మత్స్య సంపదను పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
చెర్కుపల్లి(కేతేపల్లి) : మత్స్య సంపదను పెంచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి డెప్యుటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన మూడు లక్షల చేపపిల్లలను ఆదివారం మండలంలోని చెర్కుపల్లి ఉదయసముద్రం, దీపకుంట చెరువులలో ఆయన వదిలి మాట్లాడారు. దళారీ వ్యవస్థను అరికడుతూ మత్స్యసంపదపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. చేపల విక్రయానికి ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. మత్స్యకారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ బంటు మహేందర్, సొసైటీ చైర్మన్ లింగాల రాంనర్సయ్య, నాయకులు పీబీ ఎల్లయ్య, అంజాద్ఖాన్, పులుసురాజు, మల్లం సైదులు, ఎ.మహేందర్ తదితరులు పాల్గొన్నారు.