ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదని..
క్యాంపు కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం
► కష్టాలు గట్టెక్కించాలని కోరేందుకు వచ్చిన నాగార్జున
► నాలుగు రోజులుగా అపాయింట్మెంట్ కోసం యత్నం
► కూతురు, మేనల్లుడితో కలసి పురుగు మందు తాగిన వైనం
► గాంధీ ఆస్పత్రికి తరలింపు.. ఒకరి పరిస్థితి విషమం
హైదరాబాద్: కష్టాల నుంచి గట్టెక్కించాలని ముఖ్యమంత్రిని కోరేందుకు వచ్చిన ఒక వ్యక్తి, నాలుగు రోజులైనా ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదనే ఆవేదనతో గురువారం సాయంత్రం కూతురు, మేనల్లుడితో సహా క్యాంపు కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయ త్నానికి పాల్పడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా మోతె మండలం లాల్ తండాకు చెందిన బానోతు నాగార్జున (40)కు నలుగురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలకు చదువు చెప్పించడం కష్టంగా మారింది. దీనికి తోడు ఒక కుమారునికి ఐదేళ్ల క్రితం గుండె పోటు రాగా ఆపరేషన్ చేయించారు. అతనికి ఇటీవల మళ్లీ ఆరోగ్య సమస్య తలెత్తింది. పైగా మేనల్లుడు తెజావత్ శ్రీనివాస్ (18)ను కూడా నాగార్జునే పోషిస్తున్నాడు. తనకున్న రెండెకరాలతో ఐదుగురి పోషణ, చదువులు, కొడుకు వైద్య ఖర్చులు తలకు మించిన భారం కావడంతో స్థానికుల సలహా మేరకు సీఎం కేసీఆర్‌ను సాయం అర్థించాలని నిర్ణయించుకున్నాడు.
పిల్లలకు ఉచిత కేజీ టు పీజీ విద్య, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం, తనకు వాచ్‌మన్ వంటి ఏదైనా ఉపాధి కల్పించాలని కోరాలని భావించాడు. కుటుంబంతో సహా రాజధానికి వచ్చి నాలుగు రోజులుగా సీఎం అపాయింట్మెంట్ కోసం బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విఫలయత్నం చేశాడు. గురువారం కూడా మేనల్లుడు, కుమార్తె నవ్య (13)తో కలిసి క్యాంప్ కార్యాలయానికి వచ్చి ప్రయత్నించినా లాభం లేకపోవడంతో నిరాశకు లోనయ్యాడు. జీవితంపై విరక్తి చెంది తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును ముప్పావు వంతు తాగాడు. మిగతాది కుమార్తెకు తాగించాడు. శ్రీనివాస్ మరోబాటిల్లోని పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడు తున్న ముగ్గురినీ క్యాంపు కార్యాలయ సెక్యూరిటీ సిబ్బంది గమనించి గాంధీకి తరలించారు.
నాగార్జున, శ్రీనివాస్‌లకు ఏఎంసీలో, నవ్యకు పీఐసీయూలో చికిత్స చేస్తున్నారు. పురుగుల మందు ప్రభావంతో వారికి పలు అవయవాలు సక్రమంగా పని చేయడం లేదని వైద్యులు తెలిపారు. వీరిలో చిన్నారి నవ్య పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన ఇద్దరికీ ప్రాణాపాయం లేదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. తాగేసిన మందు బాటిళ్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. నాగార్జున భార్య, మిగతా పిల్లలు కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారని సమాచారం.