యూపీ పిల్లల మరణాలు.. శివ సేన స్పందన
యూపీ పిల్లల మరణాలు.. శివ సేన స్పందన
Published Tue, Sep 5 2017 10:41 AM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM
సాక్షి, ముంబై: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లల మరణాల ఉదంతాలపై చర్యలు మచ్చుకైనా కనిపించటం లేదు. ఆక్సిజన్, మందుల కొరతతో మృత్యు ఘోష కొనసాగుతున్నా.. ఆదిత్యానాథ్ ప్రభుత్వం పట్టన్నట్లు వ్యవహరిస్తుందన్న విమర్శలు నానాటికీ ఎక్కువైపోతున్నాయి.
ఈ నేపథ్యంలో మానస పు(ప)త్రిక సామ్నలో శివ సేన పార్టీ బీజేపీని ఏకీపడేసింది. మంగళవారం తన సంపాదకీయంలో ఉత్తర ప్రదేశ్ ఆస్పత్రుల వ్యవహారంపై వ్యాసం ప్రచురించింది. గోరఖ్ పూర్, ఫర్రూఖాబాద్ ఆస్పత్రిలో మరణించిన పిల్లలో చాలా మంది పేద కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ఏమైనా జరిగితే వారికి ప్రభుత్వాసుపత్రులే గతి. తమ ప్రాణాలను కాపాడే గుడిగా వాటిని పేదవాళ్లు భావిస్తారు. కానీ, ప్రభుత్వాల నిర్లక్ష్యాల కారణంగా ఇప్పుడు అవే వారిపాలిట మృత్యు కుహరాలుగా మారిపోయాయి అని సామ్న తెలిపింది.
ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా లేమితోనే పిల్లలంతా చనిపోతున్నారని ప్రభుత్వానికి తెలిసి కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోవటం లేదు. సౌకర్యాలను మెరుగుపరచటం లేదు. అంటే ప్రజల ప్రాణాలపై అక్కడి బీజేపీ ప్రభుత్వానికి ఎంత పట్టింపు ఉందో అర్థమైపోతుంది అని వ్యాసంలో పేర్కొంది.
కాగా, గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో సుమారు 70 మంది, ఫర్రూఖాబాద్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 50 మంది(ఇవాళ మరో చిన్నారి) ఆక్సిజన్, సరైన మందులు లేకపోవటం, సిబ్బంది కొరత తదితర కారణాలతో చనిపోయిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement