తక్కువ ధరకు అమ్ముతున్నాడని..
తూర్పుగోదావరి: వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ యువ వ్యాపారి చేసిన ప్రయత్నం అతని చావుకు కారణమైంది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో బుధవారం వెలుగుచూసింది. వ్యాపారంలో నిలదొక్కుకోవాలనే తపనతో మార్కెట్ ధర కంటే ఓ పది రూపాయలు తక్కువకే తన సరుకును అమ్ముతున్న ఓ అమాయక యువకుడిని.. తోటి వ్యాపారులు కడతేర్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కోపల్లి గ్రామానికి చెందిన సాల సురేష్(20) కొద్ది రోజుల కిందట పి.గన్నవరానికి వలస వచ్చాడు. స్థానికంగా చికెన్ సెంటర్ ను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వినియోగదారులను ఆకర్షించేందుకు మార్కెట్ ధర కంటే కిలోకు పది రూపాయలు తగ్గించి ఇవ్వడం ప్రారంభించాడు. దీంతో అతని వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగింది.
సురేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేని అతని బంధువులు (అదే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు) అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 5న అమలాపురంలో తక్కువ ధరకే కోళ్లను అమ్ముతున్నారని చెప్పి ఇద్దరు వ్యాపారులు సురేష్ ను తమ వాహనంపై ఎక్కించుకుని వెళ్లారు. గొల్లంపూడ్ గ్రామశివార్లలోకి వెళ్లిన తర్వాత సురేష్ తలపై సుత్తితో మోది దారుణంగా చంపేశారు. అనంతరం సురేష్ మృతదేహానికి ఇనుపరాడ్లు కట్టి ప్రధానకాలువలో పడేశారు.
కోళ్లను కొనుగోలు చేయడానికి వెళ్లిన తనయుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో మంగళవారం సురేష్ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వ్యాపారులను తమదైన శైలిలో ప్రశ్నించడంతో.. తామే సురేష్ ను హతమార్చి ప్రధానకాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.