Children Care
-
చిన్నారులు బరువు పెరుగుతున్నారా? అయితే జాగ్రత్త!
మన దేశంలో అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన పిల్లలు రెండున్నర కిలోల నుంచి 3 కిలోల వరకు బరువుంటారు. పిల్లల బరువు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. తల్లిదండ్రుల జీన్స్, తల్లి ఆహారపు అలవాట్లు, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి వచ్చిన రుగ్మతలు, తల్లి బరువు వంటి అంశాలపై పిల్లల బరువు ఆధారపడి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఎక్కువ తేడా లేకుండా.. ఈ బరువుకు కాస్త అటు ఇటుగా ఉన్న పిల్లలూ ఆరోగ్యంగా పుట్టినట్టే. కొన్ని సూచనలతో చిన్నారులు ఆరోగ్యంగా బరువు పెరుగుతున్నారో లేదో తెలుసుకోవచ్చు. పిల్లలు పుట్టాక మొదటి వారంలో– పుట్టినప్పుడు ఉన్న బరువు కంటే మొదట్లో కాస్త తగ్గుతారు. నిర్దిష్టంగా చెప్పాలంటే మొదటి వారం పదిరోజుల్లో పుట్టిననాటి బరువులో 5 శాతం నుంచి 10 శాతం బరువు తగ్గుతారు. ఇక రెండోవారం నుంచి క్రమేణా బరువు పెరుగుతూపోతారు. మొదటి మూడు నెలల్లో దాదాపు రోజుకు 20 నుంచి 30 గ్రాములు పెరుగుతూ పోతే... మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రోజుకు 10 నుంచి 15 గ్రాముల వరకు పిల్లలు బరువు పెరుగుతారు. ఇలా చూస్తే మొదటి ఐదునెలల్లో పుట్టినప్పటికంటే రెట్టింపు (డబుల్) బరువు, ఏడాదికి మూడు రెట్ల (ట్రిపుల్) బరువు పెరగాలి. కానీ పాపలందరూ ఇలాగే పెరగాలని లేదు. కాస్త అటు ఇటుగా ఉన్నా అది ఆరోగ్యకరమైన బరువే. అయితే ఈ లెక్కకు దూరంగా ఉంటే మాత్రం తగినంత బరువు పెరగడం లేదని అర్థం చేసుకోవాలి. తల్లి నుంచి రెండు రకాల పాలు.. బిడ్డ పాలు తాగేప్పుడు తల్లి నుంచి రెండు రకాల పాలు వస్తాయి. మొదట వచ్చే పాలను ఫోర్ మిల్క్ అంటారు. రెండోసారి పాలను హైండ్ మిల్క్‌గా పేర్కొంటారు. అంటే ఈ హైండ్ మిల్క్ పాప కాసిన్ని పాలు తాగాక వస్తాయి. నిజానికి ఫోర్ మిల్క్ కంటే.. హైండ్ మిల్క్ చాలా బలవర్ధకమైనవి. బరువు పెరగడానికి ఇవే ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫోర్ మిల్క్‌ను ప్రసవం కాగానే స్రవించే ముర్రుపాలతో ΄÷రబాటు పడవద్దు. ముర్రుపాలు వేరు, ఫోర్ మిల్క్ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు శిశువుకు చాలా మంచివి. రోగనిరోధకతను ఇస్తాయి. ఫోర్ మిల్క్ అంటే... పాలు పట్టడం మొదలు పెట్టగానే మొదట స్రవిస్తాయి. ఓ పది–పదిహేను గుటకల తర్వాత హైండ్ మిల్క్ స్రవిస్తాయి. తగినంత బరువు పెరగడం లేదంటే.. తల్లి పాలు సరిపోక పోవడం లేదా బిడ్డ సరిగా తాగకపోవడం, బిడ్డ పూర్తిగా తాగకుండా మధ్యలోనే నిద్రపోవడం, పాలు తాగకపోవడానికి కొన్నిసార్లు తల్లి వైపునుంచి, మరికొన్నిసార్లు బిడ్డ వైపు నుంచి కూడా కారణాలు ఉండవచ్చు. తల్లి బిడ్డకు పాలు సరిగా పట్టకపోవడం జరగవచ్చు. పాలు పడుతున్నప్పుడు చిన్నారి దృష్టి పాల నుంచి పక్కకు మళ్లవచ్చు. పాలపీక అలవాటు చేయడం వల్ల చిన్నారులు పాలు సరిగా తాగరు. ఎనీమియా, యూరినరీ ఇన్ఫెక్షన్స్, చెవిలో ఇన్ఫెక్షన్స్, అలర్జీల వంటిఆరోగ్యపరమైన సమస్య ఉన్నా బరువు పెరగకపోవచ్చు. బరువు పెరగడానికి.. రెండు మూడు గంటలకు ఓమారు పాలు పట్టించాలి. ∙ఓ రొమ్ము పట్టించాక ఆ రొమ్ము నుంచి పాలు పూర్తిగా తాగిందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. ఇందుకు చేయాల్సింది... బిడ్డ పూర్తిగా పాలు తాగాక చిన్నారికి అదే రొమ్మును అందిస్తే ముఖం తిప్పుకోవడం, రొమ్ము అందుకోకపోవడం చేస్తుంది. ఓ రొమ్ములోని పాలు పూర్తిగా పట్టించాక రెండో రొమ్ము కూడా అందించాలి. అప్పుడు ఆ రెండో రొమ్ము పాలు తాగకపోయినా– బిడ్డ సంతృప్తిగా ఉంటే పూర్తిగా పాలు తాగినట్లే. బిడ్డకు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోడానికి రోజులో ఎన్నిసార్లు పక్క తడుపుతోందన్న అంశం కూడా ఓ సూచన. పాప పగటిపూట కనీసం నాలుగయిదుసార్లు పక్క తడుపుతుంటే.. పాలు సరిపోతున్నాయని అనుకోవచ్చు. చికిత్స ఎప్పుడంటే..? పైన పేర్కొన్న అంశాలను జాగ్రత్తగా గమనిస్తూ, పాప బరువును ప్రతివారం పరీక్షిస్తూ ఉండాలి. అప్పటికీ బిడ్డ బరువు వయసుకు తగి నంతగా పెరగడం లేదంటే... ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో వైద్యపరీక్షల ద్వారా తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. — డా. శివనారాయణరెడ్డి వెన్నపూస, నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రిస్ట్ ఇవి చదవండి: చల్లచల్లని కూల్ కూల్ -
పిల్లలు ఆడుతూ పాడుతూ ఇంటి పనులు చేసేలా నేర్పించండిలా!
