Chilakamarti Lakshmi Narasimham
-
తెలుగువారి ఘనకీర్తి
ఆంధ్రా మిల్టన్‌గా, ఆంధ్రాస్కాట్గా పేరుప్రఖ్యాతులు పొందిన కళా ప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం బహుముఖ ప్రజ్ఞాశాలి. అటు సమా జసేవతోపాటు ఇటు సాహితీసేవ చేస్తూ ఆనాటి సమాజంలోని అనేక దురాచారాలపై పోరాడారు. అలా పోరాడేవారికి అండదండలందిం చారు. అందుకు ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. కందుకూరి వీరేశ లింగాన్నే తనకు స్ఫూర్తిగా తీసుకున్నారు. బాల్య వివాహాలను నిరోధించ డంలో, వితంతు వివాహాలను ప్రోత్సహించడంలో, ఇతర సామాజిక సంస్కరణలు తీసుకు రావడంలో చిలకమర్తి ముందున్నారు. తన రచ నల ద్వారా ఆర్జించిన డబ్బును పాఠశాలల స్థాపనకూ, పుస్తకాల పంపిణీకి ఆయన వినియోగించారు. ధనవంతులు స్వీయ ప్రతిష్ట కోసం సత్రాలు కట్టించి, సమారాధనలు, సంతర్పణలూ చేసే బదులు సమాజం లోని అట్టడుగు వర్గాల ప్రజల గురించి ఆలోచిం చడం లేదని చిలకమర్తి వాపోయారు. మానవ సేవే మాధవసేవ అని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవా నుడే చెప్పినా వీరికి పట్టదని ఆవేదన చెందారు. భాగ్యవంతులంతా నిమ్నజాతి ఉద్ధరణ కోసం తమ వంతు వెచ్చించినప్పుడే సమాజం ఉన్నత స్థితికి ఎదుగుతుందని నమ్మిన మహనీయుడాయన! దేశ స్వాతంత్య్రోద్యమంలో దక్షిణ భారత మంతటా సభలు నిర్వహించి, తన ఉపన్యాసాలతో ఆనాటి యువతను ఉర్రూతలూగించారు. ప్రజల్లో స్వరాజ్యకాంక్షను రగిలించారు. ఇంగ్లిష్ చదువులు అవసరమే గానీ, వారి ఆచారవ్యవహారాలను అనుసరించ నక్కరలేదని, మన ప్రాచీన సంస్కృతి, సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో విలువైనవని ఆయన హితవు పలికారు. ఈనాటి యువతరానికి చిలకమర్తి స్వీయ చరిత్రతోసహా ఆయన రచనలన్నిటినీ అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి.(నేడు సాయంత్రం హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో చిలకమర్తి లక్ష్మీనరసింహం 152వ జయంతి వేడుకల సందర్భంగా) సి.కె.ఎమ్. కుమార్, శారదానగర్, హైదరాబాద్ మొబైల్ : 99121 81379 -
పద్యానికి ‘పాడియావు’నిచ్చిన కవీంద్రుడు
సాహిత్య కార్యక్రమాలతో కొద్దో గొప్పో పరిచయమున్న తెలుగువారికి సుపరిచితమైన వాక్యం ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్’’. ఏదో ఒక సభలో, ఎక్కడో ఒక చోట, ఈ వాక్యం నిత్యం మార్మోగుతూనే ఉంటుంది. ఈ వాక్యానికి ఇంతగా ప్రాచుర్యం కలిగించిన ఆ మూలకర్త సారస్వతమూర్తి చిలకమర్తి లక్ష్మీనరసింహం. గోదావరీ తీరంలోని ఖండవల్లి గ్రామంలో 1867 సెప్టెంబర్ 26న జన్మించిన సామాన్యుడే పున్నయ్య. అంతర్వేది లక్ష్మీనరసింహునికి మొక్కుబడులు కారణంగానేమో, లక్ష్మీ నరసింహం అయ్యారు. పాఠశాల విద్యాభ్యాస కాలం నాటికే, అనూహ్యమైన ధారణాబలం కారణంగా ఏకసంధాగ్రాహి అనిపించుకున్నారు. కళాశాల స్థాయికి వెళ్లలేకపోయినా సంస్కృతాంధ్ర గ్రంథాలను, ఒకరితో చదివించుకుని, జీర్ణించుకున్న ఘనత చిలకమర్తివారిది. పద్యం, గద్యం, నవల, నాటకం, ప్రహసనం, స్వీయచరిత్ర ఇలా పలు రకాల ప్రక్రియలు ఆయన హస్తవాసికి నోచుకుని, తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. 1887వ సంవత్సరం విక్టోరియా మహారాణి జూబ్లీ పరిపాలనోత్సవాల సందర్భంగా, శుభాకాంక్షపూర్వకంగా ఆయన పద్యాలు రాశారు. పాతికేళ్ల ప్రాయానికే చిలకమర్తి సారస్వత జీవనం కవిత్వ ప్రక్రియతో ప్రారంభ మైనట్లుంది. అనంతరం పృధ్విరాజీయం, కాదంబరి, రామచరిత్ర వంటి పద్యకావ్య రచనోద్యుక్తులయ్యారు. సాహిత్యప్రక్రియలన్నింటిలోనూ నవలా, నాటకమూ మాత్రం వీరి సాహిత్య కృషిని అగ్రాసనం మీద నిలిపాయి. కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్రము’ రచనతో తెలుగునవలతో ఆద్యుడైనా, చిలకమర్తి కరస్పర్శతో తెలుగు నవల ఒక గొప్ప ఆకర్షణను సొంతం చేసుకుంది. నాటి సాహిత్య పోషకులు న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీ రచనల కోసం ‘రామచంద్ర విజయం’ అనే నవల రాశారు చిలకమర్తి. బుద్ధిమంతుడైన అమలాపురం కుర్రాడి కథ ఇది. చేయని తప్పుకు అపనిందల పాలై, తన సత్ప్రవర్తనతో, తనను నిందల పాలు చేసిన కుటిలాత్ముల మనసును సహితం మార్పు చేసేలా నైతిక వర్తన జెండా ఎగరేసిన కథా క్రమమే ‘రామచంద్రవిజయం’. ఇది 1894వ సంవత్సరం చింతామణి పత్రికలో ప్రచురితమై ప్రథమ బహుమతి గెల్చుకుంది. అటు తర్వాత... కర్పూర మంజరి, సుధాశరచ్చంద్రము, హేమలత, కృష్ణవేణి, అహల్యాబాయి, సౌందర్యతిలక, మణిమంజరి, గణపతి వంటి నవలలు వ్రాశారు. ముఖ్యంగా గణపతి, ఆనాటి సమా జంలోని బ్రాహ్మణ కుటుంబాల స్థితి గతుల్ని కళ్లకు కట్టిస్తుంది. గణపతిని తలచు కున్నప్పుడల్లా, గిలిగింతలు తెచ్చుకుని, ఎవరికివారుగా, నవ్వుకునే గుణ విశేషం ఉన్న హాస్యరచన. 1960లలో, విజయ వాడ ఆకాశవాణి కేంద్రం, దీనిని 60 నిమి షాల నిడివిగల శ్రవ్యనాటకంగా మలచి ప్రసారం చేసింది. దశాబ్దాలపాటు, ఆకాశవాణి శ్రోతలను అలరించి, ఆహ్లాదపరచిన ఈ శ్రవ్యరూపం, తెలుగు వాళ్ల శ్రవ్య మాధ్యమంలో మైలురాయిగా నిలిచిపోయింది. రాణ్మహేంద్రవరంలో ఇమ్మానేని హనుమంతరావు నాయుడు కోరిక మీదనే, 1899లో ‘కీచకవధ’ నాటకాన్ని రాశారు. ఈ నాటకానికి ఆ రోజుల్లో అనూహ్యంగా ప్రజా దరణ లభించింది. హనుమంతరావు ప్రోత్సాహం కారణంగానే సీతాకల్యాణం, ద్రౌపదీ కల్యాణం, నలచరిత్రము, పారిజాతాపహరణం, గయోపాఖ్యానం ఇలా మరిన్ని నాట కాలు రాశారు. రాసిన కాలంలో ఇవన్నీ వచన నాటకాలే. తదనంతరం కొన్ని పద్యాలు కూడా చేర్చి ప్రచురించారు. ఆ పద్యాల చేరికతో ఈ నాటకాలు అజరామరమై పోయాయి. ముఖ్యంగా ‘గయోపాఖ్యానం’. ఇద్దరు కొట్లాటకు దిగితే, ఆసక్తిగా గమనించడం, మానవ నైజం. అందునా, అయిన వాళ్ల మధ్య కొట్లాట జరిగితే, ఈ ఆసక్తి ద్విగుణీకృతమౌతుంది. ఈ మానవ నైజానికి, గయోపాఖ్యానం నాటకంతో సాక్షి సంతకం చేశారు చిలకమర్తి. వ్యాస భారతంలో లేనప్పటికీ గయోపాఖ్యానంలో కృష్ణార్జునులు ఒకరినొకరు ఎత్తి పొడుచుకునే పద్య సంభా షణలు రంగస్థల వేదికలమీద, సామాన్యులను సహితం ఆకట్టుకున్నాయి. ఆ నాటకం, అద్భుత నాటకమై కూర్చుంది. లక్షల సంఖ్యలో నాటక ప్రతులు అమ్ముడుపోయాయి. ‘‘అల్లుడా రమ్మని యాదరమ్మున పిల్వ బంపు మామనుబట్టి, చంపగలమె?’’ అనే పద్య పాదాలు తెలుగువాళ్ల రసనాగ్రాలపైన ఈనాటికీ నరిస్తూనే ఉంటాయి. డబ్బు కోసమే చిలకమర్తి రచనలు చేయలేదు. ఒక సందర్భంలో ఆంగ్లేయుల ప్రచు రణ సంస్థ ఒకటి, కొన్ని వాచకాలను రాసిపెట్టమని అడిగితే, ఈ దేశంలోని ప్రతి వనరు పైన సంపదను దోచేస్తున్న జాతి, ఈ అక్షర సంపదపైన కూడా దోపిడీ చేస్తుందని తలచి, ఆయన ఒప్పుకోలేదు. దేశీయ సంస్థలకు తప్ప, ఇంగ్లిష్ సంస్థలకు రాయబోనని కరా ఖండిగా తేల్చి చెప్పేశారు. అటువంటి స్వాభిమానంతోనే, పాఠశాలలు నడిపారు. ప్రస్తుతం వీరేశలింగం హైస్కూల్‌గా చలామణిలో ఉన్న పాఠశాల పూర్వరంగంలో చిలకమర్తి స్థాపించినదే. ‘రామమోహన్‌రాయ్ పాఠశాల’ పేరుతో దళిత విద్యార్థుల అభ్యు న్నతికోసం పాఠశాల నడిపారు. నాటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగానికి చేయూతనిస్తూ, పత్రికా నిర్వహణలోనూ చిలకమర్తి కృషి ప్రశంసనీయంగా నిలిచిఉంది. మనోరమ, దేశ మాత, సరస్వతి, దేశసేవ అనే పత్రికలు నడిపారు. స్వాతంత్య్రోద్యమ సన్నివేశంలో నిర్వహించిన వేదికలపై చిలకమర్తి ప్రసంగాలు ఆనాటి ప్రజానీకాన్ని కార్యోన్ముఖులను చేశాయి. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమ సాహి త్యంలో తలమానికంగా, ఈనాటికీ పరిగణించే, ‘‘భరత ఖండంబు చక్కని పాడియావు’’ అన్న పద్యం. అలా వేదికాముఖంగా ఆశువుగా పుట్టినదే. 