chintalapudi constituency
-
ఒకే ఒరలో రెండు కత్తులు
సాక్షి,పశ్చిమ గోదావరి : రాజకీయాలలో బద్ధశత్రువులు, మిత్రులు ఉండరంటారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిన్నటి వరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ ఒకే కారులో రాజధాని అమరావతికి పయనమయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఇప్పటికి పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు, శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ఒక్కమారు కూడా సమయానికి రాని ఎమ్మెల్యే పీతల సుజాత వట్లూరు గేటు వద్ద తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళికి స్వాగతం పలకడానికి ముందే సిద్ధంగా ఉండటంతో ఆ పార్టీ నేతలే అవ్వాక్కయారంట. ప్రస్తుతం వారిద్దరూ ఒకే కారులో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా పీతల వర్గీయులందరినీ ఈ కార్యక్రమానికి సమాయత్తం చేయడంతోపాటు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి 40 కార్లలో ఆమె అనుచరులు హాజరవడం చర్చనీయాంశమైంది. అంతా పాత నీరే కొత్త నీరు స్వల్పం చింతలపూడి నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ సోమవారం అమరావతి వెళ్లి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కామవరపుకోట మండలం నుంచి వెళ్ళిన వారందరూ అధిక శాతం ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్న నాయకులు, కార్యకర్తలే. వెళ్లిన వారిలో కొత్తగా మురళీ అనుచరగణంగా చెప్పుకునే స్థాయికల నాయకులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఎమ్మెల్యే సుజాత వర్గీయులుగా ఉన్న కామవరపుకోట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల ఎంపీపీలతో పాటు వారి అనుచరగణం మొత్తాన్ని ఈ సమావేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఎన్నికల నియమావళి ఉందా? లేదా? చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కామవరపుకోట ఆర్అండ్బీ బంగ్లా దగ్గర నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులతో సుమారు 100 కార్లలో ర్యాలీగా అమరావతికి తరలివెళ్లారు. వీటిలో 30 నుంచి 40 కార్ల వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన జెండాలతో ర్యాలీగా వెళ్ళాయి. ప్రతీ కారుకూ ఓ స్టిక్కరు ఉంది. ఎన్నికల నియమావళి నేపథ్యంలో జెండాలు, స్టిక్కర్లు, ర్యాలీకి ఎటువంటి అనుమతి తీసుకోలేదని స్థానిక తహసీల్దార్ శ్రీ పల్లవి, ఎంపిడీఓ జె మన్మథరావు తెలిపారు. తాము ఏలూరు కలెక్టరేట్లో జరుగుతున్న ఎన్నికల సమావేశానికి వెళ్లినట్టు వివరించారు. -
తేల్చుకుందాం.. రా
♦ ప్రభుత్వ విప్ చింతమనేనిపై మంత్రి సుజాత ఫైర్ ♦ నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏమిటంటూ నిలదీత ♦ వాడీవేడిగా టీడీపీ జిల్లా సమన్వయకమిటీ సమావేశం సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి వస్తావా.. రా తేల్చుకుందాం. అయినా నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏంటి’ అంటూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై ఫైర్ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఏలూరులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో ఒక సినిమా థియేటర్ ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యే అయిన పీతల సుజాతను పిలవకుండా, విప్ చింతమనేని ప్రభాకర్‌ను పిలిచారు. దీనికి చింతమనేని హాజరయ్యారు. ఈ విషయం టీడీపీ సమావేశంలో చర్చకు వచ్చింది. తనను ఆహ్వానించటంతో వెళ్లానని, దీనికి మంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటని చింతమనేని ప్రశ్నించినట్టు తెలిసింది. తనకు ఆహ్వానం లేనిచోట మరొకరు వచ్చి పాల్గొనడం ఎంతవరకూ సమంజసమని పీతల సుజాత ప్రశ్నించగా.. చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని, తనను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తానని చింతమనేని సమాధానం చెప్పినట్టు భోగట్టా. దీంతో మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రా తేల్చుకుందాం. ఎస్సీ నియోజకవర్గం అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు’ అని సీరియస్‌గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది. ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకుండా వేరే నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. మంత్రి సుజాత మాట్లాడుతూ తానూ పార్టీలో సీనియర్‌నని, పార్టీ కోసం కష్టపడ్డానని, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు విలువ ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తే.. చూస్తూ ఊరుకోనని స్పష్టం చేసినట్టు సమాచారం. మంత్రి అయ్యన్నపాత్రుడు ఇరువురికి నచ్చజెప్పడంతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగింది. -
అమ్మో.. ‘దేశ’ ముదురు
* వంద కోట్లు మింగేసిన ‘బొమ్మరిల్లు’ రాజారావు * అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు * కోట్లు సేకరించి టీడీపీ మద్దతుదారుల గెలుపు కోసం వెదజల్లిన వైనం * వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి చింతలపూడి టికెట్ ఆశిస్తున్న రాజారావు * పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం రూ.3 కోట్ల ఖర్చు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది ఏజెంట్లు.. మాయమాటలతో 40 వేల మంది నుంచి డిపాజిట్ల సేకరణ.. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా వంద కోట్లు! మోసం బట్టబయలు కాగానే పరార్!! ‘బొమ్మరిల్లు’ పేరుతో అమాయక జనాన్ని నిండా ముంచిన ‘దేశ’ ముదురు రాయల రాజారావు ఘరానా మోసమిదీ. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్తగా ఉన్న ఈయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వివిధ జిల్లాల్లోని డిపాజిట్‌దారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాజారావును, ఆయన భార్య స్వాతిని అరెస్టు చేసేందుకు విశాఖ సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విశాఖ పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డి.. ఎనిమిది జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశారు. కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న రాజారావు, రెండో ముద్దాయిగా ఉన్న ఆయన భార్య స్వాతి, మూడో ముద్దాయి, రాజారావు బావమరిది లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నారు. పక్కాగా స్కెచ్.. * గతంలో హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసిన రాజారావు.. వచ్చే ఎన్నికల్లో చింతలపూడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసేందుకు వీలుగా ఇటీవలే విశాఖకు మకాం మార్చారు. * ఏలూరుకు చెందిన టీడీపీ నేత మాగంటి బాబు ద్వారా పార్టీలో చేరిన ఈయన ఎనిమిది నెలలుగా చింతలపూడిలో భారీగా ఖర్చుచేస్తున్నారు. * ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థుల కోసం బొమ్మరిల్లు సంస్థ నుంచి రూ.3 కోట్లకు పైగా సొమ్ము మళ్లించినట్లు సమాచారం. వీటన్నింటిపై పోలీసులు దృష్టి సారించారు. * ఆర్బీఐ, సెబీ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసిన రాజారావు.. రాజకీయాల్లో చేరడం ద్వారా రక్షణ పొందాలనే వ్యూహంతోనే టీడీపీలో చేరారని పోలీసులు అనుమానిస్తున్నారు. * ఈ వ్యూహంలో భాగంగానే బొమ్మరిల్లు సంస్థల చైర్మన్, ఎండీ పదవులనుంచి తప్పుకొంటున్నట్లు నాటకం ఆడి డెరైక్టర్ల పేరిట కొందరు అనామకులను తెరపైకి తీసుకువచ్చారు. * బొమ్మరిల్లు డెరైక్టర్లుగా ఉన్న వానపల్లి వెంకటరావు, సాధ శ్రీనివాసరావు, కమ్మెల బాపూజీ, గోవిందు ఎర్రయ్య, మేనేజర్ సత్యనారాయణలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మోసం ఇలా.. * 2011, ఆగస్టులో రాజారావు బొమ్మరిల్లు సంస్థను ప్రారంభించారు. హైదరాబాద్‌లో రాజా హోమ్స్, విశాఖలో బొమ్మరిల్లు రియల్ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ సహా పలు సంస్థలను ఏర్పాటు చేశారు. * సినీనటులు, రాజకీయ నేతలతో ఆర్భాటంగా వెంచర్లు ప్రారంభింపజేశారు. ప్రజల నుంచి భారీగా డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. * కరీంనగర్, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, కడప, తూర్పు గోదావరి తదితర జిల్లాలతో పాటు ఒడిశాలోనూ డిపాజిట్లు సేకరించారు. * దాదాపు 3 వేల మంది ఏజెంట్లను నియమించి 40 వేల మంది నుంచి రూ.100 కోట్ల మేర డిపాజిట్లు సేకరించినట్లు తేలింది. ఇందులో ఇప్పటి వరకూ రూ. 20 కోట్లు మాత్రమే చెల్లించారు. * సంస్థ పేరిట ఉందంటున్న 300 ఎకరాల భూమి కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ కాలేదని సమాచారం.