
ఐదో రోజూ లాభాలే
కొనసాగిన ఫెడ్ లాభాలు
147 పాయింట్ల లాభంతో 26,933కు సెన్సెక్స్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు వుండకపోవొచ్చన్న అంచనాలతో లాభాలు మంగళవారం కూడా కొనసాగాయి. స్టాక్ మార్కెట్ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో లాభాల్లోనే సాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 26,938 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 8,153 పాయింట్ల వద్ద ముగిశాయి. ముందుగా అనుకున్న విధంగానే 2016 నుంచే వస్తువుల, సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం, కమోడిటీ ధరలు పెరుగుతుండడం, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు.. ఈ అంశాలన్నీ సెంటిమెంట్‌కు మరింత ఊతమిచ్చాయని విశ్లేషకులంటున్నారు. ఆయిల్, ఫార్మా షేర్లు బాగా లాభపడ్డాయి. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,316 పాయింట్లు లాభపడింది. ఈ ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 5%, నిఫ్టీ 4.6% చొప్పున పెరిగిపోయాయి.
తగ్గిన లాభాలు..:వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాలు ఆర్థిక వ్యవస్థకు భారీగా ఉండేలా ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించడం కూడా ప్రభావం చూపింది. గత నెలలో సేవల రంగం కార్యకలాపాలు తగ్గాయన్న నికాయ్ ఇండియా కాంపొజిట్ పీఎంఐ సర్వే వెల్లడించడంతో ఐటీ, టెక్నాలజీ, బ్యాంకింగ్, విద్యుత్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో సెన్సెక్స్ లాభాలు తగ్గాయి.
కొనసాగిన టాటా మోటార్స్ జోరు...
టాటా మోటార్స్ జోరు మంగళవారం కూడా కొనసాగింది. చైనా ప్రభుత్వం వాహన విక్రయాల జోరు పెంచడం కోసం ప్యాకేజీని ఇవ్వనున్నదన్న వార్తలతో టాటా మోటార్స్ షేర్ 5.8 శాతం లాభపడి 333 వద్దముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,589 షేర్లు లాభాల్లో, 1,151 షేర్లు నష్టాల్లో ముగిశాయి.