సిటీ రోడ్లపై సీఎం సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: ‘ఢిల్లీలో రోడ్లు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడెందుకింత అధ్వానంగా దెబ్బతింటున్నాయి? ఒక్క వానకే ఛిద్రమవుతున్నాయెందుకు? సమస్య పరిష్కారానికి మీరేం చేస్తున్నారు?’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారుల తీరు పై మండిపడ్డారు. నగరంలో ర హదారులు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆయన శుక్రవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ తదితర విభాగాల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. యంత్రాంగం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నిధుల సమస్య లేదు.
ఎన్ని కావాలో చెప్పండి. రోడ్లు మాత్రం బాగుండాలి. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు, నిర్వహణ పనులు జరగాలి’ అన్నారు. సమస్య పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో వారంలో తనకు నివేదికనివ్వాలని ఆదేశించారు. వచ్చేవారం మరోమారు సమీక్షిస్తానన్నారు. ఆర్అండ్బీ, జలమండలి తదితర విభాగాల సమన్వయంతో తగిన ప్రణాళికతో జీహెచ్ఎంసీ ముందుకు రావాలన్నారు. ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా, నగర జనాభాకు తగిన విధంగా, అన్ని కాలాల్లో మన్నికగా ఉండేలా పనులు చేపట్టాల న్నారు.
ఇకపై ఇలాంటి పరిస్థితి సహించేది లేదన్నారు. వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు తగిన కేంబర్తో, నాణ్యమైన సామగ్రితో రహదారుల పనులు చేయాలని సూచిం చారు. సమావేశంలో మంత్రులు గీతారెడ్డి, ముఖేశ్‌గౌడ్, డి.నాగేందర్, చీఫ్ సెక్రటరీ మహంతి, మున్సిపల్ పరిపాలన, పట్టాణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి, జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, జలమండలి ఎండీ శ్యామలరావు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రేంచంద్రారెడ్డి, ఆయా విభాగాల ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళిక, పర్యవేక్షణ లోపాలు..
నగర రోడ్ల ప్రస్తుత దుస్థితికి తగిన ప్రణాళిక లేకపోవడం, పర్యవేక్షణ కొరవడటం, నిబద్ధతలేమి కారణాలని సీఎం అభిప్రాయపడ్డారు. వచ్చేవారానికల్లా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని, దీనికి సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జోషికి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ సీజన్లో నిరంతరాయంగా.. ఎక్కువ వర్షాలు కురియడం వ ల్ల రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. మున్నెన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలు కురిశాయని కృష్ణబాబు తెలిపారు. దీంతో నీటి నిల్వలతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 512 మి.మీ.ల వర్షపాతం నమోదైందని, సాధారణం కంటే ఇది 26.1 శాతం ఎక్కువన్నారు.
జీహెచ్ఎంసీలో సాధారణ వర్షపాతం 406 మి.మీలని తెలిపారు. నీటినిల్వ ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. కేంబర్ ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో మిల్లింగ్లతోపాటు బీటీ రోడ్లకు రీకార్పెటింగ్ పనులు చేస్తామని చెప్పారు. నీటి లీకేజీలు, మురుగునీటి ప్రవాహం, వివిధ విభాగాల అవసరార్థం రోడ్డు కటింగ్ల వల్ల కూడా రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయన్నారు. ప్రస్తుతం మరమ్మతు పనుల్ని కొనసాగిస్తామని, శాశ్వత రీకార్పెటింగ్ పనుల్ని మాత్రం వర్షాకాలం ముగిసిన వెంటనే చేపడతామన్నారు. ఈ సీజన్లో 2739 ప్రాంతాల్లో 61.35 కి.మీ.ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, 39.54 కి.మీ.ల మేర మరమ్మతులు చేశామని, 15310 గుంతలకు 13501 పూడ్చామని ఆయన వివరించారు.