China Shanghai
-
సెన్సెక్స్ 151 పాయింట్లు డౌన్
చైనా షాంఘై స్టాక్ సూచీ షాక్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాలపై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. దీనికి చైనా షాంఘై స్టాక్ సూచీ 3,000 కీలక పాయింట్లకు పడిపోవడం కూడా తోడవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 151 పాయింట్లు క్షీణించి 25,706 పాయింట్లకు, నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 7,829 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరబుల్స్, వాహన, బ్యాంక్ షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సోమవారం లాభపడిన షేర్లలో లాభాల స్వీకరణ జరగడం, అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండడం కూడా ప్రభావం చూపించింది. ఫెడ్ అనిశ్చితి.. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు విషయమై అనిశ్చితి నెలకొనడంతో సోమవారం అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావంతో మంగళవారం ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. యూరోప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. మార్కెట్ జోరుపై సందేహాలు నెలకొనడంతో ఇన్వెస్టర్లు పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిపారు. అంతేకాకుండా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించారు. లోహ షేర్లు విలవిల...: లోహ షేర్లు విలవిలలాడాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్ 5 శాతం, వేదాంత 4 శాతం, టాటా మోటార్స్ 3.6 శాతం, హిందాల్కో 3 శాతం, ఎల్ అండ్ టీ 2.9 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.6 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.8 శాతం, హీరో మోటొకార్ప్ 1.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.1 శాతం చొప్పున తగ్గాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,241 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.13,534 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,58,824 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.911 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.481 నికర కొనుగోళ్లు జరిపారు. -
చైనా భయాలతో... నష్టాలు!
♦ 242 పాయింట్ల నష్టంతో 27,366కు సెన్సెక్స్ ♦ 73 పాయింట్ల నష్టంతో 8,300కు నిఫ్టీ చైనా షాంఘై స్టాక్ సూచీ పతనం శుక్రవారం భారత స్టాక్ మార్కట్నూ పడగొట్టింది. ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 242 పాయింట్లు నష్టపోయి 27,366పాయింట్ల వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 8,300 పాయింట్ల వద్ద ముగిశాయి. గ్రీస్ ప్రధాని సిప్రాస్ రాజీనామా నిర్ణయం, చైనా ప్రభావంతో వివిధ దేశాల కరెన్సీ పతనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై అనిశ్చితి, ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం రెండేళ్ల కనిష్ట స్థాయి(65.91)కి పడిపోవడం, దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తత తదితర అంశాలు ప్రభావం చూపాయి. బ్యాంక్, రియల్టీ, వాహన, ఇన్ఫ్రా షేర్లు పతనం కాగా, ఎఫ్ఎంసీజీ, కొన్ని ఫార్మా, ఐటీ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు నెలల కనిష్ట ముగింపు. ఈ వారంలో సెన్సెక్స్ 701 పాయింట్లు, నిఫ్టీ 219 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 450 పాయింట్ల వరకూ క్షీణించిన సెన్సెక్స్ చైనా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) ఆరున్నరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఆసియా మార్కెట్లలో అమ్మకాలు వరదలా ముంచెత్తాయి. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆందోళనలు మరింత పెరగడంతో ఒక దశలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఈ ఏడాది ఏప్రిల్1కు ముందు మ్యాట్ విధించడంపై ఎఫ్ఐఐలకు ఊరటనివ్వాలని ఎ.పి. షా కమిటీ సూచించడంతో ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్లు జరిగాయి. దీంతో కొంత మేర రికవరీ జరిగింది. ఇక నుంచి డిస్ప్లేలో షేర్ల ముఖ విలువలు చెన్నై: షేర్ల ప్రస్తుత ధరలతో పాటు వాటి ముఖ విలువలను కూడా డిస్ప్లే చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. షేర్ల అసలు విలువలను చిన్న ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవడానికి ఇది తప్పనిసరని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా చెప్పారు. ఇక ఇప్పటి నుంచి టీవీ చానెళ్లలో టిక్కర్లలో షేర్ల ధరలతో పాటు వాటి ముఖ విలువలను కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుందని వివరించారు. తమిళనాడు ఇన్వెస్టర్స్ అసోసియేషన్ (టీఐఏ) ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.