1907వ సంవత్సరం వంగదేశం నుంచి, రాజమహేంద్రవరం వచ్చిన బిపిన్ చంద్రపాల్ సమక్షంలో గోదావరీ మండల మహాసభ వేదికపైన అది ఊపిరి పోసుకుంది. పాఠశాల నడిపినా, పత్రిక నడిపినా, రచనా వ్యాసంగంలో నవల, నాటకం, పద్యం గద్యం, ప్రక్రియ ఏది నెరిపినా, సామాన్యతలోనే ధీమాన్యతను ప్రదర్శించినవాడు. సారస్వత లోకానికి పులకింతలు పంచిన సింహత్రయంలో చివరివాడు, దృక్కు మంద గించినా, వాక్కున అందగించినవాడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం. (చిలకమర్తి రచనలపై సమగ్ర పరిశోధన చేసిన డా. ముక్తేవి భారతికి, చిలకమర్తి 150వ జయంతి నాడు (26-09-2016) హైదరాబాద్‌లో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సంస్థ... చిలకమర్తి లక్ష్మీనరసింహం స్మారక సాహితీ పురస్కారాన్ని అందజేస్తున్న సందర్భంగా) వోలేటి పార్వతీశం, వ్యాసకర్త దూరదర్శన్ పూర్వ ప్రయోక్త మొబైల్ : 94400 31213 -
వేగం, తేజం కొప్పరపు కవుల సొంతం
ఎనిమిది సెకన్లలో ఒక పద్యాన్ని ఆశువుగా సృష్టించడం... అది కూడా ‘నీలాంబుజారామ కేళీమరాళమై’... వంటి ప్రబంధతుల్యమైన పద్యాలను అప్పటికప్పుడు గుప్పించడం కొప్పరపు కవుల గొప్పతనం. ప్రకాశం జిల్లా మార్టూరులో ఒకసారి అరగంట వ్యవధిలో మూడు వందల అరవై పద్యాలతో మనుచరిత్ర ప్రబంధాన్ని కొప్పరపు కవులు ఆశువుగా చెప్పారు. అది అల్లసాని వారు రచించిన మనుచరిత్ర కాదు. కొప్పరపు వారు అప్పటికప్పుడు అల్లిన కావ్యరాజం. గుంటూరులో పాటిబండ్ల వారింట్లో భోజనం చేసే సమయంలోనే మూడు శతకాలు ఆంజనేయస్వామిపై చెప్పారు. వీరవాసరంలో చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు అధ్యక్షత వహించిన ఒక సాహిత్య సభలో మూడు గంటల్లో నాలుగు వందలకు పైగా పద్యాలతో ‘శకుంతల కథ’ను అద్భుతమైన ప్రబంధవర్ణనలతో పూర్తి చేశారు. కొమరరాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి సమక్షాన నిర్వహించిన సభలో గంటలో నాలుగు వందల ఎనభై పద్యాలు చెప్పారు. గన్నవరంలో జార్జ్ ద ఫిఫ్త్ కారోనేషన్ హాల్ అనే పేరుతో నిర్మించిన టౌన్‌హాల్ వార్షికోత్సవం జరిగింది. ఆ సభలో షేక్స్పియర్ రచించిన సింబలిస్ నాటకాన్ని గంటన్నర కాలంలో నాలుగు వందల పద్యాలతో ఆశువుగా సృష్టించారు. ఇటువంటి సంఘటనలు కొప్పరపు వారి ఆశుకవితా ప్రస్థానంలో ఎన్నోసార్లు జరిగాయి. సభాస్థలిలో ఎప్పుడు ఎవరు ఏ కథను ఇచ్చి దానిని కావ్యంగా మలచమన్నా ఉన్న తడవున వందల పద్యాలతో ఆశువుగా చెప్పడం ఆ కొప్పరపు కవులకే చెల్లింది. ఒక్కరోజు వ్యవధిలోనే రెండేసి శతావధానాలు చేయడం, గంటకొక ప్రబంధాన్ని ఆశువుగా సృష్టించడం ప్రపంచ సాహిత్యంలో అత్యాశ్చర్యకరమైన ప్రతిభ. గద్వాల్ నుండి మద్రాసు వరకు వీరి అవధాన, అశుకవిత్వ సభలు కొన్ని వందలు జరిగాయి. గజారోహణ. గండపెండేర సత్కారాలు, బిరుదభూషణ వరప్రసాదాలు