
ఫెడ్ మీటింగ్‌తో ఇన్వెస్టర్ల జాగ్రత్త
109 పాయింట్ల నష్టంతో 27,253కు సెన్సెక్స్
* 24 పాయింట్ల నష్టంతో 8,233కు నిఫ్టీ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంభించడంతో భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 27,253 పాయింట్ల వద్ద. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 8,233 పాయింట్ల వద్ద ముగిశాయి.
సోమవారం కూడా సెన్సెక్స్ 109 పాయింట్లే నష్టపోవడం విశేషం. లుపిన్ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశకు గురిచేయడం, అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండడం.. ఈ అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. క్యాపిటల్ గూడ్స్, లోహ, ఆయిల్ షేర్లు నష్టపోయాయి. రెండు రోజుల పాటు జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం ప్రారంభమైన నేపథ్యంలో ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగానే ట్రేడయ్యాయి.
ఈ సమావేశాల్లో వడ్డీరేట్ల పెంపు విషయమై ఏమైనా సంకేతాలు అందుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారన్నది నిపుణుల అభిప్రాయం. మంగళవారం సెన్సెక్స్ 27,291 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే ట్రేడయింది.
లుపిన్ 5 శాతం డౌన్
కన్సాలిడేటెడ్ నికర లాభం 35 శాతం క్షీణించడంతో లుపిన్ షేర్ 5.2 శాతం నష్టపోయి రూ.1,946 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ షేర్లలో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే.