China jeeyar swami
-
ముచ్చింతల్ సమతా మూర్తి: ఫిబ్రవరి 2 నుంచి సమతా కుంభ్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్తో 216 అడుగుల పంచ లోహ రామానుజాచార్యుల విగ్రహంతో సమతామూర్తి(స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, సమతామూర్తి కేంద్రం ఏర్పాటై ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఏడాది కావస్తున్నది. ఈ తరుణంలో చిన్న జీయర్ కీలక ప్రకటన చేశారు. ఇక, సోమవారం చిన్న జీయర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరుగనుందన్నారు. అదే సమయంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమతామూర్తి కేంద్రం గత ఏడాది ఫిబ్రవరి 2న ప్రారంభమైంది.. 216 అడుగుల పంచలోహ విగ్రహం అందుబాటులోకి వచ్చిందన్నారు. 108 దివ్య దేశాలు సమతామూర్తి కేంద్రంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను చూశారు. ఈ ఏడాది కూడా అదే క్రమంలో కార్యక్రమం సాగుతుంది. కాకపోతే ఈ ఏడాది 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నామని వెల్లడించారు. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 11వ తేదీన లక్ష మందితో భగవద్గీత పారాయణం ఉంటుందన్నారు. అలాగే, రామానుజాచార్యులు చాలా మేధావి అంతే కాకుండా మనసు ఉన్న మనస్వి. అన్ని వర్గాల వారిని సమాజంలోకి తెచ్చి ఆలయాల్లో భాగస్వాములను చేశారని అన్నారు. ఈ క్రమంలోనే చిన్న జీయర్‌కు భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ రావడంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో చిన్న జీయర్ మాట్లాడుతూ.. ముందు రోజు నాకు ఫోన్ చేసి.. లిస్టులో మీ పేరు పెడుతున్నామని చెప్పారు. మీకు ఏదైనా అభ్యంతమా? అని అడిగారు. నాకేమీ అభ్యంతరం లేదని నేను వారికి చెప్పాను. పద్మభూషణ్ రావాలని నేను కోరుకోలేదు. అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉంది అని కామెంట్స్ చేశారు. -
ఆలయాలపై దాడులు వాస్తవం
అమరావతి: రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతన్న దాడులపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు. విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే ఈ దాడులు వివిధ రకాల దురుద్దేశాలతో జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నవారిని దించడానికి దుష్టశక్తులు ఇలాంటి కుట్రలకు పాల్పడి ఉండవచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల ధ్వంసానికి కనిపించని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిన పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్వామి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఈ అలజడిని తగ్గించేందుకే తాను ఆలయాల సందర్శన చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఆలయాల్లో విగ్రహాల స్థితిగతులు, సౌకర్యాలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తానని వివరించారు. దేవాలయాల సంరక్షణ బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో భక్తి భావం పెరిగినప్పుడే ఆలయాల సంరక్షణ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలయమైనా, మసీదైనా, చర్చి అయనా దాడులు సరికాదని, ఇటువంటి విధ్వంసాలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని వారు తమకిష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ఉందని స్వామి అభిప్రాయపడ్డారు. -
చినజీయర్ స్వామికి టీటీడీ చైర్మన్ పరామర్శ
సాక్షి, తిరుమల: శ్రీత్రిదండి చినజీయర్ స్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో పరామర్శించారు. శుక్రవారం రాత్రి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలిమేలుమంగ తాయారు పరమపదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి జీయర్ ఆశ్రమానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆయన మాతృమూర్తి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. -
చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోన్ చేసి పరామర్శించారు. శనివారం చినజీయర్ స్వామి మాతృమూర్తి మంగతాయారు(85) అస్తమించారు. సీఎం వైఎస్ జగన్ స్వయంగా చినజీయర్ స్వామికి ఫోన్ చేసి ఆయన తల్లి మంగతాయారు మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. (చినజీయర్‌స్వామికి మాతృ వియోగం) -
విజయకీలాద్రిపై ధ్వజస్తంభ ప్రతిష్ఠ
సీతానగరం (తాడేపల్లి రూరల్) : విజయకీలాద్రిపై త్రిదండి చినజీయర్ స్వామి నిర్మిస్తున్న 9 దేవాలయాల ప్రాంగణంలో ధ్వజ స్తంభ ప్రతిష్టను సోమవారం కనులపండువగా నిర్వహించారు. చినజీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాలపై గోపురాలను ప్రతిష్టించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక హోమాలు చేశారు. వేదవిద్యార్థుల మంత్రోశ్చరణాల మధ్య ప్రత్యేక పూజలు, ధ్వజస్తంభం ప్రతిష్టించారు. కార్యక్రమంలో ఎంపీ గోకరాజు గంగరాజుతోపాటు క్రేన్ వక్కపొడి అధినేత లక్ష్మీకాంతారావు, లీలాచక్రధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టను తిలకించేందుకు వచ్చిన భక్తులను ఆశ్రమ నిర్వాహకులు వాహనాలలో కొండపైకి తరలించారు. భక్తులు నవధాన్యాలు చల్లి తమ భక్తిని చాటుకున్నారు. దేవతావిగ్రహాలను గుడిలో ప్రతిష్టించేందుకు ఆలయం చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆశ్రమ నిర్వాహకులు వెంకటాచార్యులు, రఘు తదితరులు పాల్గొన్నారు. చినజీయర్ స్వామి, దాతల ఆధ్వర్యంలో దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. -
వినాయక పూజతో సకల శుభాలు
చినజీయర్ స్వామి ఉపదేశం తాడేపల్లి (తాడేపల్లి రూరల్): ముక్కోటి దేవతల్లో తొలి పూజ అందుకునే వినాయకుడిని ప్రార్థించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఉపదేశించారు. తాడేపల్లి వైఎస్సార్ సెంటర్లో గణేశ్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద గణేశునికి మంగళవారం చినజీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత తాడేపల్లి కొత్తూరు శివాలయం వద్ద చినజీయర్ స్వామికి ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఊరేగింపుగా వైఎస్సార్ సెంటర్ నుంచి గణేశ్ మండపానికి స్వామిజీని తీసుకువచ్చారు. పూజల అనంతరం భక్తులనుద్దేశించి స్వామీజీ మాట్లాడారు. గణేశ్ మండపాల వద్ద ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అహోబిళ రామానుజ జీయర్ స్వామి, విగ్రహ దాతలు వినాయక లైఫ్ సైన్సెస్ అధినేతలు కళ్లం చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, కమిటీ సభ్యులు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, దొంతిరెడ్డి గాంధీ, రుక్మాందరెడ్డి, కౌన్సిలర్లు ఈదులమూడి డేవిడ్‌రాజు, మాచర్ల అబ్బు, ఎండి గోరేబాబు, ఓలేటి రాము, దర్శి విజయశ్రీ, కాటాబత్తుల నిర్మల తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు చినజీయర్ మంగళ శాసనాలు అందజేశారు. -
సమతా స్నానం కరిష్యే..