'ఇఫ్తార్' విందుకై.. ఇంట్లోనే సులువుగా చేయండిలా..
పగలంతా రోజాతో అల్లా ధ్యానం. రాత్రికి ఇఫ్తార్‌తో ఆరోగ్యధ్యానం. నీరసించిన దేహానికి శక్తి కావాలి. ఆ శక్తి దేహానికి తక్షణం అందాలి. ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. గార్నిషింగ్తో పదార్థం రుచి పెరగాలి. రుచి.. ఆరోగ్యానికి మేళవింపు కావాలి. ఇఫ్తార్ కోసం పొరుగు దేశాలు ఏం వండుతున్నాయి? దహీ చికెన్‌ను బ్రెడ్‌లో పార్సిల్ చేశాయి. నాలుగు పప్పులు.. రెండు ధాన్యాలు.. కలిపి హలీమ్ వండుతున్నాయి. అచ్చం మనలాగే.
చికెన్ బ్రెడ్ పార్సిల్..
కావలసినవి: చికెన్ బోన్‌లెస్ – 200 గ్రా.
మారినేషన్ కోసం.. మిరియాల పొడి – టీ స్పూన్; మిరపొ్పడి – టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్; వెనిగర్ – టేబుల్ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; తందూరీ మసాలా పొడి – టేబుల్ స్పూన్; పెరుగు– అర కప్పు.
పోపు కోసం.. నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు; క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు.
పార్సిల్ కోసం.. మిల్క్ బ్రెడ్ – 10 స్లయిస్‌లు; మైదా – టేబుల్ స్పూన్; కోడిగుడ్లు – 2; లెట్యూస్ – నాలుగు ఆకులు (క్యాబేజ్‌ని పోలి ఉంటుంది); నూనె – వేయించడానికి తగినంత.
తయారీ..
చికెన్‌ను శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పాత్రలో వేసి మారినేషన్ కోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేసి సమంగా కలిసే వరకు కలిపి (మారినేషన్) అరగంట సేపు కదిలించకుండా పక్కన ఉంచాలి
బాణలిలో నూనె వేడి చేసి మారినేట్ చేసిన చికెన్ వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి. మూత తీసి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొంత సేపు చిన్న మంట మీద ఉంచాలి. ఉప్పు కూడా సరి చూసుకుని అవసరాన్ని బట్టి మరికొంత వేసుకోవచ్చు. చికెన్ ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి రెండు నిమిషాల సేపు (తేమ పోయే వరకు) వేయించి స్టవ్ ఆపేయాలి
ఒక కప్పులో మైదా పిండి తీసుకుని తగినంత నీటితో గరిట జారుడుగా కలుపుకోవాలి
కోడిగుడ్లను పగుల గొట్టి ఒక పాత్రలో వేసి, అందులో మిరియాల పొడి వేసి చిలికి సిద్ధంగా ఉంచుకోవాలి
బ్రెడ్ స్లయిస్ల అంచులు చాకుతో కట్ చేసి తీసేయాలి. బ్రెడ్‌ను అప్పడాల కర్రతో వత్తాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ పొడి పొడిగా రాలిపోకుండా చికెన్ స్టఫ్ పెట్టి నూనెలో వేయించడానికి అనువుగా మారుతుంది. ఇలా చేసుకున్న బ్రెడ్ స్లయిస్లో ఒక స్పూన్ చికెన్ స్టఫ్ పెట్టి, కర్రీ బయటకు రాకుండా బ్రెడ్ అంచులకు మైదా పిండి ద్రవం రాసి అతికించాలి. నలుచదరంగా ఉండే బ్రెడ్ స్లయిస్ సాండ్విచ్లాగ త్రిభుజాకారపు పార్సిల్ తయారవుతుంది. ఇలా అన్నింటినీ చేసుకుని పక్కన పెట్టాలి
బాణలిలో నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ పార్సిల్‌ను కోడిగుడ్డు సొనలో ముంచి నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి తీసి టిష్యూ పేపర్ మీద వేయాలి. నూనె వదిలిన తరవాత ఈ బ్రెడ్ పార్సిళ్లను, టొమాటో కెచప్, లెట్యూస్‌తో కలిపి సర్వ్ చేయాలి.