‘కోటి విద్యలు కూటి కోసమే’ అని లోకోక్తి. కానీ, ‘కూటి విద్యను నేర్చుకున్నాకే కోటి విద్యలూ’ అనేది ఈతరం సూక్తి. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. అందుకు స్వయంపాకమైతే దీ బెస్ట్ అనే సలహా ఇస్తారు ఆరోగ్య స్పృహ కలిగినవాళ్లెవరైనా! చదువు, కొలువుల కోసం ఉన్న ఊరును వదిలి.. పరాయి చోటుకు పయనమయిన.. అవుతున్న వారంతా ఆ సలహాకే పోపేస్తున్నారు. ఎసట్లో నాలుగు గింజలు ఉడికించుకుంటున్నారు. వర్కింగ్ పేరెంట్స్ ఉన్న పిల్లలకూ ఇది అవసరంగా మారుతోంది. పిల్లల చేతికి గరిటెనందిస్తోంది. రకరకాల వంటకాలను నేర్చుకునేందుకు ప్రేరేపిస్తోంది. అలా పిల్లలు ఆడుతూ పాడుతూ వండుకునే మెనూస్నీ.. వంటింటి చిట్కాలనూ తెలుసుకుందాం! వంట చేయడం ఓ కళైతే.. దాన్ని వారసత్వంగా పిల్లలకు అందించడం అంతకు మించిన కళ. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను యుక్తవయస్సు దాటేవరకు వంట గదివైపే రానివ్వరు. కానీ.. ఏ విద్యలోనైనా అనుభవజ్ఞులు నేర్పించే పాఠం కంటే అనుభవం నేర్పించే పాఠం ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే చిన్న వయసు నుంచి పిల్లల్ని వంట పనుల్లో, ఇంటిపనుల్లో భాగం చేయడం అవసరం. సలాడ్స్ చేయడం.. రెసిపీలు కలపడం వంటి చిన్న చిన్న పనులతో పాటు.. ఏ కూరగాయ ఎలా ఉడుకుతుంది? ఏ బియ్యాన్ని ఎంతసేపు నానబెట్టాలి? ఏ వంటకానికి ఎలా పోపు పెట్టాలి? వంటి వాటిపై అవగాహన కల్పించాలి. సాధారణంగా వంటింట.. పదునైన కత్తులు, బ్లేడ్లు, ఫ్లేమ్స్.. వేడి నూనెలు, నెయ్యి ఇలా చాలానే ఉంటాయి. అందుకే పిల్లల్ని ఆ దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటారు పేరెంట్స్. నిజానికి వంటగదిలోకి రానివ్వకుండా ఆపడం కంటే.. పర్యవేక్షణలో అన్నీ నేర్పించడమే మేలు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతివాళ్లకూ ఏదో ఒకరోజు తమ వంట తామే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కత్తి తెగుతుందని, నిప్పు కాలుతుందనే విషయం తెలిసే వయసులోనే పిల్లలు ఉప్పుకారాల మోతాదులు అర్థంచేసుకుంటే మంచిది అంటున్నారు కొందరు పెద్దలు. దీనివల్ల సెల్ఫ్డింపెడెన్సే కాదు.. జెండర్ స్పృహా కలుగుతుందని అది అత్యంత అవసరమనీ పెద్దల అభిప్రాయం. అందుకే పాఠ్యాంశాలతోపాటు పాకశాస్త్రాన్నీ సిలబస్‌లో చేర్చాలని.. ఒకవేళ సిలబస్‌లో చేర్చలేకపోయినా హోమ్‌వర్క్‌లో మస్ట్‌గా భాగం చెయ్యాలని అనుభవజ్ఞుల సూచన. ఎందుకంటే..? ► వంట పనుల్లో భాగం అయినప్పుడు పిల్లలకు అది ఒక ప్రాక్టికల్ శిక్షణలా ఉపయోగపడుతుంది. గణితం, సైన్స్ నేర్చుకోవడానికి.. ఒక మార్గం అవుతుంది. ఎలా అంటే.. కొలతలు, వినియోగం వంటి విషయాల్లో ఓ లెక్క తెలుస్తుంది. అలాగే నూనె, నీళ్లు ఇలా ఏ రెండు పదార్థాలను కలపకూడదు? ఏ రెండు పదార్థాలు కలపాలి? అనే విషయం వారికి అర్థమవుతూంటుంది. ► చిన్న వయసులోనే వంట నేర్చుకోవడంతో.. ఓర్పు నేర్పు అలవడుతాయి. శుచీశుభ్రత తెలిసొస్తుంది. అలాగే ప్రిపరేషన్, ప్రికాషన్స్ వంటివాటిపై క్లారిటీ వస్తుంది ► బాల్యంలోనే రెసిపీల మీద ఓ ఐడియా ఉండటంతో.. ఒక వయసు వచ్చేసరికి వంట మీద పూర్తి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ► తక్కువ సమయంలో ఏ వంట చేసుకోవచ్చు.. ఎక్కువ సమయంలో ఏ కూర వండుకోవచ్చు వంటివే కాదు.. కడుపు నొప్పి, పంటినొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు చిట్కాలూ తెలుస్తాయి. ► రెసిపీలు విఫలమైతే పిల్లలు.. విమర్శలను సైతం ఎదుర్కోవడం నేర్చుకుంటారు. వైఫల్యం జీవితంలో సర్వసాధారణమని బోధపడుతుంది. గెలుపోటములను సమంగా తీసుకునే మనోనిబ్బరాన్ని అలవరుస్తుంది. ► స్కూల్లో, బంధువుల ఇళ్లల్లో.. ఇతరులతో కలిసేందుకు ఈ ప్రయోగాలన్నీ పిల్లలకు ప్రోత్సాహకాలవుతాయి. అలాగే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. వంట నేర్చుకోబోయే పిల్లల్ని.. వయసు ఆధారంగా చేసుకుని.. నాలుగు రకాలుగా విభజించుకుంటే.. వంట నేర్పించడం చాలా తేలిక అంటున్నారు నిపుణులు. 3 – 5 ఏళ్ల లోపున్న పిల్లలు మొదటి కేటగిరీకి చెందితే.. 5 – 7 ఏళ్లలోపు పిల్లలు రెండో కేటగిరీలోకి వస్తారు. ఇక 8 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు మూడో కేటగిరీలోకి, 13 ఏళ్ల తర్వాత పిల్లలంతా నాలుగో కేటగిరీలోకి వస్తారు. మొదటి రెండు కేటగిరీల్లో పిల్లలకు చిన్న చిన్న పనులు అలవాటు చేస్తే.. ఎదిగే కొద్దీ వాళ్లలో నైపుణ్యం పెరుగుతుంది. సాధారణంగా మూడు నుంచి ఐదు ఏళ్లలోపు పిల్లల్లో.. పెద్దలు చేసే ప్రతి పనినీ తామూ చేయాలని.. పెద్దల మెప్పు పొందాలనే కుతూహలం కనిపిస్తూంటుంది. వంటగదిలో కొత్త పనిని ప్రయత్నించడానికి ఉత్సాహంగా ఉంటారు. అయితే వారికి చేతుల్లో ఇంకా పట్టు.. పూర్తి అవగాహన ఉండవు కాబట్టి.. అలాంటి పిల్లలకు చిన్నచిన్న పనులను మాత్రమే చెప్పాలి. వారికి నెమ్మదిగా అలవాటు చేయడానికి వీలుండే పనులను, పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేని వాటిని వారి చేతుల్లో పెట్టొచ్చు. ఎక్కువగా కూర్చుని చేసే పనులను వారికి అప్పగించాలి. చేయించదగిన పనులు.. - పండ్లు, కూరగాయలు కడిగించడం, చపాతీ పిండి కలపడంలో సాయం తీసుకోవడం. - పాలకూర వంటివి కడిగి.. తురుములా తెంపించడం. - బనానా వంటివి గుజ్జులా చేయించడం.