కొల్లలుగా జరిగాయి. అయితే అనేక సందర్భాల్లో వీరు ఆశువుగా చెప్పిన వేలాది పద్యాలు రికార్డు కాకపోవడం, వీరు చిన్నవయసులోనే మరణించడం వల్ల గ్రంథస్థం కాకపోవడంతో ఆ సారస్వత సంపదని మనం సంపూర్ణంగా పొందలేకపోతున్నాం. కొప్పరపు కవులు దైవసంకల్పమ్, సాధ్వీమాహాత్మ్యమ్, శ్రీకృష్ణ కరుణా ప్రభావం, దీక్షిత స్తోత్రమ్, నారాయణాస్త్రం, సుబ్బరాయ శతకం.. మొదలైన రచనలు చేశారు. నేడు కొన్ని అవధాన పద్యాలు, దైవ సంకల్పమ్, సుబ్బరాయ శతకం అందుబాటులో ఉన్నాయి. ఆ కాసిన్ని పద్యాలను కవితా తీర్థంలా భారతీప్రసాదంలా భావించాల్సి వస్తోంది. కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని, విమలానంద భారతీస్వామి, వేదం వెంకటరాయశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, జయంతి రామయ్య పంతులు, కాశీ కృష్ణాచార్యులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, తుమ్మల సీతారామ్మూర్తి చౌదరి... వీరంతా కొప్పరపు కవుల సభల్లో ప్రత్యక్షంగా పాల్గొని వారి ప్రతిభను చూసి పరవశించి ప్రశంసించినవారే. ఇక తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవుల మధ్య జరిగిన వివాదాలు ఆనాడు పెను సంచలనాలు. నాటి పత్రికల్లో ఈ వార్తలు ప్రధాన శీర్షికలుగా అల్లరి చేశాయి. ఈ రెండు జంటల మధ్య సాగిన పోరులో మహాద్భుతమైన పద్యాల సృష్టి జరిగింది. వారి వివాదం సాహిత్యలోకానికి షడ్రశోపేతమైన సారస్వత విందులను అందించింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఆ తగాదాలు సమసిపోయాయి. ఆ రెండు జంటలూ అభేద్య కవితా స్వరూపాలుగా ముందుకు సాగాయి. కొప్పరపు కవులుగా ప్రఖ్యాతులైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి (1885 - 1932), కొప్పరపు వేంకట రమణ కవి (1887-1942) గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ఉన్న కొప్పరం వాస్తవ్యులు. వీరిది కవి వంశం. ఆంధ్ర సాహితీ చరిత్రలోనే ఆశుకవిత్వంలో వీరిదే అగ్రస్థానం. తెలుగువారికే సొంతమైన అవధానప్రక్రియలో అసమాన కవివీరులుగా నిలిచిన కొప్పరపు కవులు తరతరాలకు స్ఫూర్తిప్రదాతలు. వీరి చరిత్ర రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు పాఠ్యాంశాలలో చేర్పించి, తెలుగు తేజాన్ని తరతరాలకు అందించే ప్రక్రియ ప్రభుత్వాలు చేపట్టాలని ఆకాంక్షిద్దాం. - మా శర్మ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, కొప్పరపు కవుల కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా కొప్పరపు కవుల జయంతి మహోత్సవము జరుగుతున్న సందర్భంగా)