Child Helpline
-
క్యాష్ ఇస్తారా? కేటాయిస్తారా?
ఇది సామాన్యుల బడ్జెట్ అని, ఇది రైతుల బడ్జెట్ అని, ఇది వ్యాపారుల బడ్జెట్ అని, ఇది ఉద్యోగుల బడ్జెట్ అని ఏటా ఏదో ఒక వ్యాఖ్యానం వినిపిస్తుంది. ఈసారి మాత్రం ఇది పూర్తిగా ‘మహిళా బడ్జెట్’ అవవలసిన అవసరమైతే ఉంది. కొద్ది గంటల్లో బడ్జెట్! కష్టకాలంలో వస్తున్న బడ్జెట్. కరోనా వల్ల అందరూ కష్టపడ్డారు. అందరికన్న ఎక్కువ కష్టం అనుభవించింది మహిళలు, బాలికలు, బాలలే! లాక్డౌన్ సమయంలో వారికి రక్షణ, భద్రత లేకుండా పోయాయి. వారిపై లైంగిక హింసకు అడ్డు లేకుండా పోయింది! సొంత ఇంట్లోనే వారికొక ‘స్పేస్’ కరువై పోయింది. ఆ స్పేస్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో ఇవ్వబోతున్నారా? లైంగిక హింసను నిరోధించడానికి కొత్త విధానాలు, కేటాయింపులు బడ్జెట్లో ఏమైనా ఉంటాయా? అయితే అవి ఎలాంటివి అయి ఉంటాయి?! ధీమా కోసం మహిళల కొంగుకు పది రూపాయలు ముడేస్తారా? భారీ నిధుల ప్రణాళిలతోనే ధైర్యం కల్పిస్తారా? స్త్రీ శిశు సంక్షేమానికి యేటా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. ఈసారి సంక్షేమం కన్నా కూడా లైంగిక హింస నుంచి మహిళలకు రక్షణ, భద్రత కల్పించడానికి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరాన్ని కరోనా కలిగించింది. ఈ సంగతి బడ్జెట్ వేసే వాళ్ల దృష్టికి చేరనిదేమీ కాదు. నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇండియా లాక్డౌన్లో ఉన్న సమయంలో ఒక్క జూన్ నెలలోనే మహిళలు, బాలలపై లైంగిక నేరాలు జరిగినట్లు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కు 2043 ఫిర్యాదులు అందాయి! ఇక పిల్లలపై జరిగిన హింసకైతే అంతే లేకుండా పోయింది. లాక్ డౌన్ మొదలైన తొలి 11 రోజుల్లో చైల్డ్ హెల్ప్ లైన్‌కు 3 లక్షల కాల్స్ వెళ్లాయి! కరోనా పరిస్థితులు తెచ్చిపెట్టిన మానసిక ఒత్తిడి కారణం గా మహిళలు, బాలలు లాక్డౌన్ మొత్తం క్షణక్షణం భయం భయం అన్నట్లుగానే గడిపారని మరికొన్ని నివేదికలు వచ్చాయి. స్కూళ్లు మూత పడటం, ఆన్లైన్ చదువులకు సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, ఇరవై నాలుగు గంటలూ ఒకరి కళ్లెదురుగా ఒకరు ఉండిపోవడం, అభిప్రాయభేదాలు, అనవసర ఘర్షణలు, దంపతుల మధ్య మనస్పర్థలు అన్ని కలసి మహిళలు, పిల్లలపైనే దుష్ప్రభావం చూపించాయని స్వచ్ఛంద సంస్థల సర్వే నిపుణులు స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, ఆర్థిక శాఖకు, పోలీసు శాఖకు తమ నివేదికలను అందించారు. ఆ సమాచారం ఆధారంగానైనా నేటి బడ్జెట్లో మహిళలు బాలల భద్రతకు, రక్షణకు మరింతగా నిధులను కేటాయించడం, కొత్తగా ప్రభుత్వ విధానాలను రూపొందించడం వంటివి ఉండొచ్చని, ఉంటే బాగుంటుందని ఒక ఆశ, ఒక ఆకాంక్ష ఈసారి వ్యక్తం అవుతోంది. ∙∙ మహిళా సంక్షేమం కోసం ఇప్పటికే అనేక చట్టాలు, శాసనాలు, పథకాలు, ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి కదా. మళ్లీ కొత్తగా బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటి అనే సందేహాన్ని రానివ్వనంతగా మహిళల జీవితాన్ని దుర్భరం చేసేసింది లాక్డౌన్. వారి ఉద్యోగాలు పోయాయి. ఉపాధులు కొండెక్కాయి. ఇంటెడు చాకిరి కొండంతైంది. ఇంట్లో హింస పెరిగింది. పర్యవసానంగా మహిళల ఆరోగ్యం క్షీణించింది. శారీరకంగా, మానసికంగా కృంగిపోయారు. అంతకన్నా దారుణం వారికి వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడం. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, కరోనా కాలపు అగమ్యగోచరం రెండూ కలిసి మహిళల్ని జీవచ్ఛవాలను చేశాయి. ఈ దుస్థితి నుంచి వారిని తెరిపిన పడేసే ప్రాధాన్యాలు, నిధులు బడ్జెట్లో లేకుంటే.. స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికి ఉన్న మహిళల శ్రమ శక్తి వాటా పదిహేడు శాతానికంటే తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. గత శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును కనీసం 11 శాతానికైనా పెంచుకోవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం అందుకు అవసరమైన మహిళల శక్తి సామర్థ్యాలను, వాళ్లకు కల్పించవలసిన రక్షణ భద్రతలను కూడా గుర్తించి నేటి బడ్జెట్‌కు తుది రూపును ఇచ్చి ఉంటుందనే అనుకోవాలి. లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్–స్టాప్ సెంటర్లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండొచ్చు. విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడూ మహిళలపై జరిగే లైంగిక నేరాలను తగ్గించే విషయంలో పరోక్షమైన పాత్రను వహిస్తాయి. షెల్టర్ హోమ్‌లు ప్రత్యక్ష నరక కూపాల నుంచి కాపాడతాయి. ఈ హోమ్‌ల సంఖ్య పెంచేందుకు, సమర్థవంతంగా వాటిని నిర్వహించేందుకు అవసరమైన నిధులు కూడా ఈ బడ్జెట్లో ఉండాలని సూచిస్తున్న ఆర్థిక రంగ నిపుణులు.. ‘క్యాష్ బేస్డ్ సోషల్ ప్రొటెక్షన్’ ని కూడా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో కల్పించవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు. క్రమం తప్పకుండా మహిళల అకౌంట్లో కొంత డబ్బును విధిగా జమ చేయడమే నగదు రక్షణ విధానం. గ్రామీణ ప్రాంత మహిళల సంక్షేమానికి, లైంగిక హింస నుంచి రక్షణకు ఈ మనీ ట్రాన్స్ఫర్ చాలా వరకు తోడ్పడుతుంది. పై పెచ్చు వారికి ఆర్థిక భరోసాను ఇస్తుంది. దీనిపైన కూడా ఇవాళ్టి బడ్జెట్లో విధానం నిర్ణయమై ఉంటుందని నేషనల్ ఉమెన్ కమిషన్ అంచనా వేస్తోంది. లైంగిక నేరాలపై బాధితులు చేసే ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇంకా చేయబోతున్న వన్–స్టాప్ సెంటర్లకు, విస్తృత రవాణా సౌకర్యాలకు, మహిళల తక్షణ వైద్య అవసరాలకు కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
లాక్డౌన్: 4.6 లక్షల ఫోన్‌కాల్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వం చిన్నపిల్లలకోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ‘చైల్డ్ లైన్ 1098’కి 21 రోజుల లాక్డౌన్ కాలంలో 4.6 లక్షల ఫోన్‌కాల్స్ వచ్చాయని చైల్డ్‌లైన్ ప్రకటించింది. ఇందులో అత్యధిక భాగం లాక్డౌన్ అమలులో ఉన్న మార్చి 20– ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో వచ్చినట్లు తెలిపింది. వీటిలో ఉత్తరాది నుంచి 30 శాతం, పశ్చిమ భారతం నుంచి 29 శాతం, దక్షిణాది నుంచి 21 శాతం, తూర్పు భారతం నుంచి 20 శాతం కాల్స్ వచ్చాయని వెల్లడించింది. ఈ కాలంలో చైల్డ్ లైన్ 1098 వలంటీర్లు క్షేత్ర స్థాయిలో మొత్తం 9385 కేసులను పరిష్కారించారు. వచ్చిన మొత్తం కేసుల్లో 30 శాతం ఈ మహమ్మారిపై వివరణ కోరాయి. కరోనా వైరస్‌కి సంబంధించిన వాటిల్లో 91 శాతం మంది ఆహారం కావాలనీ, 6 శాతం మంది వైద్యసహాయం కావాలనీ, మిగిలిన వారు రవాణా సౌకర్యం కల్పించాలనీ కోరారని హెల్ప్‌లైన్ చెప్పింది. చాలా మంది పిల్లలకు మొబైల్ ఫోన్ సౌకర్యం లేని కారణంగా ఇటువంటి కాల్స్ చేసే అవకాశం వారికి రాలేదని చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 అభిప్రాయపడింది. చదవండి: లాక్డౌన్ సడలిస్తే కష్టమే..! -
బంధాన్ని మరిచి..ఇంటిని విడిచి...
కాలం మారింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైంది. పిల్లలపై పెద్దలకు పట్టు సడలుతోంది. నాలుగు మంచిమాటలు చెప్పేవారు లేకపోతున్నారు. పిల్లల ప్రవర్తనను పసిగట్టలేని బిజీ జీవనాన్ని తల్లిదండ్రులు గడుపుతున్నారు. వారి ఆసక్తి, అభిరుచులను తెలుసుకోలేకపోతున్నారు. కష్టాలను అధిగ మించే సామర్థాలను పెంపొందించకుండా అనవసర ఒత్తిడి పెంచుతున్నారు. కలహాలు పడుతున్నారు. పిల్లలపై ఆవేశాన్ని చూపుతున్నారు. ఇంటిని వీడిపోయే ఆలోచనను రేకెత్తిస్తున్నారు. చేతులారా పిల్ల ల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు మమకారం పంచాలని... ఆసక్తులు గమనించాలని.. బంధాన్ని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. సాక్షి, విజయనగరం : చదువుకోవాలంటూ తల్లిదండ్రులు మందలించారని గుర్ల మండలానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఇంటి నుంచి పారిపోయి బస్సులో వచ్చేసింది. విజయనగరం చైల్డ్‌లైన్ సభ్యులు బాలికను కార్యాలయానికి తీసుకుని వచ్చి సంరక్షించారు. తల్లిదండ్రుల అంగీకారం ప్రకారం కేజీబీవీలో చేర్పించారు. 'విశాఖపట్నం పూర్ణమార్కెట్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించిందని కొద్ది రోజుల కిందట ఇంటి నుంచి వచ్చేసాడు. చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు’. ఇలా అనేక మంది ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారని కొంతమంది, పట్టణాలు చూద్దామని మరి కొందరు ఇంటిని వీడుతున్నారు. ఆవేశంలో ఇంటిని వీడిన వారు పోలీసులు, చైల్డ్‌లైన్ సభ్యులకు దొరికితే ఫర్వాలేదు. పొరపాటును ఏ అగంతుకులకో దొరికితే పిల్లల పరిస్థితి అంతే సంగతి. మూడేళ్లలో 100 మంది... గత మూడేళ్ల కాలంలో దాదాపు 100 మంది వరకు ఇంటి నుంచి పారిపోయి వచ్చేశారు. వీరిలో అధికశాతం మంది తల్లిదండ్రులు మందలిస్తే పారిపోయి వచ్చిన వారే. అధికారులు గుర్తించని వారు ఎంతోమంది ఉంటారు. నేటి సాంకేతిక కాలంలో తల్లిదండ్రులు ఉరుకుల పరుగుల జీవనం సాగిస్తున్నారు. పిల్లల ఆసక్తులు, అభిరుచులను గమనించలేనంత బిజీ అవుతున్నారు. దీంతో పిల్లల ప్రవర్తనపై పట్టుకోల్పోతున్నారు. వారు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మరికొందరు పిల్లలకు ఆసక్తిలేని రంగాల్లో రాణించాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఆయా రంగాల్లో వెనుకబడితే మందలిస్తున్నారు. దండిస్తున్నారు. దీనివల్లే చాలామంది పిల్లలు ఇంటిని వీడేందుకు సిద్ధపడుతున్నట్టు మానసిక నిపుణులు చెబుతున్నారు. మరికొన్నిచోట్ల తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడడంతో పిల్లలకు భద్రత కరువవుతోంది. ఇంటిని వీడిపోవాలన్న ఆలోచన తలెత్తి మెల్లగా తల్లిదండ్రుల నుంచి దూరమవుతున్నారు. వీరిలో కొందరు మంచి మార్గాల్లో పయనిస్తుంటే.. మరికొందరు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. గొడవల వల్లే... కుటుంబంలోను, తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండడంతో పిల్లలకు భద్రత కరువవుతోంది. దిశానిర్దేశం చేసేవారు లేకపోతున్నారు. దీంతో కొంతమంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం కూడా పిల్లలపై ఉంటుంది. సోషల్ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కొంతమంది పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్ఛ ఉండడం లేదని, తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – జీకే దుర్గ, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ -
అశ్లీల సైట్లలో ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్
న్యూఢిల్లీ : బాలల పట్ల లైంగిక నేరాల నిరోధం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రభుత్వం కొన్ని రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘జనాలు ఇంటర్నెట్లో అశ్లీల విషయాల గురించి సర్చ్ చేస్తున్నప్పుడు ఈ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ కనిపిస్తుండటంతో.. వారు ఈ నంబర్‌ను సెక్సువల్ సర్వీస్‌లు అందజేయడానికి ఉద్దేశించినదిగా భావిస్తున్నారు. దాంతో జనాలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి అసభ్యకరమైన సేవలు అందించాల్సిందిగా అడుగుతున్నారు. అందువల్ల కొన్ని రోజుల పాటు ఈ నంబర్‌ను నిలిపివేస్తున్నట్లు’ అధికారులు తెలిపారు. ప్రస్తుతం చైల్డ్‌హెల్ప్‌లైన్ కోసం వినియోగిస్తున్న 1098 నంబర్ స్థానంలో త్వరలోనే మరో కొత్త నంబర్ని తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు. అంతేకాక ఈ విషయం మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2016లో మహిళాశిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ చిన్నపిల్లల పట్ల లైంగిక నేరాలకు పాల్పడే వారికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి వీలుగా ‘ఇ - బాక్స్’ ప్రొగ్రామ్‌ని ప్రారంభించింది. అందులో భాగంగా ఈ చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకొచ్చారు. -
వార్డెన్ భర్తా.. మజాకా?!
⇒ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులపై అసభ్యకర ప్రవర్తన ⇒ భరించలేక హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు ⇒ అధికారుల విచారణలో వెలుగుచూసిన అరాచకం చందంపేట (దేవరకొండ): తండ్రి స్థానంలో ఉండాల్సిన ఆ వ్యక్తే విద్యార్థినుల పట్ల నిత్యం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టాడు.. అతను తమ వార్డెన్ భర్త కావడంతో చెప్పుకున్నా ప్రయోజనం ఉండదని భావించిన విద్యార్థినులు ఆలోచించి నేరుగా ఛైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.. దీంతో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.. నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండల కేంద్రంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో విజయరాణి వార్డెన్‌గా ఉన్నారు. 55 ఏళ్ల వయసున్న ఆమె భర్త రాజు కూడా హాస్టల్లోనే నివాసం ఉంటున్నాడు. అయితే విద్యార్థినుల పట్ల నిత్యం అసభ్యంగా ప్రవర్తించడం, రాత్రి వేళలో వారిని నిద్రలేప డం, వివిధ రకాలుగా మాటలతో మానసికంగా ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడు. అయితే దీనికి విసిగిపోయిన విద్యార్థినులు చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తమ బాధను వివరించారు. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసును దేవరకొండ పట్టణంలో ఉన్న గ్రామ్య స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు తెలియజేశారు. ఈ విషయమై గ్రామ్య నిర్వాహకులు ట్రైబల్ వెల్ఫేర్ పీడీకి విషయాన్ని తెలియజేశారు. ఈ మేరకు యంత్రాంగం కదలడంతో గ్రామ్య కోఆర్డినేటర్ రవి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి.వెంకటేశ్వర్‌నాయక్ పాఠశాలకు వెళ్లి అసలు విషయాన్ని ఆరా తీశారు. విడివిడిగా రాజు ప్రవర్తనపై విద్యార్థినులను అడగడంతో ఫిర్యాదులో వాస్తవం ఉందని గ్రహించారు. ఈ విషయమై పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా కొందరు అతని ప్రవర్తన పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వారు నేరెడుగొమ్ము పోలీసులకు కేసు వివరాలను తెలియజేసి అతడిపై ఫిర్యాదు చేశారు. -
నాకిప్పుడే పెళ్లొద్దు..!
