సభలో ఆస్తుల రచ్చ
-వెల్లడించని అధికారులపై సభ్యుల ఆగ్రహావేశాలు
- చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఆస్తుల వివరాలను వెల్లడించని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, కేఏఎస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శాసన సభకు తెలిపారు. ఇప్పటికే అలాంటి అధికారులకు నోటీసులను జారీ చేశామని చెప్పారు.
మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులందరూ ఏటా డిసెంబరు 31లోగా ప్రభుత్వ నిర్ణీత నమూనాలో స్థిరాస్తి వివరాలను సమర్పించాల్సి ఉందని వెల్లడించారు. కేఏఎస్ అధికారులు మార్చి 31లోగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 216 మంది ఐఏఎస్ అధికారులకు గాను 214 మంది, 143 మంది ఐపీఎస్ అధికారులకు గాను 113 మంది ఆస్తి వివరాలను సమర్పించారని తెలిపారు.
146 మందికి గాను 29 మంది ఐఎఫ్ఎస్ అధికారులు ఇంకా తమ స్థిర, చరాస్తుల వివరాలను సమర్పించ లేదని చెప్పారు. అలాగే 285 మంది కేఏఎస్ అధికారులకు గాను 184 మంది వివరాలు వెల్లడించ లేదని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఆస్తి వివరాలను సమర్పించని 14 మంది అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టామని, ఆరుగురు అధికారులకు జరిమానా విధిస్తూ ఆదేశాలను జారీ చేశామని వివరించారు.
ఈ సందర్భంగా పార్టీలకతీతంగా సభ్యులు మాట్లాడుతూ, ఆస్తుల వివరాలను వెల్లడించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్ అధికారుల తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే వారే ఆస్తుల వివరాలను వెల్లడించక పోవడం వారి అవిధేయతను చాటుతోందని తూర్పారబట్టారు. బీజేపీ, జేడీఎస్‌లకు చెందిన సభ్యులు కూడా అధికారుల తీరును తప్పుబట్టారు. వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించవద్దని సీఎంను కోరారు.