సర్కారీ చెక్కు బౌన్స్.. అమరవీరుడికి అవమానం!
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా సాయం చేశాయి. వాళ్లను తాము ఆదుకుంటున్నామంటూ చెక్కులిచ్చి ఫొటోలు, వీడియోలు కూడా తీయించుకున్నారు. కానీ ఆ చెక్కులు వాళ్లకు ఎంతవరకు పనికొచ్చాయంటే.. అనుమానమే. ఎందుకంటే బిహార్ ప్రభుత్వం ఇలాగే ఇచ్చిన ఓ చెక్కు బౌన్స్ అయ్యింది. బిహార్‌లోని షేక్‌పురా జిల్లాకు చెందిన రంజీత్‌కుమార్ కూడా సుక్మా జిల్లాలో జరిగిన మారణహోమంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు మొత్తం ఆరుగురు బిహారీలో ఆ దారుణకాండలో అమరులయ్యారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఇస్తామని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. తన కోడలు సునీతాదేవి పేరు మీద ఇచ్చిన చెక్కును రంజీత్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జమ చేశారు. కానీ.. ఆ చెక్కు బౌన్స్ అయ్యిందని వాళ్లకు బ్యాంకు అధికారులు చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల అలా జరిగిందని బ్యాంకు మేనేజర్ తెలిపారు.
అమరవీరుడి కుటుంబం విషయంలో ఇలా వ్యవహరించినందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడింది. నితీష్ హయాంలో ఇలా జరగడం ఇది మొదటి సారి ఏమీ కాదని.. వాళ్ల మంత్రులు, నాయకులు సైనికుల గురించి దారుణంగా మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ టైగర్ అన్నారు. ఇప్పుడు చెక్కు బౌన్స్ అయ్యిందని, అమర సైనికుడి కుటుంబాన్ని ఆదుకోవాలే తప్ప ఇలా అవమానించకూడదని ఆయన చెప్పారు. అయితే తప్పు తమది కాదని, బ్యాంకు అధికారులదని జేడీ(యూ) నాయకులు అంటున్నారు. ఈ విషయమై విచారణ జరపాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించిందని నీరజ్ కుమార్ అనే నేత చెప్పారు.