బాల్య వివాహం ఓ సాంఘిక దురాచారం.. చట్టరీత్యా నేరం.. అయినా గ్రామాల్లో ఇప్పటికీ లోకం తెలియని వయసులోనే పెళ్లి పీటలెక్కుతున్న పుత్తడి బొమ్మ.. పూర్ణమ్మలు ఎందరో ఉన్నారు. సంప్రదాయాల మాటున తల్లిదండ్రులు లేత వయసులోనే ఆడబిడ్డల మెడలో మూడుముళ్లు వేయించి.. వారి బతుకులను ముళ్లబాటలోకి నెట్టేస్తున్నారు. ఈ దురాచారాన్ని ఎదుర్కొనే తెగువ ఎంతమందికుంటుంది!.. దానికి సమాధానంగా నేనున్నానంటూ ఓ బాలిక ముందు కొచ్చింది. తల్లిదండ్రుల ప్రయత్నాన్ని అడ్డుకోలేక.. సమాజానికి లేఖ రూపంలో తన అభిమతాన్ని వెల్లడించింది. ‘నాకిప్పుడే పెళ్లొద్దు.. చదువుకుంటాను’.. అంటూ నిక్కచ్చిగా చెప్పింది. ‘నాకు చదువుకోవాలని ఉంది సార్.. ఇంట్లో వాళ్లు చదువుకోవాలనే ఆలోచన రాకుండా చేస్తున్నారు. వచ్చే నెలలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. నన్ను ఇంట్లోనే బందీని చేశారు. నాకు పెళ్లి ఇష్టం లేదు. మీరే కదా సార్ చెప్పారు.. చదువుకొనే వాళ్లు జీవితంలో బాగుపడతారని, అందుకే నాకు చదువుకోవాలని ఉంది సార్.. అందుకే నా పెళ్లి ఆపండి.. లేకపోతే నాకు చావే మార్గం సార్. మా అన్నయ్య చదువుకోమని మొదట్లో ప్రోత్సహించేవాడు. ఇప్పుడేమో ఇంకోలా అంటున్నాడు.’.. ఇదీ ఓ బాలిక తన పాఠశాల ఉపాధ్యాయులకు రాసిన లేఖలోని సారాంశం. ఈ బాలిక స్వగ్రామం పొందూరు మండలంలోని మారుమూలన ఉన్న కోటిపల్లి. మజ్జిలిపేట అప్‌గ్రేడెడ్ యూపీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలికను మరో నెల రోజుల్లో మరో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కానుంది. ఫిబ్రవరి 22న ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ‘నాకు అప్పుడే పెళ్లేమిటి.. చదువుకుంటాను’ అంటూ తల్లిదండ్రుల వద్ద మొరపెట్టుకుంది. ప్రతిఘటించింది. ఆమె వేదన అరణ్యరోదనే అయ్యింది. ఇంట్లో దాదాపు బందీగా మారింది. దాంతో బాగా ఆలోచించింది. తన బతుకును తనే చక్కదిద్దుకోవాలని, అందుకు తన ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. తన గోడును వెల్లడిస్తూ పాఠశాల ఉపాధ్యాయుల పేరిట ఈ నెల 21న ఓ లేక రాసి నానా కష్టాలు పడి హెల్పింగ్ హ్యాండ్స్(శ్రీకాకుళం) సంస్థ ప్రతినిధులకు అందేలా చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు లేఖను బాలిక చదువుకుంటున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి శనివారం అందజేశారు. ఆయన ఈ విషయాన్ని విలేకరులకు వివరించగా.. వారు చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్ అయిన 1098కు సమాచారం అందించారు. దాంతో వారు రంగంలోకి దిగారు. స్థానిక ఐసీడీఎస్ ఏసీడీపీవో సంతోషికుమారి, శ్రీకాకుళం ఐసీడీఎస్ కౌన్సెలర్ సీతారాం, వైసీబీ చైల్డ్‌లైన్ ప్రతినిధి గన్నెప్పడులు మధ్యాహ్నం కోటిపల్లిలోని బాలిక ఇంటికి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని కౌన్సెలింగ్ చేశారు. ఆప్పుడే బాలికకు పెళ్లి చేయవద్దని హితవు చెప్పారు. 13 ఏళ్ల బాలికకు పెళ్లి చేయడం నేరమని కూడా హెచ్చరించారు. అయితే వారు ససేమిరా అన్నారు. పెళ్లి చేయడం తథ్యమని స్పష్టం చేయడంతో విషయాన్ని బాలికల సంక్షేమ సమితి(సీడబ్ల్యూసీ)కి నివేదిస్తామని అధికారులు చెప్పారు. బాలిక వివరాలను స్థానిక తహశీల్దార్ భువన్మోహన్కు అందజేశామని కూడా వారు చెప్పారు. - పొందూరు