తేల్చుకుందాం.. రా
♦ ప్రభుత్వ విప్ చింతమనేనిపై మంత్రి సుజాత ఫైర్
♦ నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏమిటంటూ నిలదీత
♦ వాడీవేడిగా టీడీపీ జిల్లా సమన్వయకమిటీ సమావేశం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి వస్తావా.. రా తేల్చుకుందాం. అయినా నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏంటి’ అంటూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై ఫైర్ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఏలూరులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో ఒక సినిమా థియేటర్ ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యే అయిన పీతల సుజాతను పిలవకుండా, విప్ చింతమనేని ప్రభాకర్‌ను పిలిచారు. దీనికి చింతమనేని హాజరయ్యారు. ఈ విషయం టీడీపీ సమావేశంలో చర్చకు వచ్చింది. తనను ఆహ్వానించటంతో వెళ్లానని, దీనికి మంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటని చింతమనేని ప్రశ్నించినట్టు తెలిసింది. తనకు ఆహ్వానం లేనిచోట మరొకరు వచ్చి పాల్గొనడం ఎంతవరకూ సమంజసమని పీతల సుజాత ప్రశ్నించగా.. చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని, తనను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తానని చింతమనేని సమాధానం చెప్పినట్టు భోగట్టా.
దీంతో మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రా తేల్చుకుందాం. ఎస్సీ నియోజకవర్గం అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు’ అని సీరియస్‌గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది. ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకుండా వేరే నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. మంత్రి సుజాత మాట్లాడుతూ తానూ పార్టీలో సీనియర్‌నని, పార్టీ కోసం కష్టపడ్డానని, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు విలువ ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తే.. చూస్తూ ఊరుకోనని స్పష్టం చేసినట్టు సమాచారం. మంత్రి అయ్యన్నపాత్రుడు ఇరువురికి నచ్చజెప్పడంతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగింది.