుకోగా వీరికి రూ.10,116ల బహుమతిని అందించారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రంగారెడ్డి, పోటీల నిర్వాహకులు నారాయణరెడ్డి, మనోహర్‌రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
ఘనంగా దంపేట్ల చెన్న కేశవస్వామి ఉత్సవాలు
-
అన్ని వరాలిచ్చేది కేశవస్వామియే..
బెజ్జంకి (సిద్దిపేట): ఒక్కో దేవుడు ఒక్కో వరమిస్తే అన్ని వరాలిచ్చే దేవుడు శ్రీచిన్నకేశవస్వామి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండలంలోని ఆయన స్వగ్రామమైన తోటపెల్లిలో కొత్తగా నిర్మించిన శ్రీచెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేశవుడు అంటే నారాయణుడు అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొలువైన తోటపెల్లి ప్రాంతం ఎంతో మహిమాన్వితమైనదన్నారు. స్వామి మన గ్రామంలో కొలువుదీ రడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ ఆలయాన్ని చిన్నజీయర్ స్వామి కరకమలములతో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ‘తోటపెల్లిలో బొ డ్రాయిని ప్రతిష్టించుకున్నాం. రామాలయం నిర్మిం చుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాలను పునరుద్ధరించడం, నాటి సంప్రదాయ పరంపర కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది. ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ చేయడం ఎంతో పుణ్యం’ అని అన్నారు. చెన్నకేశవస్వామి ఆలయాలు రెండున్నాయని.. ఒకటి మిట్టపల్లిలో మరోటి తోటపెల్లిలో ఉన్నాయన్నారు. సిద్దిపేట జిల్లా ప్రాచీన ఆల యాలకు ప్రసిద్ధి అని వాటి పూర్వ వైభవానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా లోని సీఎం సెంటిమెంట్ ఆలయం కోనాయపల్లె వేంకటేశ్వరస్వామి, కొమురవెల్లి మల్లన్న, నాచారం, బెజ్జంకిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను ఆయన అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. -
శివ, కేశవులు పక్కపక్కనే కొలువుదీరిన పుణ్యస్థలి
పుణ్య తీర్థం శివ కేశవులు ఒకేచోట కొలువుతీరిన అద్భుత ఆలయాలలో ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి– కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాలు ప్రధానమైనవిగా చెప్పవచ్చు. ఈ రెండు ఆలయాలు జంట ఆలయాలుగా పేరొందాయి. ఉపాలయాలతో, నిత్యపూజలతో, అభిషేకాలతో, సుస్వర వేద మంత్ర పఠనాలతో అలరారుతూ భక్తులతో నిత్యం ఈ ఆలయాలు ఒంగోలు నగరానికి ప్రత్యేక ఆకర్షణ. ఒంగోలుకు ప్రాచీన చరిత్ర చాలా ఉంది. పలు రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. అలా ఒంగోలును పరిపాలించిన వారిలో మందపాటి జమీందారులు ముఖ్యులు. వారినే ఒంగోలు రాజులుగా వ్యవహరిస్తారు. ఒంగోలు రాజులలో ఒకరైన రామచంద్రరాజు కాలంలో ఒంగోలు కొండపై 1729లో ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఒంగోలులో నిర్మింపబడిన మొట్టమొదటి ఆలయం దాదాపు ఇదేనని చెప్పవచ్చు. స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్లో పూర్వం ఒంగోలు రాజుల కోట ఉండేది. ఆ కోటలో ప్రసన్న చెన్నకేశవస్వామివారికి పూజలు నిర్వహించేవారు. అయితే వెంకటగిరి రాజులతో వైరం ఉండడంతో ఎప్పటికైనా వారి వల్ల తమకు ముప్పు తప్పదనే భావంతో ఒంగోలు రాజులు ప్రసన్న చెన్నకేశవస్వామివారి ఆలయాన్ని కొండపై నిర్మించి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించినట్లు స్థానికులు చెబుతారు. ఒంగోలు రాజుల మంత్రి వంకాయలపాటి వీరన్న పంతులు ప్రసన్న చెన్నకేశవ అద్భుత శిల్ప కళకు ప్రతీక ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం అద్భుత శిల్పకళా సంపదతో, సుందర కుడ్యచిత్రాలతో భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీనివాస కల్యాణంతోపాటు పలు ఘట్టాలను గోడలపై అద్భుత శిల్పాలుగా మలచారు, కప్పుపై చిత్రించిన వటపత్రశాయి చిత్రం భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రధాన ఉత్సవాలు ముక్కోటి, విజయదశమి, కృష్ణాష్టమి, సంక్రాంతి వంటి ప్రధాన