సీఎం భద్రతకు మైన్‌ప్రూఫ్ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భద్రత కోసం మందుపాతరలను తట్టుకునే సామర్థ్యం కలిగిన వాహనాలను పోలీసుశాఖ కొనుగోలు చేసింది. సీఎం కాన్వాయ్‌లో ప్రస్తుతం బులెట్‌ప్రూఫ్ వాహనాలను వినియోగిస్తుండగా వీటి స్థానంలో మైన్‌ప్రూఫ్ వాహనాలు వచ్చి చేరనున్నాయి. మందు పాతర్లను తట్టుకునే సామర్థ్యం కలిగిన వాహనాలను కొనుగోలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో జామర్ వాహనంతోపాటు బులెట్‌ప్రూఫ్ కలిగిన మూడు ఫార్చ్యునర్ వాహనాలను వినియోగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్కార్పియో బులెట్‌ప్రూఫ్ వాహనాలను ఉపయోగించారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత స్కార్పియోల స్థానంలో అత్యంత ఖరీదైన ఫార్చ్యునర్ వాహనాలు వచ్చిచేరాయి. ముఖ్యమంత్రి భద్రత కోసం ఇప్పుడు తాజాగా రూ. 1.21 కోట్లతో రెండు టయోటా ప్రడొ వాహనాలను కొనుగోలు చేశారు. మరో కోటి రూపాయలు వెచ్చించి ఆ వాహనాలను మైన్‌ప్రూఫ్‌గా తయారు చేయిస్తున్నారు. మందుపాతర్లు ప్రయోగించినా ఆ వాహనం దెబ్బతినకుండా ఉంటుంది. అందులో ప్రయాణించేవారి ప్రాణాలకు ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. నగరంతోపాటు ముందస్తుగా నిర్ణయించిన జిల్లా పర్యటనల్లో సీఎం ఇవే వాహనాలను వినియోగిస్తారు. అత్యవసరంగా జిల్లాలకు వెళ్లే సమయాల్లో మాత్రం అందుబాటులో ఉన్న బులెట్‌ప్రూఫ్ వాహనాలనే వినియోగిస్తారు.