నాకిప్పుడే పెళ్లొద్దు..!
బాల్య వివాహం ఓ సాంఘిక దురాచారం.. చట్టరీత్యా నేరం.. అయినా గ్రామాల్లో ఇప్పటికీ లోకం తెలియని వయసులోనే పెళ్లి పీటలెక్కుతున్న పుత్తడి బొమ్మ.. పూర్ణమ్మలు ఎందరో ఉన్నారు. సంప్రదాయాల మాటున తల్లిదండ్రులు లేత వయసులోనే ఆడబిడ్డల మెడలో మూడుముళ్లు వేయించి.. వారి బతుకులను ముళ్లబాటలోకి నెట్టేస్తున్నారు. ఈ దురాచారాన్ని ఎదుర్కొనే తెగువ ఎంతమందికుంటుంది!.. దానికి సమాధానంగా నేనున్నానంటూ ఓ బాలిక ముందు కొచ్చింది. తల్లిదండ్రుల ప్రయత్నాన్ని అడ్డుకోలేక.. సమాజానికి లేఖ రూపంలో తన అభిమతాన్ని వెల్లడించింది. ‘నాకిప్పుడే పెళ్లొద్దు.. చదువుకుంటాను’.. అంటూ నిక్కచ్చిగా చెప్పింది.
‘నాకు చదువుకోవాలని ఉంది సార్.. ఇంట్లో వాళ్లు చదువుకోవాలనే ఆలోచన రాకుండా చేస్తున్నారు. వచ్చే నెలలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. నన్ను ఇంట్లోనే బందీని చేశారు. నాకు పెళ్లి ఇష్టం లేదు. మీరే కదా సార్ చెప్పారు.. చదువుకొనే వాళ్లు జీవితంలో బాగుపడతారని, అందుకే నాకు చదువుకోవాలని ఉంది సార్.. అందుకే నా పెళ్లి ఆపండి.. లేకపోతే నాకు చావే మార్గం సార్. మా అన్నయ్య చదువుకోమని మొదట్లో ప్రోత్సహించేవాడు. ఇప్పుడేమో ఇంకోలా అంటున్నాడు.’.. ఇదీ ఓ బాలిక తన పాఠశాల ఉపాధ్యాయులకు రాసిన లేఖలోని సారాంశం. ఈ బాలిక స్వగ్రామం పొందూరు మండలంలోని మారుమూలన ఉన్న కోటిపల్లి. మజ్జిలిపేట అప్‌గ్రేడెడ్ యూపీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలికను మరో నెల రోజుల్లో మరో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కానుంది.
ఫిబ్రవరి 22న ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ‘నాకు అప్పుడే పెళ్లేమిటి.. చదువుకుంటాను’ అంటూ తల్లిదండ్రుల వద్ద మొరపెట్టుకుంది. ప్రతిఘటించింది. ఆమె వేదన అరణ్యరోదనే అయ్యింది. ఇంట్లో దాదాపు బందీగా మారింది. దాంతో బాగా ఆలోచించింది. తన బతుకును తనే చక్కదిద్దుకోవాలని, అందుకు తన ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. తన గోడును వెల్లడిస్తూ పాఠశాల ఉపాధ్యాయుల పేరిట ఈ నెల 21న ఓ లేక రాసి నానా కష్టాలు పడి హెల్పింగ్ హ్యాండ్స్(శ్రీకాకుళం) సంస్థ ప్రతినిధులకు అందేలా చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు లేఖను బాలిక చదువుకుంటున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి శనివారం అందజేశారు. ఆయన ఈ విషయాన్ని విలేకరులకు వివరించగా..
వారు చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్ అయిన 1098కు సమాచారం అందించారు. దాంతో వారు రంగంలోకి దిగారు. స్థానిక ఐసీడీఎస్ ఏసీడీపీవో సంతోషికుమారి, శ్రీకాకుళం ఐసీడీఎస్ కౌన్సెలర్ సీతారాం, వైసీబీ చైల్డ్‌లైన్ ప్రతినిధి గన్నెప్పడులు మధ్యాహ్నం కోటిపల్లిలోని బాలిక ఇంటికి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని కౌన్సెలింగ్ చేశారు. ఆప్పుడే బాలికకు పెళ్లి చేయవద్దని హితవు చెప్పారు. 13 ఏళ్ల బాలికకు పెళ్లి చేయడం నేరమని కూడా హెచ్చరించారు. అయితే వారు ససేమిరా అన్నారు. పెళ్లి చేయడం తథ్యమని స్పష్టం చేయడంతో విషయాన్ని బాలికల సంక్షేమ సమితి(సీడబ్ల్యూసీ)కి నివేదిస్తామని అధికారులు చెప్పారు. బాలిక వివరాలను స్థానిక తహశీల్దార్ భువన్‌మోహన్‌కు అందజేశామని కూడా వారు చెప్పారు.
- పొందూరు