సుబ్రతో రాయ్ కి మాతృవియోగం: విడుదలపై సందిగ్ధం
లక్నో: సహారా సంస్థల అధినేత సుబ్రతోరాయ్ మాతృమూర్తి చ్ఛబీ రాయ్ (95) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో లక్నోలోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారని సహారా అధికార ప్రతినిధులు తెలిపారు. ముదుపు దారులను మోసం చేశారనే ఆరోపణలపై గడిచిన రెండేళ్లుగా జైలులో ఉంటోన్న సుబ్రతోరాయ్ కి తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున ఆమె దగ్గర ఉండేదుకు బెయిల్ మంజూరు చేయాలని సుబ్రతోరాయ్ పలు మార్లు సుప్రీంకోర్టుకు విన్నవించుకున్న సంగతి తెలిసిందే. అయితే సుబ్రతో తన తల్లిని ఆసుపత్రిలో చర్పించలేదని, ఇంట్లోనే ఉంచి చికిత్స చేయిస్తున్నారని సెబీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో ఆ విషయం వివాదంగా మారింది. తల్లి సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకుని సుబ్రతో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ డిఫెన్స్ న్యాయవాదులు గట్టిగా వాదించడంతో సహారా చీఫ్ కు బెయిల్ దొరకలేదు. ఇప్పుడు ఆమె మరణించినందువల్ల రాయ్ కి తప్పక అనుమతి లభించవచ్చని సమాచారం.
బిహార్ లోని అరారియా జిల్లాలో జన్మించిన చ్ఛబీ రాయ్.. లక్నోవాసి సుధీర్ చంద్రరాయ్ ని పెళ్లాడారు. వారి సంతానమైన సుబ్రతో వ్యాపార రంగంలోకి ప్రవేశించి అనతికాలంలోనే అత్యున్నతస్థాయికి చేరారు. అంతలోనే పాతాళానికి పడిపోయారు. సహారా పరివార్ ప్రయాణంలో చ్ఛబీ రాయ్ చుక్కానిలా మార్గదర్శకత్వం వహించారని ఆమె మరణంపై విడుదల చేసిన ప్రకటనలో సహారా పరివార్ పేర్కొంది. చ్ఛబీ రాయ్ కి 1998 పేర్ మేకర్ ను అమర్చారు. 2008లో మరోసారి దానిని రీప్లేస్ చేశారు. దీనితోపాటు శ్వాస సంబంధమైన వ్యాధులతోనూ ఆమె బాధపడేది.