Chief Minister Yogi Adithyanath
-
యూపీ పిల్లల మరణాలు.. శివ సేన స్పందన
సాక్షి, ముంబై: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లల మరణాల ఉదంతాలపై చర్యలు మచ్చుకైనా కనిపించటం లేదు. ఆక్సిజన్, మందుల కొరతతో మృత్యు ఘోష కొనసాగుతున్నా.. ఆదిత్యానాథ్ ప్రభుత్వం పట్టన్నట్లు వ్యవహరిస్తుందన్న విమర్శలు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మానస పు(ప)త్రిక సామ్నలో శివ సేన పార్టీ బీజేపీని ఏకీపడేసింది. మంగళవారం తన సంపాదకీయంలో ఉత్తర ప్రదేశ్ ఆస్పత్రుల వ్యవహారంపై వ్యాసం ప్రచురించింది. గోరఖ్ పూర్, ఫర్రూఖాబాద్ ఆస్పత్రిలో మరణించిన పిల్లలో చాలా మంది పేద కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ఏమైనా జరిగితే వారికి ప్రభుత్వాసుపత్రులే గతి. తమ ప్రాణాలను కాపాడే గుడిగా వాటిని పేదవాళ్లు భావిస్తారు. కానీ, ప్రభుత్వాల నిర్లక్ష్యాల కారణంగా ఇప్పుడు అవే వారిపాలిట మృత్యు కుహరాలుగా మారిపోయాయి అని సామ్న తెలిపింది. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా లేమితోనే పిల్లలంతా చనిపోతున్నారని ప్రభుత్వానికి తెలిసి కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోవటం లేదు. సౌకర్యాలను మెరుగుపరచటం లేదు. అంటే ప్రజల ప్రాణాలపై అక్కడి బీజేపీ ప్రభుత్వానికి ఎంత పట్టింపు ఉందో అర్థమైపోతుంది అని వ్యాసంలో పేర్కొంది. కాగా, గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో సుమారు 70 మంది, ఫర్రూఖాబాద్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 50 మంది(ఇవాళ మరో చిన్నారి) ఆక్సిజన్, సరైన మందులు లేకపోవటం, సిబ్బంది కొరత తదితర కారణాలతో చనిపోయిన విషయం తెలిసిందే. -
యోగి ముందుకు గోరఖ్‌పూర్ నివేదిక
లక్నో: గోరఖ్‌పూర్ పిల్లల మరణాల ఘటనకు సంబంధించి కీలక నివేదిక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ మంగళవారం సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు రిపోర్ట్ సమర్పించారు. ఈ నేపథ్యంలో బీఆర్డీ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌తోపాటు 5 గురు సిబ్బందిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని యోగి ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని హెల్త్ సెక్రటరీ అలోక్ కుమార్, ఆర్థిక కార్యదర్శి ముకేష్ మిట్టల్, సంజయ్ గాంధీ ఆస్పత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ హేమ చంద్ర కమిటీ ఘటనపై విచారణ చేపట్టింది. జిల్లా మేజిస్ట్రేట్ రాజీవ్ రౌతెలా రిపోర్ట్‌తోపాటు తాము అధ్యయనం చేసిన వివరాలను సీఎంకు సమర్పించిన నివేదికలో పొందుపరిచింది. ఆక్సిజన్ కొరత విషయం తెలిసి కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, బకాయిల వ్యవహారం ప్రిన్సిపాల్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదని రెండు కమిటీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆగష్టు 10 నుంచి 11 మధ్య 36 మంది పిల్లలు ఆక్సిజన్ కొరతతో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో మిగతా పిల్లల మరణాల గురించి కూడా ప్రస్తావించిన కమిటీ, మెరుగైన సదుపాయాలు కల్పించాలంటూ ప్రభుత్వానికి సిఫార్సులు కూడా చేసినట్లు తెలుస్తోంది.