ఫ్రూటీ తాగడంతో ఫుడ్‌పాయిజన్!
ముగ్గురు చిన్నారులకు తీవ్ర అస్వస్థత
వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలు
నగరంలోని కాలాపత్తర్‌లో ఘటన
హైదరాబాద్: శీతల పానీయం (ఫ్రూటీ) తాగిన కాసేపటికే ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన నగరంలోని కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్ తెలిపిన వివరాల ప్రకారం తాడ్బన్ ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అజీం, వహీదున్నీసా దంపతులకు ఆజం (4), ఫైజాన్ (3), అర్హన్ (1) సంతానం. రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి పాలు తప్ప ఆహారం తీసుకోని చిన్నారులను సాయంత్రం 6 గంటలకు అజీం సోదరి హసీనా బేగం ఇందిరానగర్‌లోని నిజాం కమ్యూనికేషన్ షాపుకు తీసుకెళ్లి మూడు ఫ్రూటీలు కొనిచ్చింది. అయితే వాటిని తాగిన 15 నిమిషాల్లోనే చిన్నారులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన కాలాపత్తర్‌లోని ఫర్హాన్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు ఫుడ్ పాయిజన్‌గా నిర్ధారించి మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించగా అబిడ్స్ బొగ్గులకుంటలోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. ఐసీయూకు తరలించి వైద్యులు చికిత్స అందించాక వారు కాస్త కోలుకోవడంతో జనరల్ వార్డుకు మార్చారు. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాలాపత్తర్ పోలీసులు... షాపులోని ఫ్రూటీలతోపాటు చిన్నారులు సేవించిన ఫ్రూటీలను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత ్తం నాచారంలోని ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీకి పంపించారు.
నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్రూటీ డబ్బాలపై తయారీ తేదీ 18-5-2016గా ముద్రించి ఉందని... దీనిని ఆరు నెలల వరకు వాడుకోవచ్చునని ముద్రించి ఉందన్నారు. షాపులో ఎండ తగిలే చోట ఫ్రూటీలను ఉంచడం, వాటినే తిరిగి చల్లదనం కోసం ఫ్రిజ్‌లో పెట్టి బయటకు తీయడం వల్ల ఫుడ్ ఫాయిజన్ జరిగి ఉండొచ్చని ఎస్సై అనుమానం వ్యక్తం చేశారు.