china air force
-
చైనా కొత్త యుద్ధ విమానం గుట్టు రట్టు!
ఝుహై: చైనా సరికొత్త యుద్ధ విమానం జే-20 స్టీల్త్ ఫైటర్ త్వరలోనే ప్రజల ముందుకు రానుంది. ఇన్నాళ్లు రహస్యంగా రూపొందిస్తున్న ఈ యుద్ధవిమానాన్ని ఝూహై ఎయిర్‌షోలో ప్రదర్శించనున్నట్టు చైనా వెల్లడించింది. అమేయ సైనిక శక్తిగా ఎదగాలనుకుంటున్న చైనా అత్యాధునిక టెక్నాలజీతో ఈ సరికొత్త యుద్ధవిమానాన్ని రూపొందించింది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తిగా గమనిస్తున్న ఈ యుద్ధ విమానం మొట్టమొదటిసారి బహిరంగంగా ఆకాశంలో ప్రయాణించనుందని చైనా ప్రభుత్వ విమానాయాన కంపెనీ ఏవిక్ అధ్యక్షుడు టాన్ రుయిసంగ్ తెలిపారు. 20 ఏళ్ల కిందట వైమానిక సాంకేతికత విషయంలో చైనా ఎంతో వెనుకబడి ఉందని, కానీ నేడు ఈ రంగంలో అగ్రశ్రేణితో ముందంజలో ఉందని ఆయన చెప్పారు. సత్వరంగా రహస్యంగా దూసుకెళ్లగలిగే ఈ యుద్ధవిమానం సుదూరస్థాయి క్షిపణులను అవలీలగా మోసుకెళ్లగలుతుంది. ఈ యుద్ధ విమానంతో ఆసియాలో సూపర్ పవర్‌గా తనను తాను చాటుకోవడానికి, గగనతల సామర్థ్యంలో అమెరికాకు ఏమాత్రం తీసిపోమని తెలుపడానికి చైనా తహతహలాడుతోంది. తన సరిహద్దులను రక్షించుకోవడమే కాదు.. వనరులతో సుసంపన్నమైన దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సైనికంగా తనను ఎవరూ ఎదుర్కోలేరనే సందేశాన్ని చైనా ఇవ్వాలనుకుంటోంది. అందులో భాగంగానే తన సైనిక శక్తిని అత్యంత వేగంగా అత్యాధునికరించుకొని తన బలాన్ని చాటుతోంది. దక్షిణాది నగరమైన ఝుహైలో ప్రతి రెండేళ్లకు ఓసారి నిర్వహిస్తున్న వైమానిక ప్రదర్శనలో తన మిలిటరీ సాంకేతికతను, యుద్ధ విమానాలను ప్రదర్శిస్తున్నది. ఈసారి ఈ వైమానిక ప్రదర్శనలో 42 దేశాలకు చెందిన 151 యుద్ధవిమానాలను కూడా ప్రదర్శించనున్నారు. -
కోతుల బెటాలియన్‌ను సిద్ధం చేసిన చైనా
చైనాలోని ప్రజా విముక్తి సైన్యం (పీఎల్ఏ)కు రోజుకో కొత్త ఆలోచన వస్తున్నట్లుంది. బీజింగ్‌కు సమీపంలో ఉన్న తమ ఎయిర్ బేస్‌ను కాపాడుకోడానికి ఒక కోతుల బెటాలియన్‌ను సిద్ధం చేస్తోంది. భారీ ఎత్తున తమ విమానాలకు ముప్పు కలిగిస్తున్న పక్షుల గుంపును చెదరగొట్టడానికి కోతులకు మించిన ఆయుధాలు వేరే ఏవీ దొరకవని భావించారు. అందుకే వీటికి శిక్షణ ఇచ్చి, పక్షులు వచ్చినప్పుడల్లా వాటిని చెదరగొట్టడం నేర్పించారు. అంతేకాదు, చెట్ల మీద ఉన్న పక్షుల గూళ్లను కూడా ఈ కోతులు నాశనం చేస్తాయి. యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సమయంలో పక్షులు వాటికి చాలా ముప్పు కలిగిస్తున్నాయని చైనా వైమానిక దళం ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాటి బారి నుంచి తప్పించుకోడానికి చాలా ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. దాంతో వైమానికదళంలో ఓ అధికారికి కోతుల ఆలోచన వచ్చింది. వెంటనే వాటికి శిక్షణ ఇచ్చేవాళ్లను కూడా తీసుకొచ్చి, ఒక్కో కోతి చేత రోజుకు ఆరు చొప్పున పక్షి గూళ్లను ధ్వంసం చేయిస్తున్నారు. ఇలా తమ ఎయిర్‌బేస్ చుట్టుపక్కల అస్సలు ఒక్క పక్షి అన్నది కూడా ఎగరకుండా చేయాలన్నది వాళ్ల ఆలోచన. సైన్యంలో జంతువులను ఉపయోగించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు అమెరికా వాళ్లు మందుపాతరలను గుర్తించేందుకు డాల్ఫిన్ల సాయం తీసుకున్నారు. అలాగే, కుక్కలనైతే ఎప్పటినుంచో అన్ని దేశాల పోలీసులు, సైన్యం ఉపయోగించుకుంటున్నాయి. అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన ఆపరేషన్‌లో కూడా కైరో అనే బెల్జియన్ షెపర్డ్ రకం శునకం సేవలను అమెరికా ఉపయోగించుకుంది.