దొంగ.. దొంగ..
గత నెల 29న : చెన్నూరు పట్టణంలో పట్టపగలే ఇంట్లో చొరబడిన దొంగలు రూ.3.20 లక్షలతోపాటు బంగారు అభరణాలు దోచుకెళ్లారు.
ఈ నెల 4న : దండేపల్లి మండల కేంద్రంలో బొలిశెట్టి సత్తయ్య ఇంట్లో పట్టపగలే చొరబడ్డ దొంగలు రూ.4.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.
ఈ నెల 4న : నిర్మల్ పట్టణంలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు గోడకు రంధ్రం చేసిన ఓ దొంగ చోరీకి యత్నించాడు.
ఈ నెల 8న : మంచిర్యాలలోని ఓరియంటల్ బ్యాంక్‌కు రంధ్రం చేసి ఇద్దరు దొంగలు చోరీకి విఫలయత్నం చేశాడు.
జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెల్లారి లేచి చూసే సరికి ఇంట్లోని సొత్తు, డబ్బు ఉంటుందో.. పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం ఎక్కడో ఓ చోట దొంగతనం జరుగుతూనే ఉంది. గడిచిన పది రోజుల్లోనే నాలుగు చోట్ల బంగారం, సొత్తు దో చుకెళ్లిన దొంగలు.. రెండు బ్యాంకు దోపిడీలకు విఫలయత్నం చేశారు. గతంలో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్‌లో చొరబడి డబ్బుల కోసం దాడులకు పా ల్పడ్డారు. బాసరలో అయితే.. ఓ వ్యాపారి కుటుంబాన్నే హత్య చే శారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ దొంగలు స వాల్ విసురుతున్నా పోలీసులు వారిని కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు.
సాక్షి, మంచిర్యాల/ఆదిలాబాద్ క్రైం : దొంగతనాలను అరికట్టడంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వీటిని అరికట్టడానికి పలు విభాగాలు ఉన్నా ఫలితం శూన్యం. స్థానికంగా ఉంటూ నేరాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి నేరస్తులను పట్టుకోవాల్సిన ఐడీ పార్టీ తీరు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో జరిగిన నేరాల తీరును పరిశీలించి, పాత నేరస్తులను విచారించడం, నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం ఈ విభాగం ప్రధాన విధి. కానీ.. వీరు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దొంగతనం జరిగిన చోట వేలిముద్రలు సేకరించి వాటి ద్వారా నేరస్తులను పట్టుకోవడంలో క్లూస్‌టీం (ఫింగర్ ప్రింట్స్) విభాగం సహకరిస్తుంది. భారీ దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా సీసీఎస్ విభాగం కూడా ఉంది. ఈ విభాగాలన్నీ ఉన్నా చోరీలు మాత్రం ఆగడం లేదు. దీనికి పోలీసుల వైఫల్యమే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయంలో పెట్రోలింగ్‌లో పోలీసుల నిర్లక్ష్యంతో దొంగతనాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. బీట్ డ్యూటీలు సరిగా నిర్వర్తించకపోవడం దొంగలకు అవకాశం ఇచ్చినట్లవుతోందనే అభిప్రాయం ఉంది. పెట్రోలింగ్ నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తుండడంతోనే జిల్లాలో నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి..
దొంగలు తెగబడటానికి ప్రజల అజాగ్రత్త కూడా ఓ కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు ఉంచొద్దని పోలీసులు పేర్కొంటున్నారు. ఎవరో ఒకరు ఇంట్లో ఉంటే చాలా మట్టుకు దొంగతనాలు తగ్గుతాయంటున్నారు. కానీ ప్రజలు ఇవేవీ పట్టించుకోకుండా అజాగ్రత్తతో వ్యవహరించడంతో దొంగతనాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని పోలీసుల నుంచి సైతం వ్యక్తమవుతోంది. కాగా.. ఇంటి యజమాని ఊరికి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలి.. లేదా ఇంటి పక్కన ఉన్నవారికైనా చెప్పి వెళ్లాలి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇంటికి తాళం వేసి వెళ్లిపోతుండడంతో దొంగల పని సులవవుతోంది. కాలనీల్లో అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడంలో కూడా బాధ్యతారహితంగా వ్యవరిస్తున్నారు. ప్రజలు, పోలీసుల సమష్టి కృషితోనే దొంగతనాలు అరికట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గ్రామాలు.. పట్టణాల్లో ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండేలా ఆ శాఖ వార్డు, గ్రామ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వార్డు, గ్రామానికి ఒక్కో పోలీస్ కానిస్టేబుల్‌ను నియమించింది. పోలీసు అధికారులు.. వారికి కేటాయించిన ప్రాంతాల్లో ఉన్న గోడలపై సంబంధిత కానిస్టేబుల్ పేరు, సెల్ ఫోన్ నెంబర్ రాయించారు. మొదట్లో.. ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించిన పోలీసులు ఇప్పుడు సరిగా రావడం లేదనే విమర్శలొస్తున్నాయి. చాలా చోట్ల అసలు కానిస్టేబుళ్ల పేర్లే లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చే సినా సంఘటన స్థలానికి ఆలస్యంగా చేరుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీ, చెన్నూరు పట్టణ పరిధిలోని వార్డుల్లో ఉన్న గోడలపై కానిస్టేబుళ్ల పేర్లు ప్రదర్శించలేదు. మంచిర్యాల పట్టణంలోనూ పలు వార్డుల్లో కానిస్టేబుళ్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోపక్క.. పోలీసు శాఖను సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. జనాభాకు సరిపడా పోలీసులు లేకపోవడంతో ప్రజారక్షణపై ప్రభావం పడుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆసిఫాబాద్ పట్టణంలో 43 మంది పోలీసులకు గాను కేవలం 29 మంది మాత్రమే పని చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
నిఘా కోసం..
వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీసులు బ్యాంకులు, ఏటీఎంలు, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించని బ్యాంకు అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఈ విషయమై మంచిర్యాల సీఐ వి.సురేశ్ మాట్లాడుతూ.. ‘ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక వార్డు వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశాం. బదిలీ అయిన వార్డు పోలీసుల స్థానాల్లో కొత్తగా విధుల్లో చేరిన వారిని త్వరలోనే నియమిస్తాం. విధిగా వార్డులు, ప్రధాన కూడళ్లలో తిరగాలని నైట్‌బీట్ పోలీసులను ఆదేశించాం. ప్రజలూ అప్రమత్తంగా ఉంటూ అనుమానిత వ్యక్తుల గురించి మాకు సమాచారం ఇవ్వాలి’ అని సూచించారు.