బ్యాగు భారం
పుస్తకాల బరువు మోయలేక చిన్నారుల తంటాలు
విద్యార్థి బరువులో 10 శాతానికి మించి పుస్తకాల
బరువు ఉండొద్దంటున్న చట్టాలు.. పట్టించుకోని విద్యాశాఖ
అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ‘మోయలేని భారం’ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. బ్యాగు నిండా పుస్తకాల మోతతో పిల్లలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు పుస్తకాల మోతతో పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రెండు, మూడు అంతస్తుల్లోని పాఠశాలల తరగతి గదుల్లోకి వెళ్లే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. పుస్తకాల భారం తగ్గించాలని 2006లోనే చట్టం చేసినా దాని అమలుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం లేదు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) స్కూళ్లలో పుస్తకాల బరువు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సీబీఎస్ఈ తాజాగా ఆదేశించినా.. మన రాష్ట్రంలో ఆ దిశగా అధికారులు దృష్టిసారించడం లేదు. మళ్లీ బడి మొదలు కాబోతున్న నేపథ్యంలో విద్యార్థులకు పుస్తక కష్టాలు మొదలు కానున్నాయి.
విద్యార్థి శరీర బరువులో పుస్తకాల భారం 10% మించకూడదని చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్-2006 చెబుతున్నా.. 25% నుంచి 35% పైగా బరువుతో విద్యార్థుల నడ్డివిరిచే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు కండరాల సమస్యలు, వెన్నుపూస ఒంగిపోవడం, వెన్నునొప్పి వంటి అనా రోగ్య సమస్యలకు గురవుతున్నారని వైద్యులు, నిఫుణులు చెబుతున్నారు.
పుస్తకాల బరువు.. భారంగా చదువు
రాష్ట్రంలోని 14 వేలకుపైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అత్యధికంగా నగరాల్లో చదువుతున్న వారే. ఇలాంటి వాటిల్లో బహుళ అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలే ఎక్కువ. బ్యాగు బరువుతో ఇబ్బంది పడే విద్యార్థులు పై అంతస్తుల్లోని తరగతులకు వెళ్లడానికి తంటాలు పడుతున్నారు. రెగ్యులర్ సిలబస్ పుస్తకాలతోపాటు డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జీకే, కంప్యూటర్, అసైన్మెంట్, డైరీ, రిజిస్టర్ వంటి పుస్తకాలతోపాటు క్లాస్ వర్క్, హోంవర్క్, తెలుగు, హిందీ, ఇంగ్లిషు, సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇలా ఒక్కో సబ్జెక్ట్‌కు 2 నుంచి 3 చొప్పున నోట్‌బుక్స్, అట్లాస్, డిక్షనరీ, స్పోర్ట్స్ డ్రెస్ వంటి వాటితో స్కూల్ బ్యాగు మోయలేని భారం అవుతోంది. యూకేజీ చదివే విద్యార్థి 14 కిలోలు ఉంటే.. బ్యాగు బరువే 3.5 కిలోలకు పైనే ఉంటోందని విద్యాశాఖ అంచనా. మూడో తరగతి విద్యార్థి బరువు 22 కిలోలు ఉంటే అతని పుస్తకాల బరువు 8 కిలోలకు పైనే. 35 కిలోల బరువుండే ఏడో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 10 కిలోలకుపైనే.
స్కూల్ బ్యాగ్ బరువు అధికంగా ఉంటే శరీర ఎదుగుదల దెబ్బతింటుంది. ఎముకలు, కండరాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. మెడ, భుజాలు, వెన్నుపూస పైభాగం, వెన్నుపూస కింది భాగం దెబ్బతింటాయి. దీంతో వెన్నునొప్పి వస్తుంది. వెన్నెముక, భుజాలు వంగిపోతాయి. ఈ ప్రభావం బాలికలపై తీవ్రంగా ఉంటుంది. విద్యార్థులు ఎక్కువ అలసటకు గురవుతారు. శ్వాస సరిగ్గా పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది. చట్టం ప్రకారం ప్రభుత్వం, పాఠశాలల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలి.
ఆ తర్వాత తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్యాడ్ తరహాలో బ్యాగు వెనుక భాగంలో స్పాంజ్ కలిగిన బ్యాగులను తీసుకోవాలి. దానివల్ల బరువంతా నేరుగా భుజాలు, వెన్నుపూసపై పడదు.
- డాక్టర్ శివనారాయణరెడ్డి, పిల్లల వైద్య నిపుణుడు
చట్టం ఏం చెబుతోందంటే..
నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు స్కూల్ పుస్తకాలు మోయకూడదు.
ఇతర తరగతుల వారు విద్యార్థి శరీర బరువుకంటే స్కూల్ బ్యాగు బరువు 10 శాతం మించి ఉండకూడదు.
స్కూల్ బ్యాగు బరువు, రోజూ తెచ్చుకోవాల్సిన పుస్తకాలపై శాస్త్రీయ అంచనాతో పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు మార్గదర్శకాలు ఇవ్వాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలను స్కూల్లోనే దాచుకునేందుకు లాకర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి.
ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలే విద్యార్థుల పుస్తకాలను స్కూల్లో పెట్టుకునేందుకు ప్రతి విద్యార్థికి లాకర్లు, డెస్క్‌లను ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేయకపోయినా, ఈ నిబంధనలను పాటించకపోయినా ఆయా స్కూళ్లపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి. రూ. 3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
జరిమానా విధించిన తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే పాఠశాలల గుర్తింపును రద్దు చేయవచ్చు.