Chief Minister Manohar Lal Khattar
-
హనీప్రీత్ అరెస్ట్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పంచకుల : డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ అరెస్ట్ వ్యవహారంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్ విషయంలో పంజాబ్ పోలీసుల పాత్రపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాల్ మే కుచ్ కాలా హై (అనుమానించదగ్గ విషయం ఏదో ఉంది) అని పేర్కొన్నారు. వారికి(పంజాబ్ పోలీసులకు) అంతా తెలుసు. హనీప్రీత్ ను ట్రాకింగ్ చేయటం.. అరెస్ట్ అంతా వారి మాధ్యమంగానే జరిగింది. మా(హర్యానా) ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది. కానీ, వాళ్లు అలా చేయలేదు. అందుకే అరెస్ట్ లో జాప్యం జరిగింది అని ఖట్టర్ వ్యాఖ్యానించారు. హనీప్రీత్‌ను మంగళవారం ఛండీగఢ్ హైవేలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమెతోపాటు మరో మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పంజాబ్ నేత హర్మిందర్ సింగ్ జస్సీ కూతురు రామ్ రహీమ్ కొడుకును పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె సహకారంతోనే హనీప్రీత్ తప్పించుకోవాలని ప్రయత్నించిందని.. తన పరపతిని ఉపయోగించి హనీకి భద్రత కల్పించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. గతంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవటంతోనే పంచకుల రణరంగంగా మారిందని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంచకుల సెక్టార్-20 లోని రాంపూర్ జైల్లో విచారణ ఎదుర్కుంటున్న హనీప్రీత్ ఎలాంటి విషయాలను వెల్లడించకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెపై లైడిక్టర్ టెస్ట్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు కోర్టు అనుమతి తీసుకోనున్నట్లు చెబుతున్నారు. -
జాట్ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
చండీగఢ్: విద్యా, ఉద్యోగ రంగాల్లో జాట్ కులస్తులు సహా మరో నాలుగు కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసే కీలక బిల్లుకు హరియాణా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏప్రిల్ 3లోగా తమను బీసీ జాబితాలో చేర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జాట్లు విధించించిన డెడ్ లైన్ దృష్ట్యా ప్రభుత్వం ఆమేరకు చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాలు మార్చి 31తో ముగియనుండటంతో ఆలోపే జాట్ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ ఆమోదించిన బిల్లులోని వివరాలు ఇలా ఉన్నాయి జాట్లకు రిజర్వేషన్లు కల్పించేలా బీసీ జాబితాలోనే మరో కేటగిరీని పొందుపర్చారు విద్యారంగంలో, క్లాస్ 3, క్లాస్ 4 ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు ఈ 10 శాతంలో 6 శాతం జాట్లకు కాగా మిగతా 4 శాతం జాట్ సిక్కులు, రోర్లు, బిష్ణోయిలకు లభిస్తుంది. పదేపదే రిజర్వేషన్ల ఆందోళనలు తలెత్తకుండా హరియాణా వెనుకబడిన కులాల కమిషన్ పేరుతో ఓ శాశ్వత సంస్థను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాట్లకు రిజర్వేషన్ కల్పించాలంటూ ఆ కులస్తులు గత నెలలో చేపట్టిన ఆందోళనలు హింసాయుతంగా మారిన సంగతి తెలిసిందే. నాటి అల్లర్లలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికిపైగా గాయపడ్డారు. వందల సంఖ్యలో రైళ్లు నిలిచిపోయాయి. డిమాండ్లను పరిష్కరిస్తామన్న ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించిన జాట్లు.. ఏప్రిల్ 3లోగా పరిష్కారం లభించకుంటే మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నది.