chhattarpur district
-
కాంగ్రెస్ నేత దారుణ హత్య.. విచారణకు మాజీ సీఎం డిమాండ్
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం చత్తార్పూర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని గువారా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్ర ప్రతాప్ సింగ్ పర్మార్‌ను దుండగులు అతి సమీపం నుంచి ఛాతీపై కాల్పులు జరిపి హతమార్చారు. మంగళవారం రాత్రి ఇంద్ర ప్రతాప్.. మిత్రులతో కలిసి స్థానికంగా ఉండే ఓ హోటల్ ముందు నిలబడి ఉండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. స్థానికులు హుటాహుటిన అతనిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. కాగా, ఈ ఘటన మొత్తం స్థానికంగా ఉండే సీసీ టీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేసి గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పాతకక్షలే ఇంద్ర ప్రతాప్ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా తమ నేత ఇంద్ర ప్రతాప్ హత్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన అనుచరులు ఆసుపత్రిని ధ్వంసం చేసి, పరిసర ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారు. ఇంద్ర ప్రతాప్ హత్యపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. -
ప్రాణం తీసిన ప్రాయశ్చిత్తం
భోపాల్: పంచాయతీ పెద్దల తీర్పు మధ్యప్రదేశ్ లో ఓ వృద్ధరైతు మరణానికి కారణమైంది. బుందేల్ ఖండ్ ప్రాంతంలోని ఛత్తర్ పూర్ జిల్లా బాదా మల్హెరా గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనను ‘ది టెలిగ్రాఫ్’ వెలుగులోకి తెచ్చింది. హర్ సింగ్ లోధి పొలంలో ఇటీవల ఓ ఆవు దూడ చనిపోయింది. దాని ప్రక్కనే ఎలుకల మందు డబ్బా పడివుండడంతో దూడ మరణానికి హర్ సింగ్ కారణమని పంచాయతీ పెద్దలు తీర్మానించారు. ఆయనకు రూ. 500 జరిమానా విధించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆదేశించారు. దీనికి అంగీకరించిన సింగ్ మూడు గంటల పాటు ఒంటికాలిపై నిల్చోని ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ‘దూడ మరణానికి మా నాన్నే కారణమని పంచాయతీ పెద్దలు తేల్చారు. వారి తీర్పును అంగీకరించి ఒంటి కాలిపై నిల్చున్నారు. కాళ్లు అటుఇటు మారుస్తూ మూడు గంటలపాలు నిల్చుకున్నాడు. తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పార’ని హర్ సింగ్ కొడుకు దరియాబ్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. గోపరిరక్షకులుగా చెలామణి అవుతున్న కొంతమంది అమాయకుల చావుకు కారణమైన ఉదంతాలు గతంలోనూ రాష్ట్రంలో జరిగాయి. చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచారనే కారణంతో జూలై నలుగురు దళిత యువకులను గోపరిరక్షకులు చావబాదారు. -
ఆ ఊరంతా పెళ్లికాని ప్రసాదులే!
ఆ గ్రామంలో ఒక్క అబ్బాయికి కూడా పెళ్లి కావడం లేదు. పెళ్లి చేసుకుందామంటే అసలు ఆ ఊరి అబ్బాయిలకు సంబంధాలే రావడం లేదు. దానికి కారణం.. మూడేళ్ల నుంచి వరుసగా పీడిస్తున్న కరువు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కరువు తీవ్రంగా ఉంది. నీళ్ల కొరత కారణంగా పంటలు పండటంలేదు. తెహ్రిమారియా అనే గ్రామంలో అయితే పెళ్లికూతుళ్లు దొరకడం పెద్ద కష్టంగా మారింది. అసలు నీళ్లులేని ఊళ్లోకి తమ ఆడ పిల్లలను ఎలా ఇవ్వాలంటూ అమ్మాయిల తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. 32 ఏళ్ల వయసున్న మోహన్ యాదవ్‌కు సంబంధం చూడాలని వాళ్ల కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం కనపడలేదు. అలా సుమారు 60 మంది మగవాళ్లు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వమే తమకు సాయం చేయాలని, ఒక డ్యామ్ కట్టి నీటి సస్యకు పరిష్కారం చూపిస్తే తమకు పెళ్లిళ్లు అవుతాయని మోహన్ యాదవ్ లాంటివాళ్లు అంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో గల 13 జిల్లాల్లో ఛత్తర్పూర్ కూడా ఒకటి. ఈ జిల్లాలన్నింటిలోనూ దాదాపు పదేళ్లుగా కరువు వస్తూ పోతూనే ఉంది. తెరియమార్ గ్రామంలో 400 అడుగుల లోతు వరకు తవ్విన బోర్లు, బావులు కూడా ఎండిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ దూరాలు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. స్టాప్ డ్యామ్ కట్టడానికి ఓ ప్రాంతం చూశామని, కలెక్టర్ అనుమతి మంజూరుచేస్తే వెంటనే పనులు మొదలుపెట్టొచ్చని తహసిల్దార్ బినితా జైన్ అన్నారు. దాంతో ఒకటి రెండేళ్లలో కరువు పూర్తిగా మాయం అవుతుందని చెప్పారు.