చికెన్ హలీమ్..
కావలసినవి: ఎర్ర కందిపప్పు – టేబుల్ స్పూన్; బాసుమతి బియ్యం– టేబుల్ స్పూన్; గోధుమలు– టేబుల్ స్పూన్; బార్లీ– టేబుల్ స్పూన్; కందిపప్పు– టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు– టేబుల్ స్పూన్; అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌లు– ఒక్కొక్కటి టేబుల్ స్పూన్; చికెన్ (బోన్‌లెస్)– పావు కేజీ; చికెన్ స్టాక్ – అరకప్పు; హలీమ్ మసాలా పొడి– టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – కప్పు; మిరప్పొడి – అర టీ స్పూన్; పసుపు– అర టీ స్పూన్; పెరుగు – అర కప్పు; ఉప్పు – అర టీ స్పూన్.
పోపు కోసం.. నెయ్యి– అర కప్పు; జీలకర్ర– టీ స్పూన్; వెల్లుల్లి– 10 రేకలు; పుదీన ఆకులు – టేబుల్ స్పూన్.
గార్నిషింగ్ కోసం.. జీడిపప్పు – పావు కప్పు; నిమ్మకాయ– ఒకటి (పలుచగా తరగాలి); అల్లం తరుగు– టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – కప్పు.
తయారీ..
బియ్యం, కందిపప్పులు, పచ్చి శనగపప్పు, బార్లీ, గోధుమలను ఒక పెద్ద పాత్రలో వేసి శుభ్రంగా కడిగి, మూడింతలు మంచి నీటిని పోసి పది నిమిషాలసేపు నానబెట్టాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్టులు వేసి కలిపి, పప్పులు, ధాన్యాలు మెత్తబడే వరకు ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత వీటిని మెత్తగా మెదపాలి.
గింజలు ఉడికేలోపు బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి తీసి పక్కన సిద్ధంగా ఉంచుకోవాలి
చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి అందులో హలీమ్ మసాలా పొడి, మిరప్పొడి, పసుపు, ఉప్పు, పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, చికెన్ స్టాక్‌ను (చికెన్ స్టాక్ లేకపోతే మంచి నీటిని పోయాలి) వేసి ఉడికించాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత అందులోని నీటిని పప్పులు, ధాన్యాలు ఉడికించిన మిశ్రమంలోకి వంపి చికెన్ ముక్కలను మాత్రమే పాత్రలో ఉంచి ఆ ముక్కలను మెదపాలి. మెదిపిన చికెన్‌ను కూడా ధాన్యాలు, పప్పులు ఉడికించిన మిశ్రమంలో వేసి కలిపి మంట తగ్గించి అన్నింటి రుచి కలవడం కోసం మళ్లీ ఉడికించాలి
ఉల్లిపాయ ముక్కలు వేయించిన బాణలిలో మిగిలిన నేతిలో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పుదీన వేసి అర నిమిషం పాటు వేయించి ఈ పోపును చిన్నమంట మీద ఉడుకుతున్న చికెన్, పప్పులు, ధాన్యాల మిశ్రమంలో వేసి కలిపితే హలీమ్ రెడీ
గార్నిష్ చేయడానికి ఒక పాత్రలో కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, జీడిపప్పులు, ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి
ఒక కప్పులో వేడి వేడి హలీమ్ వేసి పై గార్నిష్ కోసం సిద్ధం చేసిన మిశ్రమాన్ని కొద్దిగా చల్లి, నిమ్మకాయ ముక్క పెట్టి సర్వ్ చేయాలి.
ఇవి చదవండి: కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి!