బాంబు బూచి చూపి స్కూలు ఎగ్గొట్టారు...
ఘజియాబాద్: క్లాసులు ఎగ్గొట్టేందుకు నలుగురు విద్యార్థులు చేసిన తుంటరి పనికి పోలీసులు, ఉన్నతాధికారులు కంగుతిన్నారు. స్కూల్లో బాంబులు ఉన్నాయంటూ పోలీసులకు కాల్ చేసి హల్ చల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఛబ్బీల్ దాస్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థులు బుధవారం క్లాసులు ఎగ్గొట్టాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఓ విద్యార్థి వద్ద ఉన్న చైనా వాచ్ లో సిమ్ కార్డ్ వేసి, బాంబు ఉందంటూ పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో వారు హుటాహుటిన స్కూలుకు చేరుకున్నారు. స్కూలు నుంచి అందర్నీ పంపించేసి ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా చేయగా అసలు విషయం బయటపడింది. అందరితో పాటు ఈ విద్యార్థులు కూడా ఇంటికి వెళ్లిపోయారు.
అయితే, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి తమకు కాల్ వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు ఎలాగోలా ప్రయత్నించి కాల్ చేసిన నలుగురు విద్యార్థులను గుర్తించారు. ఇంటికి వెళ్లిపోవడానికి ఈ పని చేసినట్లు విద్యార్థులు అంగీకరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధేయపడటంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ తో కూడిన వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మరోసారి ఇలాంటి పనులు చేయవద్దంటూ గట్టిగా మందలించి వారి తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశారు.