chintamani Prabhakar
-
తేల్చుకుందాం.. రా
♦ ప్రభుత్వ విప్ చింతమనేనిపై మంత్రి సుజాత ఫైర్ ♦ నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏమిటంటూ నిలదీత ♦ వాడీవేడిగా టీడీపీ జిల్లా సమన్వయకమిటీ సమావేశం సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి వస్తావా.. రా తేల్చుకుందాం. అయినా నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏంటి’ అంటూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై ఫైర్ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఏలూరులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో ఒక సినిమా థియేటర్ ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యే అయిన పీతల సుజాతను పిలవకుండా, విప్ చింతమనేని ప్రభాకర్‌ను పిలిచారు. దీనికి చింతమనేని హాజరయ్యారు. ఈ విషయం టీడీపీ సమావేశంలో చర్చకు వచ్చింది. తనను ఆహ్వానించటంతో వెళ్లానని, దీనికి మంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటని చింతమనేని ప్రశ్నించినట్టు తెలిసింది. తనకు ఆహ్వానం లేనిచోట మరొకరు వచ్చి పాల్గొనడం ఎంతవరకూ సమంజసమని పీతల సుజాత ప్రశ్నించగా.. చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని, తనను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తానని చింతమనేని సమాధానం చెప్పినట్టు భోగట్టా. దీంతో మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రా తేల్చుకుందాం. ఎస్సీ నియోజకవర్గం అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు’ అని సీరియస్‌గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది. ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకుండా వేరే నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. మంత్రి సుజాత మాట్లాడుతూ తానూ పార్టీలో సీనియర్‌నని, పార్టీ కోసం కష్టపడ్డానని, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు విలువ ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తే.. చూస్తూ ఊరుకోనని స్పష్టం చేసినట్టు సమాచారం. మంత్రి అయ్యన్నపాత్రుడు ఇరువురికి నచ్చజెప్పడంతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగింది. -
మరో వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే చింతమనేని తనపై దాడి చేశారని ఏలూరుకు చెందిన పోలీసు కానిస్టేబుల్ మధు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఓ సివిల్ తగాదాలో చింతమనేని జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో కానిస్టేబుల్ మధుపై దాడి చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో డి.వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్‌తో పాటు ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే కోల్లేరు ప్రాంతంలో అటవీశాఖ నిబంధనలకు విరుద్ధంగా రహదారిని నిర్మించారు. అదికూడా ఆటవీశాఖ అధికారుల సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. -
చింతమనేనికి 150 ఎకరాల చేపల చెరువులు
ఏలూరు: ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చీటికీమాటికీ ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలు, దాడులు చేయడం మానుకోవాలని ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.విద్యాసాగర్ కోరారు. సోమవారం ‘సాక్షి’ ప్రతి నిధితో ఆయన మాట్లాడుతూ చింతమనేని తీరును తీవ్రంగా ఖండించారు. కొల్లేరు అభయారణ్య ప్రాం తంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేయడాన్ని అడ్డుకోబోయిన అధికారులపై దాడులు చేయడం దారుణమన్నారు. ఏలూరు మండలం కోమటిలంక వాసుల చిరకాల డిమాండ్ పేరిట చింతమనేని తన వ్యక్తిగత అవసరాల కోసమే రోడ్డు వేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఆయనకు 150 ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ‘ఇది మేం ఇప్పుడు చెబుతున్న మాట కాదు. గతంలోనే అన్నాం. జిల్లా అధికారుల అండతో చింతమనేని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని గతంలోనే చెప్పాం. అది మరోసారి అక్షరాలా నిజమైంది’ అని సాగర్ వ్యాఖ్యానించారు. చింతమనేని వ్యక్తిగత తీరు తమకు అనవసరమని, కానీ ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టడం ఆయన మానుకోవాలని, లేనిపక్షంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఇసుక మాఫియా చేతిలో చంద్రబాబు బందీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఇసుకు మాఫియా చేతిలో బందీ అయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ... ఇసుక మాఫియా ప్రతినిధిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్ డి.వనజాక్షిపై దాడి చేసిన పార్టీ ఎమ్మెల్యే చింతమననే ప్రభాకర్‌ను విప్ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డీఎస్పీ హరినాథ్‌రెడ్డితో గొడవ జరిగితే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని గుర్తు చేశారు. భూమా నాగిరెడ్డికి ఓ న్యాయం... చింతమనేనికి మరో న్యాయమా ? అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిలదీశారు.