child injured
-
రోడ్డు ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలు
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గం మండలం 75 వీరాపురం వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి వేరుశగన బస్తాలతో వెళుతున్న బొలేరో లగేజీ వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో కణేకల్లు మండలం మాల్యం గ్రామానికి చెందిన కురుబ అనంతమ్మ కుమారుడైన పది నెలల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వాస్పపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం బళ్లారి విమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్ఐ నారాయణ తెలిపారు. -
చిన్నారిపై వీధికుక్క దాడి
సంగం : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్కదాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన సంగం రాళ్లచెలికలో ఆదివారం జరిగింది. రాళ్లచెలికకు చెందిన వెంకటరమణమ్మ, రమణయ్య దంపతుల నాలుగేళ్ల బాలుడు చందు ఆదివారం ఉదయం ఇంటికి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా పిచ్చికుక్క చిన్నారిపై దాడి చేసింది. చందు పెద్దగా కేకలు వేయడంతో గమనించిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూసే సరికి కుడి కంటి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యశాలకు తరలించారు. అక్కడ చిన్నారికి వైద్యులు కుడికన్ను పైభాగంలో 12 కుట్లు వేయాల్సి వచ్చింది. -
గంజిపడి చిన్నారికి గాయాలు
కదిరి టౌన్ : ముక్కుపచ్చలారని ఓ చిన్నారి పొయ్యిపై ఉడికే అన్నం పాత్రను లాగటంతో, కాలే గంజి మీద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. నల్లమాడ మండలంలోని బొగ్గిటివారిపల్లికి చెందిన విజయకుమార్, సుకన్య దంపతులకు చెందిన ఏడాదిన్నర వయసున్న హేమంత్‌కుమార్ ఉన్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో చిన్నారి తల్లి వంట గదిలో వంట చేస్తోంది. చిన్నారి ఆడుకుంటూ పొయ్యి వద్దకు వెళ్లి, పొయ్యిపై వున్న అన్నం పాత్రను లాగి మీదకు వేసుకున్నాడు. దీంతో కాలుతున్న గంజి అన్నం పడి, ఛాతీ, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మంటకు బిగ్గరగా కేకలు పెట్టగా తల్లి సుకన్య పరుగున వచ్చి బిడ్డను అక్కున చేర్చుకొని వెంటనే 108 వాహనంలో వైద్యచికిత్సల నిమిత్తం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టరు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం ఆరోగ్యపరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యసేవల కోసం అనంతపురం పెద్దాసుపత్రికి తరలించారు. -
చిన్నారిని ఈడ్చుకెళ్లిన వీధికుక్కలు
చిలకలూరిపేట రూరల్: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న కలేషావలీ అనే ఐదేళ్ల బాలుడిపై బుధవారం సాయంత్రం నాలుగు వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుణ్ని సుమారు 30 అడుగుల దూరం ఈడ్చుకెళ్లగా, స్థానికులు చూసి వెంటపడడంతో వదిలేశాయి. ఈ ఘటనలో బాలుడి తలపై తీవ్ర గాయాలు కాగా, చేతులు, కాళ్లు, తొడ భాగంలో స్వల్ప గాయాలయ్యాయి. చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం బాలుణ్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.