అదో పెద్ద వ్యభిచార రాకెట్...
* చిన్నారి దుర్గ కిడ్నాప్ కేసు విచారణలో వెలుగు చూసిన నిజం
* రైలు, బస్స్టేషన్ల వద్ద యువతులు, బాలికల అపహరణ
* యాదగిరిగుట్టలో వ్యభిచార గ్యాంగ్‌కు విక్రయం
* తాజాగా చిన్నారిని రక్షించిన పోలీసులు
అడ్డగుట్ట: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఈనెల 5న జరిగిన చిన్నారి దుర్గ కిడ్నాప్.. విడుదల కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది.
దుర్గను కిడ్నాప్ చేసింది కేవలం ఇద్దరే అని అంతా అనుకున్నారు. అయితే, జీఆర్పీ పోలీసుల విచారణలో మరో దిగ్భ్రాంతికర విషయం బయటపడింది. నిందితులు ఇద్దరు కాదని.. వీరి వెనుక మరో ఐదుగురు సభ్యుల వ్యభిచార ముఠా ఉందని తేలింది. పోలీసులు మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరిలో కొందరు పాతనేరస్తులున్నారని పోలీసులు తెలిపారు.
ఆదివారం సికింద్రాబాద్ జీఆర్పీ ఎస్పీ జనార్దన్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 5న కాకినాడకు చెందిన రాణి కూతురు దుర్గను ఓ మహిళ ఎత్తుకెళ్లింది. రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా జీఆర్పీ పోలీసులు నిందితురాలని పట్టుకొని,బాలికను ఆమె తల్లికి క్షేమంగా అప్పగించారు. కాగా, నిందితురాలి విచారణలో ఇప్పుడు సెక్స్ రా కెట్ గుట్టు రట్టయింది.
మెదక్ జిల్లా జిన్నారంలోని బాలాజీనగర్‌కు చెందిన బొంతల కుమార్(24) సికిం ద్రాబాద్ రైల్వే, బస్టేషన్ల వద్ద మాటు వేసి ఇంటి నుంచి పారిపోయి వచ్చే యువతులు, చిన్నారులను గుర్తిస్తాడు. తమ గ్యాంగ్‌లోని సభ్యురాలు పద్మావతి అలియాస్ సునీత(26) సహకారంతో వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రాప్ చేస్తాడు.
కిడ్నాప్ చేసిన చి న్నారులను ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీయిస్తాడు. వారిని యాదగిరిగుట్ట సుభాష్‌నగర్‌కు చెందిన కంసాని శంకర్(51)కి అమ్మేస్తాడు. శంకర్ తన భార్య దివ్య సహకారంతో వ్యభిచార గృహాలు నడిపే కోడెం బేగమ్మ(60), మేకల బూస(55), చింతల కమలమ్మ(48)లకు వారిని కొంత మొత్తానికి అమ్మేస్తాడు. యు వతులతో ప్రతి రోజూ వ్యభిచారం చేయిస్తూ వచ్చిన డబ్బులో కొంత కమిషన్ తీసుకుంటాడు.
బాలికలను పెంచి పెద్ద చేశాక ‘వృత్తి’లోకి దింపుతారు. యాదగిరిగుట్ట కేంద్రంగా వీరు వివిధ జిల్లాల్లో వ్యభిచార గృహాలు నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుర్గ కిడ్నాప్ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులకు వైష్ణవి(5) అనే మరో పాప కూడా దొరికింది. వైష్ణవిని కాచిగూడ రైల్వే స్టేషన్లో రెండు నెలల క్రితం కుమార్ కిడ్నాప్ చేసి శంకర్‌కు అమ్మేశాడు.
ఆ దుర్మార్గుల నుంచి బాలికను రక్షించిన పోలీసులు ఆమె తల్లిదండ్రుల వివరాలు తెలియకపోవడంతో రెస్క్యూహోంకు తరలించారు. ఈ పాపను గుర్తించిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్పీ జనార్దన్ కోరారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను ఎస్పీ ప్రశంసిస్తూ క్యాష్ రివార్డులు అందజేశారు.