(ఆ గుజ్జు బ్రెడ్, ఐస్‌క్రీమ్ వంటివి తయారుచేసుకోవడానికి యూజ్ అవుతుంది) ఐదేళ్లు దాటేసరికి.. పిల్లల్లో మోటార్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. అంటే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఏ పనిలోనైనా ఫర్ఫెక్ట్‌నెస్ పెరుగుతూంటుంది. అలాంటివారికి ఆహారాన్ని సిద్ధం చేయడంలో మెలకువలు నేర్పించొచ్చు. అప్పుడప్పుడే చదవడం, రాయడం ప్రారంభిస్తుంటారు కాబట్టి.. వారికి వంటకాలను పరిచయం చేయడానికి ఈ వయసే మంచి సమయం. వంటలో వాళ్లు మనకు సహాయపడగలిగే సులభమైన రెసిపీలను చెబుతుండాలి. వారు ఉపయోగించగలిగే చాప్ బోర్డ్స్, ఇతరత్రా చిన్నచిన్న కిచెన్ గాడ్జెట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. చేయించదగిన పనులు.. - పొడి పదార్థాలను నీళ్లు పోసి కలపడం - ఇన్‌గ్రీడియెంట్స్‌ని కొలవడం, లేదా లెక్కించడం ∙డైనింగ్ టేబుల్ని సర్దించడం - గుడ్లు పగలగొట్టించడం (పెంకుల విషయంలో కాస్త దగ్గరుండాలి) - పిండి వంటల్లో కానీ.. స్నాక్స్‌లో కానీ ఉండలు చేసే పనిని వారికి అప్పగించడం - మృదువైన పండ్లు, కూరగాయలను కట్ చేయించడం - రెసిపీని పెద్దగా రెండు మూడు సార్లు చెప్పించడం.. ఖాళీ సమయాల్లో ఒకటికి రెండు సార్లు ఆ వివరాలను గుర్తుచేయడం - చిన్న చిన్న చపాతీలు చేయించడం ఎనిమిదేళ్ల నుంచి పన్నెండేళ్ల లోపు పిల్లల్లో స్వతంత్ర ఆలోచనలు పెరుగుతుంటాయి. తమ పనులను తాము చేసుకుంటూంటారు. ఈ వయసు వచ్చేసరికి వంట గదిలో వారికి ఎక్కువ పర్యవేక్షణ అవసరం ఉండదు. సొంతంగా ఎవరి సాయం లేకుండానే వీరు చిన్నచిన్న ఫుడ్ ఐటమ్స్ సిద్ధం చేయగలరు. తిన్న ప్లేట్ లేదా బౌల్ కడిగిపెట్టడం, లంచ్ బాక్స్ సర్దుకోవడం, కిరాణా సామాన్లు జాగ్రత్త చేయడం వంటివన్నీ వాళ్లకు అలవాటు చేస్తూండాలి. చేయదగిన పనులు.. - కూరగాయలు లేదా పండ్ల తొక్క తీసుకుని, కట్ చేసుకుని సలాడ్స్ చేసుకోవడం - శాండ్విచెస్, బ్రెడ్ టోస్ట్‌లు చేసుకోవడం, ఆమ్లెట్స్ వేసుకోవడం - జ్యూసులు తీసుకోవడం ∙మరమరాలు, అటుకులతో పిడత కింద పప్పు, పోహా వంటివి చేసుకోవడం, ఇన్‌స్టంట్‌గా తీపి లేదా కారం రెసిపీలు చేసుకోవడం చిన్నప్పటి నుంచి కుకింగ్ మీద అవగాహన ఉన్నవారికి.. సుమారు 13 ఏళ్లు వచ్చేసరికి కిచెన్‌లోని ప్రతి వస్తువును ఎలా వాడాలి? ఏది ఎప్పుడు వాడాలి? అనేది తెలుస్తూంటుంది. వీరిలో తగు జాగ్రత్తే కాదు చక్కటి నైపుణ్యమూ ఉంటుంది. ఇప్పటి తరానికి స్మార్ట్ గాడ్జెట్స్ పైన బీభత్సమైన కమాండ్ ఉంది. కాబట్టి ఓవెన్‌ని ఉపయోగించడం, ఇండక్షన్ స్టవ్ వాడటం వంటివి వీరికి ఈజీ అవుతాయి. చేయదగిన పనులు.. - గ్యాస్ స్టవ్‌పై ఆమ్లెట్స్ వేసుకోవడం - ఎలక్ట్రిక్ కుకర్‌లో జొన్నకండెలు, చిలగడ దుంపలు, గుడ్లు వంటివి ఉడికించుకోవడం - పదునైన కత్తులు జాగ్రత్తగా వాడటం - పెద్దల సమక్షంలో బ్లెండర్, ఫుడ్ ప్రాసెసర్, గార్లిక్ ప్రెస్, కాఫీ మేకర్, వాఫిల్ మేకర్ వంటి వివిధ కిచెన్ గాడ్జెట్ల వాడకాన్ని నేర్చుకోవడం, మైక్రోవేవ్‌పై పూర్తి అవగాహన తెచ్చుకోవడం, ఐస్‌క్రీమ్ వంటివి సిద్ధం చేసుకోవడం - కిచెన్ క్లీనింగ్ నేర్చుకోవడం వంటి విషయాలపై శ్రద్ధ కల్పించాలి. (చదవండి: పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
చిన్నారులపై లైంగిక వేధింపులు.. తీవ్రమైన సమస్య: సీజేఐ
న్యూఢిల్లీ: చిన్నారులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం(పోక్సో)పై ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ ప్రసంగించారు. ‘ పిల్లలపై లైంగిక అకృత్యాల అంశం సమాజంలో పెనుసమస్యగా తయారైంది. చిన్నారి లైంగిక హింసకు గురైనప్పుడు ఆ విషయాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా బాధిత కుటుంబం మౌనంగా ఉంటున్న సందర్భాలే ఎక్కువ. ఈ సంస్కృతి మారాలి. నిందితుడు సొంత కుటుంబసభ్యుడైనా సరే ఫిర్యాదు చేసేలా బాధిత కుటుంబాల్లో ధైర్యం, చైతన్యం, అవగాహన పెరగాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు రావాలి. బాధిత చిన్నారుల వేదన వెంటనే తీర్చలేని స్థితిలో, తక్షణ న్యాయం చేకూర్చలేని స్థితిలో మన నేర శిక్షాస్మృతి ఉందనేది వాస్తవం. ఆ చిన్నారులకు సత్వర న్యాయం సాధ్యపడాలన్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేయాలన్నా న్యాయవ్యవస్థతో కార్యనిర్వాహక వ్యవస్థలు చేతులు కలిపాల్సిందే. చిన్నారులు లైంగిక వేధింపుల బారిన పడకుండా ముందుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అత్యంత ముఖ్యం. పిల్లలను ఎవరైనా తాకినప్పుడు అందులో తప్పుడు ఉద్దేశం ఉందా లేదా అనేది కనిపెట్టే ‘తెలివి’ని పిల్లలకు బోధించాలి. లైంగిక వేధింపుల బారిన పడిన చిన్నారుల తల్లిదండ్రులు.. కుటుంబపరువు పోతుందని మౌనంగా ఉంటున్నారు. ఇలా మౌనంవహిస్తే బాధిత చిన్నారి వర్ణనాతీత వేదన తీరేదెలా? చిన్నారికి న్యాయం దక్కేదెలా ? ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే స్థాయికి వారిలో ధైర్యం, అవగాహన పెంచాలి. ఇది రాష్ట్రాలు, సమాజంలో సంబంధిత వర్గాల సమిష్టి బాధ్యత’ అని అన్నారు. ‘ కొన్ని రకాల కేసులు న్యాయస్థానాల్లో చూస్తుంటాం. మైనర్లు సమ్మతితో లైంగిక చర్యకు పాల్పడినా.. పోక్సో చట్టంలోని 18 ఏళ్లలోపు వయసు పరిమితి కారణంగా అది నేరమే. 16 ఏళ్లు.. 18 ఏళ్లు.. అనే దానిపై ఎలా తీర్పు ఇవ్వాలనే అంశంలో జడ్జీలు ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేని పరిస్థితి ప్రతిరోజూ ఎన్నో కోర్టుల్లో తలెత్తుతోంది. దీనికి పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా ప్రభుత్వమే సమస్యకు పరిష్కారం కనుగొనాలి’ అని ఆయన అన్నారు. ఇదీ చదవండి: విహారయాత్రలో విషాదం: అనంతపురానికి చెందిన ఫ్యామిలీ మృతి -
Cyber Talk: పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? డిజిటల్ రాక్షసులుగా మారకుండా..
