చిన్నారులపై లైంగిక వేధింపులు.. తీవ్రమైన సమస్య: సీజేఐ | CJI DY Chandrachud Expressed Grief On Sexual Abuse Of children | Sakshi
Sakshi News home page

చిన్నారులపై లైంగిక వేధింపులు.. తీవ్రమైన సమస్య: సీజేఐ

Published Sun, Dec 11 2022 8:00 AM | Last Updated on Sun, Dec 11 2022 8:00 AM

CJI DY Chandrachud Expressed Grief On Sexual Abuse Of children - Sakshi

న్యూఢిల్లీ: చిన్నారులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం(పోక్సో)పై ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా సీజేఐ చంద్రచూడ్‌ ప్రసంగించారు. ‘ పిల్లలపై లైంగిక అకృత్యాల అంశం సమాజంలో పెనుసమస్యగా తయారైంది. చిన్నారి లైంగిక హింసకు గురైనప్పుడు ఆ విషయాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా బాధిత కుటుంబం మౌనంగా ఉంటున్న సందర్భాలే ఎక్కువ. ఈ సంస్కృతి మారాలి. నిందితుడు సొంత కుటుంబసభ్యుడైనా సరే ఫిర్యాదు చేసేలా బాధిత కుటుంబాల్లో ధైర్యం, చైతన్యం, అవగాహన పెరగాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు రావాలి. బాధిత చిన్నారుల వేదన వెంటనే తీర్చలేని స్థితిలో, తక్షణ న్యాయం చేకూర్చలేని స్థితిలో మన నేర శిక్షాస్మృతి ఉందనేది వాస్తవం.

ఆ చిన్నారులకు సత్వర న్యాయం సాధ్యపడాలన్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకట్ట వేయాలన్నా న్యాయవ్యవస్థతో కార్యనిర్వాహక వ్యవస్థలు చేతులు కలిపాల్సిందే. చిన్నారులు లైంగిక వేధింపుల బారిన పడకుండా ముందుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అత్యంత ముఖ్యం. పిల్లలను ఎవరైనా తాకినప్పుడు అందులో తప్పుడు ఉద్దేశం ఉందా లేదా అనేది కనిపెట్టే ‘తెలివి’ని పిల్లలకు బోధించాలి. లైంగిక వేధింపుల బారిన పడిన చిన్నారుల తల్లిదండ్రులు.. కుటుంబపరువు పోతుందని మౌనంగా ఉంటున్నారు. ఇలా మౌనంవహిస్తే బాధిత చిన్నారి వర్ణనాతీత వేదన తీరేదెలా? చిన్నారికి న్యాయం దక్కేదెలా ? ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే స్థాయికి వారిలో ధైర్యం, అవగాహన పెంచాలి. ఇది రాష్ట్రాలు, సమాజంలో సంబంధిత వర్గాల సమిష్టి బాధ్యత’ అని అన్నారు.

‘ కొన్ని రకాల కేసులు న్యాయస్థానాల్లో చూస్తుంటాం. మైనర్లు సమ్మతితో లైంగిక చర్యకు పాల్పడినా.. పోక్సో చట్టంలోని 18 ఏళ్లలోపు వయసు పరిమితి కారణంగా అది నేరమే. 16 ఏళ్లు.. 18 ఏళ్లు.. అనే దానిపై ఎలా తీర్పు ఇవ్వాలనే అంశంలో జడ్జీలు ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేని పరిస్థితి ప్రతిరోజూ ఎన్నో కోర్టుల్లో తలెత్తుతోంది. దీనికి పార్లమెంట్‌లో చట్ట సవరణ ద్వారా ప్రభుత్వమే సమస్యకు పరిష్కారం కనుగొనాలి’ అని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: విహారయాత్రలో విషాదం: అనంతపురానికి చెందిన ఫ్యామిలీ మృతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement