చింతమనేనికి 150 ఎకరాల చేపల చెరువులు
ఏలూరు: ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చీటికీమాటికీ ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలు, దాడులు చేయడం మానుకోవాలని ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.విద్యాసాగర్ కోరారు. సోమవారం ‘సాక్షి’ ప్రతి నిధితో ఆయన మాట్లాడుతూ చింతమనేని తీరును తీవ్రంగా ఖండించారు. కొల్లేరు అభయారణ్య ప్రాం తంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేయడాన్ని అడ్డుకోబోయిన అధికారులపై దాడులు చేయడం దారుణమన్నారు.
ఏలూరు మండలం కోమటిలంక వాసుల చిరకాల డిమాండ్ పేరిట చింతమనేని తన వ్యక్తిగత అవసరాల కోసమే రోడ్డు వేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఆయనకు 150 ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ‘ఇది మేం ఇప్పుడు చెబుతున్న మాట కాదు. గతంలోనే అన్నాం. జిల్లా అధికారుల అండతో చింతమనేని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని గతంలోనే చెప్పాం. అది మరోసారి అక్షరాలా నిజమైంది’ అని సాగర్ వ్యాఖ్యానించారు.
చింతమనేని వ్యక్తిగత తీరు తమకు అనవసరమని, కానీ ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టడం ఆయన మానుకోవాలని, లేనిపక్షంలో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.