చిక్కుల్లో చిదంబరం కుటుంబం
సాక్షి, చెన్నై: ఆదాయ పన్ను శాఖ తాజా చర్యతో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుటుంబం మొత్తం చిక్కుల్లో పడింది. చిదంబరంతో సహా ఆయన భార్య నళిని, కుమారుడు కార్తి చిదంబరం, కోడలు శ్రీనిధిలపై ఆదాయ పన్నుశాఖ ఈ కీలక చర్యలకు దిగింది. నల్లధనం చట్టం కింద వీరిపై చార్జిషీట్లు దాఖలు చేసింది. చెన్నైలోని స్పెషల్ కోర్టు ముందు శుక్రవారం నాలుగు చార్జ్షీట్లను నమోదు చేసింది. ప్రత్యేక పన్నుల చట్టం కింద,(అప్రకటిత విదేశీయ ఆస్తులు, పెట్టుబడులు) సెక్షన్ 50 ప్రకారం ఈ ఆరోపణలను నమోదు చేసింది.
నళిని, కార్తి, శ్రీనీధిలపై విదేశీ ఆస్తుల వివరాలను పూర్తిగా కానీ లేదా పాక్షికంగాగానీ ప్రకటించలేదంటూ ఐటీ శాఖ ఆరోపించింది. యూకేలోని కేంబ్రిడ్జ్లో రూ. 5.37 కోట్ల విలువైన స్థిరాస్తులు, 80 లక్షల ఆస్తి, అమెరికాలో 3.25 కోట్ల రూపాయల ఆస్తులను వెల్లడించలేదని అధికారులు తెలిపారు. చెస్ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ సహ యజమాని కార్తి చిదంబరం పెట్టుబడులను బహిర్గతం చేయకుండా చట్టా ఉల్లంఘనకు పాల్పడ్డారని చార్జిషీట్లో ఆదాయ పన్ను శాఖ పేర్కొంది.
కాగా ఈ ఆరోపణలను ఖండించిన కార్తి చిదంబరం తాను ఇప్పటికే వివరాలను సమర్పించినట్టు వాదిస్తూ మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో కార్తీకి, ఆయన కుటుంబ సభ్యులకు ఐటీ శాఖ ఇటీవల నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2015 లో మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. విదేశాల్లో అక్రమ సంపదను రహస్యంగా ఉంచిన భారతీయులకు 120 శాతం దాకా జరిమానాతోపాటు పదేళ్ల దాకా శిక్ష విధించే అవకాశ ఉంది.