టెడ్డీబేర్ అలా పుట్టింది...
పిల్లల బొమ్మ
చిన్నారులను అమితంగా ఆకట్టుకొనే టెడ్డీబేర్ పుట్టుక ఇలా జరిగింది: అమెరికాకు చెందిన మోరిస్ మిచ్థమ్ టెడ్డీబేర్ సృష్టికర్త. అయితే, 1901 నుంచి 1909 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉండిన థియోడర్ రూజ్వెల్ట్ ఈ బొమ్మ పుట్టుకకు కారణం! అమెరికా 26వ అధ్యక్షుడైన ఆయనను ‘టెడ్డీ’ రూజ్వెల్ట్ అని కూడా పిలుస్తారు. స్వతహాగా మంచి షూటర్‌గా పేరున్న టెడ్డీకి వేట అంటే ఆసక్తి.
ఒకసారి ఆయన తన పరివారంతో కలసి వేటకు వెళ్లారు. ఒక ఎలుగుబంటి వారి మీద దాడి చేసింది. చేతిలో పిస్టల్ ఉన్నా కాల్చకుండా, దాన్ని తరిమికొట్టారు. ఈ ఎలుగుబంటి అనుభవం అమెరికా మీడియాలో బాగా ప్రచారానికి నోచుకొంది. ఈ సంఘటన స్ఫూర్తితో కార్టూన్లు, కామిక్స్ పుట్టుకొచ్చాయి. ఇదే ఊపులో మోరిస్ మిచ్థమ్ ఎలుగుబంటిని ఒక సాఫ్ట్‌టాయ్ రూపంలో తయారు చేసి, దానికి ‘టెడ్డీ’ బేర్ అని పేరు పెట్టాడు. అది బ్రహ్మాండమైన ఆదరణకు నోచుకొంది. కాలక్రమంలో ఐకానిక్ టాయ్లలో ఒకటిగా నిలిచింది.