Cyber Security Tips In Telugu: దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారిని వివిధ రూపాలలో కొలుస్తుంటాం. ఈ పూజలన్నీ మనచుట్టూ, మనలోనూ ఉన్న చెడును సంహరించి, జీవితాలను బాధ్యతగా మలచుకోమని సూచన ఇస్తున్నట్టుగా ఉంటాయి. ఇదే విషయాన్ని టెక్నాలజీ విషయంలో తీసుకుంటే... పిల్లలు డిజిటల్ రాక్షసులుగా మారకుండా, అలాంటి రాక్షసుల నుంచి ఎలా కాపాడుకోవాలో ఇంట్లో అమ్మలూ, స్కూల్లో టీచర్లూ పిల్లలకు సూచనలు ఇస్తే .. ఎన్నో సమస్యలకు అడ్డుకట్ట వేయచ్చు. ఐఫోన్లు, ఆండ్రాయిడ్లు రాకముందు, స్మార్ట్ఫోన్లపై అంతగా చర్చ లేదు. పాఠశాలల్లో సాంకేతికత అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణమైపోయింది. ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ విద్యార్థుల డేటాను సురక్షితంగా ఉంచడానికి, డిజిటల్ టెక్నాలజీతో వారి సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయాలో, తమను తాము రక్షించుకోవడం ఎలాగో నేర్పడానికి ఉపాధ్యాయులూ సిద్ధంగా ఉండాలి. ప్రమాదాలు పలు విధాలు... స్కూల్లో... (ఎ) సైబర్–సేఫ్ క్లాస్‌రూమ్‌ని ఏర్పాటు చేయాలి, విద్యార్థుల ప్రైవేట్ డేటాను రక్షించడంలో ఫస్ట్ లెవల్ రక్షణ వ్యూహాలను కలిగి ఉండాలి (బి) విద్యార్థులకు ఆన్ లైన్ గోప్యత భద్రతలో తీసుకోవాల్సిన ప్రాథమికాంశాలను బోధించాలి (సి) తరగతిలో, ఇంట్లో టెక్నాలజీని వాడటం ప్రయోజనకరంగా ఉండాలే తప్ప, అన్నింటిని దూరం చేసేలా ఉండకూడదు. (డి) టెక్నాలజీని మితిమీరి ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి, అది సంబంధాలు, భవిష్యత్తు కెరీర్లు, వ్యక్తిగత జీవితాలను ఎలా దెబ్బతీస్తుందో తెలియజేయాలి టీచర్లు పిల్లల తల్లిదండ్రుల అంగీకార పత్రాన్ని తీసుకోవాలి మీ పిల్లలకు ఏదైనా ఇబ్బంది కలిగించే విషయం ఇంటర్నెట్లో కనిపిస్తే ఏమి చేయాలో వారితో మాట్లాడాలి. మీరు వారితో కలివిడిగా లేకపోతే, మీరు వారి సమీపంలోకి వెళ్లినప్పుడు వారు ల్యాప్‌టాప్ మూసివేస్తారు లేదా స్క్రీన్‌ను ఆఫ్ చేస్తారు. టీచర్లు తమ పిల్లలకు ఎంత స్క్రీన్ సమయం సరిపోతుందో పరిశీలించడానికి తల్లిదండ్రులతో తప్పనిసరిగా ఇంటరాక్ట్ కావాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు తెలిసుండాలి. అవి.. అన్ని అప్లికేషన్లు, గేమింగ్, బ్రౌజర్లు లోపలే కొన్ని నియంత్రణలను కలిగి ఉంటాయి, ఇవి మీ పిల్లలు ఆన్లైన్లో గడిపే సమయాన్ని పరిమితం చేయడానికి, పెద్దలు వాడే టెక్నాలజీలో పిల్లల జోక్యం పరిమితంగా ఉండాలి. అలాగే, పిల్లలు ఉపయోగించే షాపింగ్, చాటింగ్ వంటి ఫంక్షన్లను స్విచ్ ఆఫ్ చేయడానికి మీకు యాక్సెస్ ఉండాలి. అన్ని అప్లికేషన్లు, గేమింగ్, ఈ కామర్స్ సైట్లు తమ వినియోగదారులకు షాపింగ్, అదనపు పాయింట్లను కొనుగోలు చేయడం, ఇతర అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. పిల్లలు పెద్దలకు తెలియకుండానే సులభంగా కొనుగోళ్లు చేయవచ్చు. అందుకని, యాప్ కొనుగోళ్లను ఆపేయాలి. పిల్లలకు ఆన్లైన్ ప్రమాదాల గురించి తెలియదు. మీరు రోజులో కొంత సమయాన్ని పిల్లలతో గడుపుతారు కాబట్టి, ఆ సమయం లో భవిష్యత్తులో కెరీర్‌ను ప్రభావితం చేసే సైబర్ బెదిరింపు, గోప్యత, ఆన్లైన్ పరువు గురించి తెలియజేయాలి. ఆన్లైన్లో కొత్త గేమ్‌లు, వెబ్సైట్లకు సైన్ అప్ చేసేటప్పుడు మీ పిల్లలు ఉపయోగించగల సాధారణ ఇ మెయిల్ చిరునామాను సెటప్ చేయండి. (అనగా కుటుంబ సభ్యులందరికీ వారి ఇ మెయిల్ యూజర్‌నేమ్, పాస్వర్డ్ తెలుసుండాలి) మీ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ‘గూగుల్ సేఫ్ సెర్చ్’ని యాక్టివేట్ చేయడం ద్వారా సెర్చ్ ప్రశ్నలకు ప్రతిస్పందనగా అనుచితమైన కంటెంట్‌ను వదిలించుకోవడానికి లేదా పిల్లల కోసం https://www.kiddle.co వంటి సెర్చ్ ఇంజిన్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించండి. యాంటీ ర్యాగింగ్, జెండర్ ఈక్వాలిటీ కౌన్సిల్ మాదిరిగానే ఈ రోజుల్లో డిజిటల్ వెల్బీయింగ్ కౌన్సిల్ తప్పనిసరి. ఈ కౌన్సిల్ పిల్లలకు మంచి డిజిటల్ పరిశుభ్రత, సైబర్ నైతికతను పెంపొందించడానికి సహాయపడుతుంది. తరాలు మారాయి. కొత్త కొత్త సాంకేతికత రూపుకడుతోంది. పిల్లల ఆలోచనా ధోరణి మారుతోంది. అవగాహనారాహిత్యంతో ఉన్న పిల్లల ఎదుగుదలను సరి చేయకపోతే భవిష్యత్తు సమాజం సమస్యాత్మకంగా మారనున్నది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే పెద్దలే జాగ్రత్త వహించాలి. పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తారు... దాదాపుగా ప్రీ–టీన్స్, టీనేజ్ పిల్లల రోజువారీ జీవితంలో ఇంటర్నెట్ భాగమైపోయింది. చాలా మంది యుక్త వయస్కులు స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌ని ఉపయోగిస్తారు. ఇంచుమించు అందరికీ ఇంటర్నెట్ ఉంటుంది. అనేక రకాల సోషల్ నెట్వర్కింగ్, గేమింగ్ సైట్లను ఉపయోగిస్తున్నారు. పిల్లలు ఇతరుల రహస్యాలను బయటపెట్టడం, లింక్ అప్లు, హుక్ అప్లు, ద్వేషం.. సర్వసాధారణం. వీరిలో మరొక చీకటి కోణం కూడా గమనించాలి. సాధారణంగా సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో కన్ఫెషన్ పేజీలు పెద్దవాళ్లు క్రియేట్ చేసినవి ఉంటాయి. దీనిని ఇప్పుడు పిల్లలు టీచర్లు, హెడ్మాస్టర్లపై ప్రేమ, సరస వ్యాఖ్యలను చేయడం చూస్తుంటే వారి భవిష్యత్తుపై ఆందోళన కలుగుతుంది. అందుకని, టీచర్లు – తల్లిదండ్రులు ఈ విషయాలపై మాట్లాడుకొని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ వారి పిల్లల భవిష్యత్తు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో టీచర్లు తెలియజేయాలి. సమాచారం : (ఎ) పిల్లలు వాడే కమ్యూనికేషన్ సాధనాలేమున్నాయి, వాటి సమాచారాన్ని తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాలి. (బి) మూలాన్ని తనిఖీ చేయాలి. (సి) ఇన్ఫర్మేషన్ నుంచి చెక్ చేయాలి (డి) సమాచారాన్ని ధ్రువీకరించాలి. (ఇ) సమాచారాన్ని నమ్మాలి. (ఎఫ్) సమాచారాన్ని పంచుకోవాలి. ప్రభావం : తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాలి (ఎ) మీ పిల్లల డిజిటల్ కార్యకలాపాలు వారికి మంచి లేదా చెడుగా ఎలా అనిపిస్తాయి. (బి) బ్యాలెన్స్, క్రాస్ చెక్ ఉందా... అని చూడాలి. సూచన: వీటన్నింటి చివరలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన పాఠం మీ సొసైటీలో సాంకేతికంగా సురక్షితంగా ఉండాలంటే .. పిల్లలు ఇతరుల నుండి ఏ సూచనలను తీసుకుంటున్నారు, ఎవరు సూచనలు ఇస్తున్నారు... అనేది తెలుసుకుని జాగ్రత్త పడాలి. ఏమరపాటుగా ఉంటే అది ప్రతి ఒక్కరి భద్రతకు భంగం కలిగించవచ్చు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime Prevention Tips: జాబ్ కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త.. లింక్డ్ ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో.. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. న్యూడ్ వీడియోలతో ఎర.. టీనేజర్లే టార్గెట్ -
Parenting Tips: మీ మైండ్‌లో ఆంక్షల బుక్ ఉందా?!
పిల్లలు నేను చెప్పిందే వినాలి. నేను గీచిన గీత ఎట్టిపరిస్థితుల్లో దాటడానికి వీల్లేదు. అప్పుడే పిల్లలు పద్ధతిగా పెరుగుతారు. అదే క్రమశిక్షణ అంటే.. అని మీరు భావిస్తున్నారా?! అయితే, ఈ తరహా పెద్దల ప్రవర్తన పిల్లల మానసిక ఎదుగుదలకు అడ్డంకి అవుతుందని మనస్తత్త్వ నిపుణులూ, పరిశోధకులు చెబుతున్నారు. పిల్లల్ని అతిగా రూల్ చేసే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది అంటున్నారు ఎడిన్బర్గ్ యూనివర్శిటీ పరిశోధకులు. యుకెలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం ప్రతి రెండేళ్లకు ఒకసారి పుట్టిననాటి నుండి 17 సంవత్సరాల వయసు పిల్లల డేటాను సేకరిస్తుంది. ఈ సేకరణలో భాగంగా పిల్లల తల్లిదండ్రుల పెంపకంపైన దృష్టి పెడుతుంది. ఈ రెండేళ్లలో పిల్లలపై అరవడం, కొట్టడం, తిట్టడం, అతిగా రూల్స్ పెట్టే తల్లిదండ్రుల మానసిక స్థితిని అధ్యయనం చేశారు. ఇంట్లో అతిగా ఆంక్షల్లో ఉన్న పిల్లలు బయట చాలా విరుద్ధ ప్రవర్తనతో మెలుగుతున్నట్టు తెలుసుకున్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులు సామాజికపరంగా, భావోద్వేగపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారనీ గమనించారు. ఈ పరిశోధన చైల్డ్ డెవలప్మెంట్ జర్నల్‌లో ప్రచురించారు. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్లో భావోద్వేగ ప్రవర్తనల్లో చోటు చేసుకున్న విపరీత మార్పులకు వారి తల్లిదండ్రులు పాటించే కఠినమైన పద్ధతులే కారణం అని గమనించారు. కొట్టడం, అరవడం, తాము చెప్పిందే వినాలనే పంతం గల తల్లిదండ్రుల వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపైనా హానికరమైన ప్రభావాలను చూపుతాయని తెలుసుకున్నారు. ప్రసూతి సమయంలో, కుటుంబ సమస్యల్లోని ఒత్తిడి వల్ల కూడా తల్లుల్లో పిల్లలపై ‘విసుగు’కు కారణం అవ్వచ్చని రాశారు. మూడు రకాల పెంపకం ‘పిల్లల విపరీత ప్రవర్తన మనకు హైపర్యాక్టివిటీగా అనిపిస్తుంది. అయితే, కొన్ని లక్షణాలు పుట్టుకతో వచ్చినా కొన్నింటిపై ఇంటి వాతావరణమే ప్రభావం చూపుతుంది’ అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్ గీతా చల్ల. పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేసే తల్లిదండ్రులు ఉంటారు. ఇలాంటి వారు కొంచెం మొండితనంతో ప్రవర్తించే అవకాశం ఉంది. కొందరు తల్లిదండ్రులు అతిగా ఆంక్షలు పెడతారు. వీరి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నా, బయటకు వచ్చినప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తారు. కొందరు తల్లిదండ్రులు పెంపకంలో సమతుల్యత పాటిస్తారు. స్వేచ్ఛ ఇస్తారు, కానీ పరిధులు నిర్ణయిస్తారు. రూల్ బుక్ పేరెంటింగ్ ‘నేను చెప్పిందే వినాలి’ అనే నైజం గల తల్లితండ్రులు స్టేట్మెంట్స్ ఎక్కువ వాడతారు. పిల్లలనుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. దీని వల్ల తాము ఆశించినది పిల్లల నుంచి రాకపోతే అతిగా అరవడం, కొట్టడం, తిట్టడం చేస్తారు. వీళ్లకు మైండ్‌లో ఒక రూల్ బుక్ ఉంటుంది. నా పిల్లలు ఇలాగే ఉండాలి అని తీర్మానిస్తారు. వీరి పిల్లలకు స్వేచ్ఛ అనేది ఉండదు. తల్లిదండ్రులకన్నా పిల్లలు బలహీనంగా ఉంటారు కాబట్టి, తమ కన్నా బలహీనులను ఈ పిల్లలు హింసిస్తారు. ఈ ప్రవర్తన వల్ల భవిష్యత్తు లో సమాజానికీ హాని జరిగే అవకాశాలుంటాయి. జంతువుల పెంపకమూ మనకు పాఠాలే! డేగలా మారాలి.. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో డేగ (గ్రద్ద) ను చూసి నేర్చుకోవాలి అంటారు నిపుణులు. గద్ద ఒక ఎత్తైన ప్రదేశంలో ముళ్లు, గడ్డితో కలిపి ఒక గూడు అల్లుతుంది. గుడ్లు పొదిగి, పిల్లలయ్యాక ఒక దశలో వాటిని కిందకు తోసేస్తుంది. ఎగిరేవి ఎగురుతాయి. ఎగరకుండా పడిపోయే పిల్లని తండ్రి గద్ద పట్టుకొని మళ్లీ గూడు వద్దకు తీసుకువస్తుంది. ఇది గమనించిన తల్లి గద్ద గడ్డిని తీసేస్తుంది. తండ్రి గద్ద బిడ్డను ముళ్ల మీద ఉంచుతుంది. అవి గుచ్చుకోవడంతో త్వరగా ఎగరాలి, లేకపోతే ఇంకా ముళ్లు గుచ్చుకుంటాయనే ఆలోచనతో పిల్ల పక్షి ఎగురుతుంది. అంటే, పిల్లలకు మంచీ చెడూ రెండూ నేర్పించుకుంటూ పోతుంది. ప్రతి తల్లీదండ్రి తమ పిల్లల పెంపకంలో ఇదేవిధంగా శ్రద్ధ తీసుకోవాలి. సైకిల్ నేర్పించేట్టుగా ఉండాలి పేరెంటింగ్ అంటే. పడిపోతున్నప్పుడు పట్టుకొని, మిగతా సమయంలో వదలాలి. అప్పుడే స్వతంత్రంగా ఎదుగుతారు. పులిలా..