ప్రత్యూషకు సాయమందించండి
హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురైన ప్రత్యూషకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనూరాధరావు డిమాండ్ చేశారు. టెలిఫోన్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రమేష్, అతని రెండో భార్య చాముండేశ్వరి అలియాస్ శ్యామలలు ప్రత్యూషను క్రూరంగా హింసించారని... ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యూష తండ్రి రమేష్‌ను వెంటనే అరెస్ట్ చేసి, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో ప్రత్యూషకు చికిత్స
పినతల్లి, తండ్రి వేధింపులు, నిర్బంధం కారణంగా తీవ్రంగా గాయపడిన ప్రత్యూషను చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం హాస్పిటల్లో అడ్మిట్ అయిన ప్రత్యూషను రీనల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యూషను బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు అచ్యుతరావు పరామర్శించి ఆమె ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.