
సెన్సెక్స్ 151 పాయింట్లు డౌన్
చైనా షాంఘై స్టాక్ సూచీ షాక్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాలపై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. దీనికి చైనా షాంఘై స్టాక్ సూచీ 3,000 కీలక పాయింట్లకు పడిపోవడం కూడా తోడవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 151 పాయింట్లు క్షీణించి 25,706 పాయింట్లకు, నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 7,829 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరబుల్స్, వాహన, బ్యాంక్ షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సోమవారం లాభపడిన షేర్లలో లాభాల స్వీకరణ జరగడం, అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండడం కూడా ప్రభావం చూపించింది.
ఫెడ్ అనిశ్చితి..
ఫెడ్ వడ్డీరేట్ల పెంపు విషయమై అనిశ్చితి నెలకొనడంతో సోమవారం అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావంతో మంగళవారం ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. యూరోప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. మార్కెట్ జోరుపై సందేహాలు నెలకొనడంతో ఇన్వెస్టర్లు పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిపారు. అంతేకాకుండా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించారు.
లోహ షేర్లు విలవిల...: లోహ షేర్లు విలవిలలాడాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్ 5 శాతం, వేదాంత 4 శాతం, టాటా మోటార్స్ 3.6 శాతం, హిందాల్కో 3 శాతం, ఎల్ అండ్ టీ 2.9 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.6 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.8 శాతం, హీరో మోటొకార్ప్ 1.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.1 శాతం చొప్పున తగ్గాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,241 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.13,534 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,58,824 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.911 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.481 నికర కొనుగోళ్లు జరిపారు.