ఉప్పొంగె... ఉత్సాహం
కాస్తంత ప్రోత్సాహం ఉంటే చాలు... ఎంతలా చెలరేగుతారో చూపించారు పేద విద్యార్థులు. ప్రతిభకు కొదవ లేదని... ఎవరికీ తీసిపోమనీ చేతల్లో చెప్పారు. దేశభక్తి గీతాలు, విచిత్ర వేషధారణలు, పల్లె సోయగాలు, జానపదాలు... ఒకటేమిటి... అన్నింటా అదరగొట్టి అబ్బురపరిచారు. యూత్ ఫర్ సేవ సంస్థ దర్గాలోని నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్లో ఆదివారం నిర్వహించిన ‘చిగురు’ వేడుకగా సాగింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి, ఆదాపై విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు అద్భుతంగా ఉన్నాయి.
నగరంలోని 150కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, అనాథ ఆశ్రమాలకు చెందిన దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు ఈ వేడుకలో ఉత్సాహంతో ఊగిపోయారు. పేద విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు మూడేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని యూత్ ఫర్ సేవ వ్యవస్థాపకుడు శోభిత్ చెప్పారు. తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో విద్యార్థులు రక్తదానం చేశారు.