భావి పౌరులపైనే దేశ భవిష్యత్తు
ఘనంగా ప్రారంభమైన బాలల చలనచిత్రాల ఫ్రదర్శన
కడప కల్చరల్ : దేశ భవిష్యత్తు భావిపౌరులైన నేటి బాలలపైనే ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కడప ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగరంలోని మురళి థియేటర్లో బాలల దినోత్సవ వేడుకలు, చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ బాలల్లో అనుకరించే గుణం ఉంటుందన్నారు. మంచిని మాత్రమే అనుకరించి విజయ సాధనకు పునాదులు వేసుకోవాలని సూచించారు.
ఉన్నత లక్ష్యాలతో ఉజ్వల భవిష్యత్తును సాధించి దేశాభివృద్దికి తోడ్పడాలన్నారు. సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని ఉద్బోధించారు. ఆర్డీఓ లవన్న మాట్లాడుతూ బాల్యంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, అందుకు ఆటలు, వ్యాయామం అవసరమన్నారు. సినీ, టీవీ యువ నటి వర్షిణి ఈ సందర్భంగా తన గురించిన విశేషాలను వివరించారు.
తన తల్లిదండ్రులు సహకరించడంతోనే తాను నృత్యం, సినీ, టీవీ రంగాలలో పేరు సాధించానన్నారు. ఈ సందర్బంగా ఆమె సీరియల్లోని కొన్ని డైలాగులుచెప్పి అందరినీ అలరించారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ కడప అధ్యక్షులు బాలాజీ సుకుమార్ సభకు అధ్యక్షత వహించారు. లయన్స్ క్యాంపు చైర్మన్ పి.రమేష్, కార్యదర్శి లక్ష్మిరెడ్డి, సభ్యులు తిరుపాలయ్య, ఈకే బాబు తదితరులు పాల్గొన్నారు.
నిర్వాహకులు ఈ సందర్భంగా అతిథులను సత్కరించారు. నటి వర్షిణితో పలువురు బాలలు ఫొటోలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అనంతరం బాలల చలనచిత్రాన్ని ప్రదర్శించారు.