ఆంక్షల నియమాలా? అమ్మానాన్న అంటే పులిని చూసి భయపడినట్టు ఉండాలనుకోకూడదు. దీనివల్లనే ‘ఏం చేస్తే ఏం దండనో’ అని ఏ పనీ సరిగ్గా చేయకపోగా పెద్దలకు తెలియకుండా తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ. కంగారూ.. అతి జాగ్రత్త పుట్టినా తన కడుపు సంచిలోనే ఉంచి పెంచుతుంది కంగారూ. ఇలాగే అతి జాగ్రత్తగా పెంచే తల్లిదండ్రుల వల్ల పిల్లలు సొంతంగా ఏదీ ఆలోచించలేరు. పెద్దలు చెప్పిందే వేదం అనుకుంటారు. ఆస్ట్రిచ్ స్వభావం ఈ పక్షి తల మట్టిలోనే పెట్టి ఊరుకుంటుంది పిల్లలను అస్సలు పట్టించుకోదు. తనకేమీ పట్టనట్టుగా ఉండే ఈ స్వభావం వల్ల పిల్లల మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుంది. పులిలా ఎవరికీ భయపడకుండా బతకాలి అనే స్వభావాన్ని తమ ఆంక్షలతో పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం లేదు. అతి జాగ్రత్తను, నిర్లక్ష్యాన్నీ చూపకూడదు. ఎక్కడ ఎదగాలో, ఎక్కడ ఒదగాలో, ఎలా ఎగరాలో నేర్పించే తల్లిదండ్రులు వల్ల పిల్లలు జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తారు. సమాజ బాధ్యతలో తామూ పాల్గొంటారు గెలవాలి.. గెలిపించాలి.. తమ మాటే నెగ్గాలి అనే ప్రవర్తన లేకుండా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తే పిల్లలు విజయావకాశాలను అందుకుంటారు. పిల్లలు గెలవాలి – అలాగే పేరెంట్స్ గెలవాలి. అంటే, ఉదాహరణకు.. పిల్లవాడు ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లాలి. హోమ్‌వర్క్ పూర్తి చేసి వెళ్లు అని చెప్పచ్చు. దీని వల్ల పేరెంట్ గెలుస్తారు, పిల్లవాడూ గెలుస్తాడు. దీనిని విన్ విన్ అప్రోచ్ అంటారు. ∙స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ, దానికీ ఒక హద్దు ఉండాలి. ఉదాహరణకు.. స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లచ్చు, కానీ, రాత్రి చెప్పిన టైమ్ లోపల ఇంటికి వచ్చేయాలి. ∙నిర్ణయాలలో పిల్లలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. పార్టీ, హోటల్, వేసుకునే దుస్తులు.. . ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో పిల్లల అభిరుచులకూ ప్రాధాన్యత ఇవ్వాలి. ∙అవసరాన్ని బట్టి లైఫ్‌స్కిల్స్ నేర్పించాలి. ∙పిల్లల నుంచి ఆశించేవి ఉంటాయి. కానీ, అవి ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. గెలిస్తే ఆనందం. గెలవకపోయినా వెన్నుతట్టి ప్రోత్సాహం ఇవ్వడం లాంటివి. ఎమోషన్స్‌కి ప్రాముఖ్యం ఇవ్వాలి. బ్యాలెన్స్డ్గా ఉండే తల్లిదండ్రుల మైండ్ పిల్లలకు ఎప్పుడూ తెరిచిన తలుపులా ఉంటుంది. చర్చలకు మంచి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మానసిక వికాసం కలుగుతుంది. నిబంధనలు విధించే తల్లిదండ్రుల్లో పైన చెప్పినవేవీ ఉండవు. వీళ్ల మైండ్‌లో క్లోజ్ డోర్ ఉంటుంది. దీంతో పిల్లలు పేరెంట్స్‌తో ఏదీ పంచుకోరు. కేవలం యాంత్రికమైన షేరింగ్ ఉంటుంది. వాస్తవ విరుద్ధంగా ఉంటారు. ఇది ఎప్పుడూ అనర్థాలకు దారితీస్తుంది. – గీతా చల్లా, సైకాలజిస్ట్ -
‘నా కొడుకు బాధ్యత.. ఉద్యోగం రెండూ ముఖ్యమే’
లక్నో : చిన్న పిల్లల ఆలన పాలన ఎంతో కష్టంతో కూడుకున్న పని. వాళ్లకు ఎప్పుడు.. ఏం అవసరం వస్తుందో చెప్పలేం. అందుకే పిల్లల వెంట ఎప్పుడూ తల్లి ఉండాల్సిందే. కానీ ఓ తల్లి తన కొడుకు సంరక్షణతో పాటు ఉద్యోగం కూడా ముఖ్యమే అని నిరూపించింది. భూజాన చంటి పిల్లాడిని వేసుకుని విధులకు హాజరయ్యారు ఓ మహిళా పోలీస్. ఈ దృశ్యాలు ఉత్తర ప్రదేశ్‌లో దర్శనమిచ్చాయి. ప్రీతి రాణి అనే మహిళా కానిస్టేబుల్ గ్రేటర్ నోయిడాలోని దాద్రి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. సోమవారం నోయిడాలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పాల్గొన్న ఓ కార్యక్రమానికి ప్రీతికి అక్కడ సెక్యూరిటీగా డ్యూటీ వేశారు. ఉదయ 6 గంటలకే తప్పని సరిగా అక్కడికి హాజరవ్వాలి. అయితే అదే రోజు భర్తకు వేరే పని ఉండటంతో మరో మార్గం లేక తన కొడుకును వెంట పెట్టుకుని విధులకు హజరయ్యారు. మహిళా కానిస్టేబుల్ చంటి పిల్లవాడితో సభకు రావడంతో అందరి దృష్టి ఆమె వైపు మళ్లింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై మహిళ స్పందిస్తూ.. ‘‘బాబు వాళ్ల నాన్నకు ఈ రోజు ఎగ్జామ్ ఉంది. కావున ఆయన పిల్లావాడిని తీసుకెళ్లలేడు. ఏమి చేయలేని స్థితిలో ఇలా చేశాను. నా కొడుకు సంరక్షణ నాకు ముఖ్యం. అదే విధంగా ఉద్యోగం కూడా ముఖ్యమే. అందుకే నేను తనను ఇక్కడకు తీసుకు రావాల్సి వచ్చింది’’ అన్నారు. కాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం(ఆదివారం, సోమవారం) గౌతమ్ బుద్ద నగర్, గ్రేటర్ నోయిడాకు విచ్చేశారు. అక్కడ రూ. 1,369 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. -
పిల్లల కన్నీళ్లు తుడిచేవారేరీ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు అనేక బాధలకు గురవుతున్నారు. కానీ 18 ఏళ్లు దాటిన ఓటరులైన పౌరుల మీద దృష్టి పెట్టిన నేతలకు పిల్లల సమస్య పెద్దదిగా అనిపించడం లేదు. తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు పుణ్యమా అని సుమారు 20మంది బాలబాలికలు ఉరేసుకుని ఉసురు తీసుకున్నారు. కనీసం, పిల్లలను కోల్పోయిన దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను పరామర్శించడానికి కూడా ఈ నేతలకు మనసు రాలేదు. బాలల హక్కుల సంఘం పిటిషన్‌తో హైకోర్టు ములు గర్రతో గుచ్చితే తప్ప వీరిలో కదలిక రాలేదు. పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయి నంత మాత్రాన నుయ్యో, గొయ్యో చూసుకోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పే విద్యా సంస్థ ఒక్కటి కూడా లేదు. పైగా, చదవనైనా చదవాలి లేదా చావాలి అన్న రీతిలో నిద్రాహారాలకు సైతం విద్యార్థులను దూరం చేస్తున్న సంస్థలు ఎన్నో. విద్యా వ్యవస్థ సంగతి అలా వుంచితే, బాలబాలికలకు కనీస రక్షణ కూడా కరువవుతోంది. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నాలుగు నెలల్లోనే వందకు పైగా అత్యాచారాలు జరిగినట్టు ఎఫ్ఐఆర్ నివేదికలే చెబుతున్నాయి. అనేక సందర్భాల్లో ఉపాధ్యాయులే కీచక పాత్ర పోషించడం విషాదకరం. హత్యల విషయంలో కూడా తెలుగు రాష్ట్రాలు రెండూ పోటీపడుతున్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే, మరోవైపు బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతు న్నాయి. హైటెక్ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబు ఏలుబడిలోని అనంతపురం జిల్లాలో అన్నం దొరకక మట్టితిని బాలిక చనిపోయిన ఘటన అందరి హృదయాలను కలిచివేసినా, ఏలికలో మాత్రం ఎటువంటి స్పందన కలిగించలేదు. అన్నివిధాలుగా పిల్లలు హీనంగా, దీనంగా బతుకుతూ వుంటే ఏలినవారు మాత్రం ఓట్లవేటలో మునిగితేలుతున్నారు. ఓటు హక్కులేని ఈ పిల్లల గొడవ వారికి వినిపించడం లేదు. కానీ, పిల్ల లపై ప్రేమ ఉన్నవారు, వారి హక్కుల కోసం పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. -అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
పాపం..పసివాళ్లు
సాక్షి, కళ్యాణదుర్గం: నెల వ్యవధిలో అనారోగ్యం కారణంగా దంపతులిద్దరూ మృతి చెందడంతో అభం..శుభం తెలియని వారి పిల్లలు అనాథలుగా మారారు. వివరాల్లోకి వెళితే..వీరేష్, జయలక్ష్మి దంపతులు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో అద్దె ఇంట్లో నివసిస్తుండేవారు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవారు. అయితే ఫిబ్రవరి 20వ తేదీన అస్వస్థతకు గురై వీరేష్ మృతి చెందాడు. భర్త పోయిన బాధలో ఉన్న జయలక్ష్మికి గత వారం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో స్థానికులు ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నాటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండేది. బుధవారం అక్కడే మృతి చెందింది. దీంతో ఆమె కుమార్తెలు నవ్య(2), ఇటీవల పుట్టిన చిన్నారి అనాథలుగా మారారు. ప్రస్తుతం వీరేష్ సోదరి సరస్వతి వీరి ఆలనా పాలనా చూసుకుంటోంది. జయలక్ష్మి మృతదేహం వద్ద బంధువుల రోదనలు చూపరులను కలిచివేశాయి. అనాథలుగా మారిన చిన్నారులను దాతలు ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. -
పసివాళ్ల ప్రాణాలు.. జాగ్రత్త
నోయిడా: మీరు మీ చిన్నారులను ఆటోరిక్షాల్లో పంపిస్తున్నారా? ఆలోచించండి..ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్నారా? గమనిస్తున్నారా? లేదంటే చిన్నారులు ఆటో ప్రమాదాలకు బలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాల నివార ణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల యాజమాన్యాలతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులపై కూడా ఉంది. విద్యార్థులను ఇంటి వద్దకు చేర్చడానికి , ఇంటి నుంచి పాఠశాలకు రావడానికి మెరుగైన రవాణా సౌకార్యాలు ఆయా విద్యాసంస్థలు కల్పించాలి. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వ్యవహరించాలి... తస్మాత్ జాగ్రత్త..!హెచ్చరించినా.. అయితే పాఠశాల యాజమాన్యాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండకూడదని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి.‘ మీ పిల్లల్ని ఆటోరిక్షాల్లో పాఠశాలలకు పంపించవద్దు, చిన్నారులు పాఠశాలకు, అక్కడి నుంచి ఇంటికి భద్రంగా వచ్చేలా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి.. అయినా కొందరు తల్లిదండ్రులు ఆటో రిక్షాలనే ఆశ్రయిస్తున్నారు. పిల్లలు ప్రమాదాల బారిన పడడానికి కారకులవుతున్నారు. ఆటో బోల్తా చిన్నారి మృతి ఆటోల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు భద్రత కరువైంది. ఇటీవల నితారిలో పదేళ్ల విద్యార్థి ఆటో నుంచి ఎగిరి కిందపడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. పరిమితికి మించిన విద్యార్థులను ఆటోల్లో తీసుకెళ్తుండగా మలుపు వద్ద ఆటో బొల్తాకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదే ఆటోలో మొత్తం 11 మంది విద్యార్థులను పరిమితికి మించి పాఠశాలకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటలు నోయిడా పరిధిలో జరగడం పరిపాటిగా మారింది. బస్సు స్టాప్‌లు దూరంగా ఉండడం వల్ల కొందరు చిన్నారుల తల్లిదండ్రులు ఆటోరిక్షాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనల తర్వాత తల్లిదండ్రులు, పాఠశాల యాజమానుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భద్రతపై అప్రమత్తంగా ఉంటాం: విద్యార్థి తండ్రిసెక్టార్ -19కి చెందిన విద్యార్థి తండ్రి అరుణ్‌సింగ్ మాట్లాడుతూ ‘మాకు ఆటోరిక్షాలు అనుకూలంగా ఉన్నాయి. ఐదేళ్లుగా ఆటోల్లోనే పంపిస్తున్నాం. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఎప్పటికప్పుడు డ్రైవర్‌తో భద్రత చర్యలను చర్చిస్తామని, అనుభవం ఉన్న డ్రైవర్ అని చెప్పారు. అధిక ఫీజులతో భారం: విద్యార్థి తల్లి సెక్టార్ 57కు చెందిన మృథిలా దేవి మాట్లాడుతూ‘ ఇప్పటికే స్కూలు ఫీజులు, పుస్తకాలు తదితర ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి..భరించలేకపోతున్నాం. అందుకే ఆటో రిక్షాలను ఆశ్రయించాల్సి వస్తుంది. మా చిన్నారి రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీపడేదిలేదు. కానీ, ఇటీవల ఆటో రిక్షా ప్రమాదంలో చిన్నారి మృతిచెందడంతో కళ్లు తెరిచాను. ఇప్పటికైనా ఆలోచిస్తా. నా ముగ్గురి పిలల్ని బడికి సుర క్షితంగా పంపించేలా చర్యలు తీసుకొంటాని అన్నారు. ఆటో ఎప్పటికీ సురక్షితం కాదు సెక్టార్- 64కు చెందిన విద్యార్థి తండ్రి మాట్లాడుతూ‘ చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్రంగాకలిచివేసింది. నా కూతురును తీసుకెళ్లే ఆటో పరిమితికి మించిన విద్యార్థులను తరలిస్తుండగా గమనించా. నాతోపాటు మరికొందరు చిన్నారుల కోసం మరో ఆటోను ఆశ్రయించా.. ఇలా ఎన్ని ఆటోలను మార్చినా అధికలోడుతో వెళ్తున్నారు. ఇక ఆటోల్లో పిల్లల్ని తరలించడం సురక్షితం కాదని విరమించుకొన్నాని’అన్నారు. ఆటో రిక్షాల్లో పిల్లల్ని పంపించొద్దు: ప్రిన్సిపాల్ సెక్టార్ -56లోని సర్లా చోప్రా డీఏసీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, పూనమ్ కల్రా మాట్లాడుతూ ‘మా పాఠశాల విద్యార్థులను చేరవేయడానికి 21 బస్సులను నడిపిస్తున్నాం. ఇందులో 3 బస్సులు పాఠశాలకు చెందినవే. మిగతా బస్సులు కాంట్రాక్ట్ పద్ధతిలో నడిపిస్తున్నాం, ఎక్కువ మంది విద్యార్థులు సమీప ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థుల్ని తమ తల్లిదండ్రులే స్వయంగా తమ వాహనాల్లో తీసుకొచ్చి పాఠశాల వద్ద దించి వెళ్తుంటారు. మరికొందరు కార్లలో కూడా తీసుకొచ్చి వదిలి వెళ్తుంటారు. ఎందుకంటే విద్యార్థులను ఆటోరిక్షాల్లో పంపించ వద్దని తల్లిదండ్రులకు సూచించాం. చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చర్యలు తీసుకొన్నామని’ అన్నారు. ఆటో రిక్షాలను ఆశ్రయించనీయం: రేణుసింగ్ సెక్టార్-44లోని అమితీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ రేణుసింగ్ మాట్లాడుతూ బస్సు డ్రైవర్ల లెసైన్స్‌లు, ఐడీలను పరిశీలిస్తాం. అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమిస్తాం. పాఠశాల బస్సుల్లో పిల్లల్ని బస్సు స్టాప్లకు వరకూ సురక్షితంగా తరలిస్తాం. సాహిబాబాద్, ఘజియాబాద్ తదితర ప్రాంతాలకు చిన్నారులను క్యాబ్‌ల్లో పంపిస్తాం. ఆటో రిక్షాలను ఆశ్రయించవద్దని తల్లిదండ్రలకు సూచించాం. అసలు ఆటోల్లో విద్యార్థులను తీసుకొనిరావడం, తీసుకెళ్లడాన్ని కూడా పూర్తిగా నిషేధించామని అన్నారు. తల్లిదండ్రులకూ అవగాహన సెక్టర్ 28లోని విశాల భారతి పబ్లిక్ స్కూల్ రష్మి కక్రూ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలకు సొంత బస్సుల్లోనే విద్యార్థులను ఇంటికి తరలిస్తాం. విద్యార్థులతో పాటే ఒక ఉపాధ్యాయుడు కూడా ఉంటారు. ఆటో రిక్షాల్లో విద్యార్థుల పంపించడ సురక్షితం కాదని తల్లిదండ్రలకు అవగాహన కల్పిస్తాం. అదేవిధంగా పలుజాగ్రత్తలు తీసుకోవాలని నోటీసులు కూడా జారీ చేస్తాం. డ్రైవర్,బస్సుకు సంబంధించిన అన్ని వివరాలు అధికారులకు పంపిస్తామని అన్నారు. అన్ని రకాల భద్రతా చర్యలను తీసుకొంటామని, ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామలు అయ్యేలా చూస్తామని, అప్పుడే విద్యార్థుల ప్రయాణం సురక్షితంగా ఉంటుందని చెప్పారు. -
బాలల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) :జిల్లాలో బాలల రక్షణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా నివారణ, బాలల రక్షణ, దత్తత అంశాలపై వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. జిల్లా బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే సమీకృత బాలల రక్షణ కార్యక్రమాలపై ప్రతినెలా సమీక్షిస్తామన్నారు. బాలలకు సంబంధించిన అన్ని అంశాలపై వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పిం చేందుకు ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశిం చారు. బాల్య వివాహాలను నిరోధించే విషయంలో అశ్రద్ధ వహిస్తే సంబంధిత తహసిల్దార్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీస్ అధికారులు కూడా తమవంతు కృషి చేయూలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపాలని ఏఎస్పీ చంద్రశేఖరరావుకు కలెక్టర్ సూచించారు. భిక్షాటన చేస్తున్న బాలలకు పునరావాసం కల్పించేం దుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయిలో బాలల రక్షణ కమిటీలు కేవలం కాగితాలకే పరిమితమైనట్టు తన దృష్టికి వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. బాలల దత్తత విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. బాలల అక్రమ రవాణా నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాడేపల్లిగూడెం లోని బ్యూటీపార్లర్‌లో ఐదేళ్ల బాలికను హింసించిన ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని ఆదేశించారు. ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో బాలుడు విద్యుత్ షాక్‌కు గురై చెరుు్య కోల్పోయూడని, ఇందుకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా బాలల సంరక్షణ న్యాయమూర్తుల పీఠం చైర్మన్ టీఎన్ స్నేహన్, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ ఆర్.సూయిజ్, ఐసీడీఎస్ పీడీ వి.వసంతబాల, బాలల అక్రమ రవాణా నిరోధక కమిటీ సభ్యురాలు టి.విజయనిర్మల, డీసీపీవో సీహెచ్.సూర్యచక్రవేణి, డీఎంహెచ్‌వో కె.శంకరరావు పాల్గొన్నారు.