మండలి ఎన్నికలు నేడే
* ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్
* ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం సోమవారం ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని ఒకటో నంబరు సమావేశ మందిరంలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదివారం సాయంత్రం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసన సభా కార్యదర్శి రాజ సదారాం ఏర్పాట్ల గురించి వివరించారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. కాగా, సీపీఎం, సీపీఐ తాము ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించాయి. దీంతో 118 మంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. పోలింగ్ ముగిశాక, ఇదే రోజు 5 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించి... రాత్రికల్లా విజేతలను ప్రకటిస్తారు.