పండుగలతోపాటు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను 9 రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలు జరుగుతాయి. నిత్యం వేదపారాయణ జరుగుతుంది. ప్రతి శుక్రవారం రాజ్యలక్ష్మి అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహిస్తారు. ఆలయ సముదాయంలో వెంకటేశ్వరస్వామి, రమావసుంధరా సమేత సత్యనారాయణ స్వామి, ప్రసన్న ఆంజనేయస్వామి ఉపాలయాలున్నాయి. ఆలయ సేవాసమితుల ఆధ్వర్యంలో మాస కల్యాణాలు నిర్వహిస్తున్నారు. కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం భక్తులకు అలౌకికానందానుభూతిని ప్రసాదిస్తుంది. ఒంగోలు రాజుల కొలువులో మంత్రిగా ఉన్న వంకాయలపాటి వీరన్న పంతులు శివభక్తుడు కావడంతో ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం చెంతనే కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. రాజులపట్ల గౌరవం వల్ల ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయ రాజగోపురంకంటే కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ రాజగోపురం కొంత తక్కువగా ఉండేలా నిర్మించారు. ఆలయంలోని నంది విగ్రహం రాజసాన్ని ఒలకబోస్తూ పరమేశ్వరునివైపే చూస్తూ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయంలోని నటరాజ చిత్రంతోపాటు అన్నపూర్ణాదేవి చిత్రం, పార్వతి తపస్సువంటి చిత్రాలు ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో గల నాగలింగ వృక్షం పువ్వులోపల ఉండే బుడిపె తెల్లగా శివలింగం ఆకారంలో ఉండి నాగపడిగ పట్టినట్లుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం, కుమారస్వామి ఉపాలయాలు ఉన్నాయి. చేరుకునే మార్గం ప్రధానమైన విజయవాడ–చెన్నై రైలుమార్గంలో ఒంగోలు ఉండడంతో దేశంలోని పలు ప్రాంతాలనుండి రైళ్లద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. 16వ నెంబరు జాతీయ రహదారి ఒంగోలుగుండా పోతుంది కాబట్టి అన్ని ప్రాంతాలనుండి బస్సు సర్వీసులు ఉంటాయి. సమీపంలోని చూడదగిన ప్రదేశాలు వల్లూరమ్మ ఆలయం, సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం, సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, చదలవాడ రఘునాయకస్వామి ఆలయం, కొత్తపట్టణం సముద్రం, దేవరంపాడు ఉప్పుసత్యాగ్రహ శిబిరం, వేటపాలెం సారస్వత నికేతనం ముఖ్యంగా చూడదగినవి. ఒంగోలునుంచి పై ప్రదేశాలకు బస్సులతోపాటు ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా కూడా చేరుకోవచ్చు. – ఎం.వి.ఎస్.శాస్త్రి, సాక్షి, ఒంగోలు -
వైభవంగా బ్రహ్మోత్సవాలు
బుక్కపట్నం : కొత్తచెరువు మండలం చెన్నకేశవపురంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ధర్మకర్తలు ఉషారాణి, చెన్నారెడ్డి.. స్వామికి పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అంతకుముందు గణపతి, లక్ష్మీదేవి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం గంగపూజలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆలయం వేద పండితుల మంత్రోచ్చారణలతో మార్మోగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఆలయంలో ఉదయం 8 గంటలకు ధ్వజారోహణ, అంకురార్పణ, పూజ, సాయంత్రం 4 గంటలకు మహాభిషేకం నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు, హోమాలు, సాయంత్రం 4 గంటలకు సుదర్శన హోమం, గరుడ వాహనసేవ, ఆదివారం ఉదయం 4 గంటలకు ద్వారక ప్రవేశం, 8 గంటలకు హోమాలు, పూర్ణాహుతి, నూతన కల్యాణ వేదిక ప్రారంభోత్సవం, కల్యాణ మహోత్సవం, సాయంత్ర 4 గంటలకు చక్రస్నానం, ధ్వజారోహణ, శ్రీవారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రేపు చెన్నకేశవపురం రానున్న డాక్టర్ శోభారాజు బుక్కపట్నం : అన్మమయ్య కీర్తనలను తన గాత్రంతో భక్తులను మైమరపింపజేసే ప్రఖ్యాత గాయని అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు ఆదివారం చెన్నకేశవపురం విచ్చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు శ్రీమతి ఉషారాణి, చెన్నారెడ్డి దంపతులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో ఆమె కీర్తనలు ఆలపిస్తారన్నారు.