
చైనా భయాలతో... నష్టాలు!
♦ 242 పాయింట్ల నష్టంతో 27,366కు సెన్సెక్స్
♦ 73 పాయింట్ల నష్టంతో 8,300కు నిఫ్టీ
చైనా షాంఘై స్టాక్ సూచీ పతనం శుక్రవారం భారత స్టాక్ మార్కట్‌నూ పడగొట్టింది. ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 242 పాయింట్లు నష్టపోయి 27,366పాయింట్ల వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 8,300 పాయింట్ల వద్ద ముగిశాయి. గ్రీస్ ప్రధాని సిప్రాస్ రాజీనామా నిర్ణయం, చైనా ప్రభావంతో వివిధ దేశాల కరెన్సీ పతనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై అనిశ్చితి, ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం రెండేళ్ల కనిష్ట స్థాయి(65.91)కి పడిపోవడం, దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తత తదితర అంశాలు ప్రభావం చూపాయి. బ్యాంక్, రియల్టీ, వాహన, ఇన్‌ఫ్రా షేర్లు పతనం కాగా, ఎఫ్‌ఎంసీజీ, కొన్ని ఫార్మా, ఐటీ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు నెలల కనిష్ట ముగింపు. ఈ వారంలో సెన్సెక్స్ 701 పాయింట్లు, నిఫ్టీ 219 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
450 పాయింట్ల వరకూ క్షీణించిన సెన్సెక్స్
చైనా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) ఆరున్నరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఆసియా మార్కెట్లలో అమ్మకాలు వరదలా ముంచెత్తాయి. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆందోళనలు మరింత పెరగడంతో ఒక దశలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఈ ఏడాది ఏప్రిల్1కు ముందు మ్యాట్ విధించడంపై ఎఫ్‌ఐఐలకు ఊరటనివ్వాలని ఎ.పి. షా కమిటీ సూచించడంతో ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్లు జరిగాయి. దీంతో కొంత మేర రికవరీ జరిగింది.
ఇక నుంచి డిస్‌ప్లేలో షేర్ల ముఖ విలువలు
చెన్నై: షేర్ల ప్రస్తుత ధరలతో పాటు వాటి ముఖ విలువలను కూడా డిస్‌ప్లే చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. షేర్ల అసలు విలువలను చిన్న ఇన్వెస్టర్లు అర్థం చేసుకోవడానికి ఇది తప్పనిసరని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా చెప్పారు. ఇక ఇప్పటి నుంచి టీవీ చానెళ్లలో టిక్కర్లలో షేర్ల ధరలతో పాటు వాటి ముఖ విలువలను కూడా డిస్‌ప్లే చేయాల్సి ఉంటుందని వివరించారు. తమిళనాడు ఇన్వెస్టర్స్ అసోసియేషన్ (టీఐఏ) ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.